బాబు -బాబో - బాబోయ్ .. !
సీఎం చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు.. మంచివే అయినా.. తమ్ముళ్లలో గుబులు రేపుతున్నాయి.;
సీఎం చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు.. మంచివే అయినా.. తమ్ముళ్లలో గుబులు రేపుతున్నాయి. నేరుగా చంద్రబాబు వారిని ఏమీ అనకపోయినా.. ఇటు సోషల్ మీడియాలోను.. అటు ప్రధాన మీడియాలో ను పెద్ద ఎత్తున వస్తున్న విశ్లేషణలు, వార్తలు.. నాయకులను ఉక్కిరి బిక్కిరికి గురి చేస్తున్నాయి. దీనికి ప్రధాన ఉదాహరణ పీ-4. ఈ కార్యక్రమం కింద ధనవంతులైన వారు పేదలను దత్తత తీసుకోవాలని చంద్రబాబు చెబుతున్నారు. తాను స్వయంగా 250 కుటుంబాలను దత్తత తీసుకున్నానని పదే పదే చెబుతున్నారు. తీసుకున్నారు కూడా.
అయితే.. ఈ పరిణామం.. స్థానికంగా ఎమ్మెల్యేలు, ఎంపీలపైనా ప్రభావం చూపుతోంది. జిల్లాల వారీగా ఉన్న నాయకులపై వార్తలు వచ్చేలా సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చేలా కూడా చేస్తోంది. ఇది ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం టీడీపీలో 70 శాతం మంది ఎమ్మెల్యేలు, 90 శాతంమంది ఎంపీలు అత్యంత ధనవంతులు. గుంటూరు ఎంపీ దేశంలోనే అత్యంత ధనవంతుడైన ఎంపీగా ఉన్నారన్నది తెలిసిందే. వీరంతా కూడా పీ-4లో ఎందుకు భాగస్వామ్యం కావడం లేదన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ.
అయితే.. వారు మాత్రం అనేక కోణాల్లో ఆలోచన చేస్తున్నారు. పేదరికాన్ని రూపు మాపడం మంచిదే అయినా.. అది సాధ్యం కాదన్నది నిశ్చితాభిప్రాయం. పైగా.. రాజకీయాల్లో ఉన్న నాయకులు చేయలేమని.. చెబుతున్నారు.అలాగని వారిపై వస్తున్న వార్తలను, సోషల్ మీడియా కామెంట్లను మాత్రం వారు ఆపలేక పోతున్నారు. ఈ పరిణామమే .. ఇబ్బందిగా మారింది. దీంతో చంద్రబాబు సంకల్పంపై కొందరు అంతర్గత చర్చల్లో బాబోయ్ అనేస్తున్నారు. వాస్తవానికి చంద్రబాబు ఎవరినీ ఒత్తిడి చేయడం లేదు.
పైగా పీ-4లో మార్గదర్శకులుగా చేరేవారు తమ ఇష్టానుసారంగా చేరొచ్చని కూడా ఇటీవల తేల్చి చెప్పారు. ఈ విషయంలో చంద్రబాబు క్లారిటీతోనే ఉన్నారు. అయినప్పటికీ.. ఎంపీలు, ఎమ్మెల్యేలపై మాత్రం ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఒకరిద్దరు ఎంపీలు.. పీ-4లో నేరుగా తాము జోక్యం చేసుకోకుండా. కొంత మేరకు ఫండ్ ఇస్తామని.. పీ-4 ఫండ్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు కు సూచనలు చేశారు. ఇది కూడా మంచిదే. సమాజంలో అందరూ నేరుగా దత్తత తీసుకోకపోయినా.. ఫండ్ ఇచ్చేందుకు రెడీగా ఉంటారు. మరి దీనిని సాకారం చేస్తే.. చంద్రబాబు ఆశయం పరుగులు పెట్టే అవకాశం ఉంటుంది.