అమెరికాలో ఇంత అన్యాయమా?

అమెరికాలో ఉన్న ఒక అంతర్జాతీయ విద్యార్థికి ఎదురైన దురదృష్టకర సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.;

Update: 2025-07-10 12:30 GMT

అమెరికాలో ఉన్న ఒక అంతర్జాతీయ విద్యార్థికి ఎదురైన దురదృష్టకర సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అన్ని నిబంధనలు పాటిస్తూ OPT (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ) అనుమతి పొంది, అధికారిక ఈఏడీ (ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ ) చేతిలో ఉన్నప్పటికీ అతని విశ్వవిద్యాలయం అనవసర నిబంధనలు విధించి ఉద్యోగంలో చేరకుండా అడ్డుకుంది. ఈ విషయాన్ని సదరు విద్యార్థి సోషల్ మీడియాలో పంచుకోగా, విద్యార్థి సంఘాలు, నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.

- ఒక కాగితం కోల్పోయినందుకేనా ఈ ఆంక్షలు?

విద్యార్థి చెప్పిన వివరాల ప్రకారం.. USCIS ఆన్‌లైన్‌లో ఉన్న ఉద్యోగ అనుమతి స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ అతని విశ్వవిద్యాలయం మాత్రం USCIS పంపే “పేపర్ అప్రూవల్ నోటీసు” తప్ప మరేదీ అంగీకరించదట. దురదృష్టవశాత్తు, ఆ పత్రాన్ని విద్యార్థి పోగొట్టుకున్నాడు. ఇప్పుడు కొత్తగా పొందాలంటే Form I-824 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దీనికి అదనంగా $469 ఖర్చవుతుంది. ఇది చాలా మంది ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థులకు భారమే.

- USCIS స్పష్టత, యూనివర్సిటీ నిర్లక్ష్యం!

వాస్తవానికి, USCIS అధికారికంగా పేర్కొన్న దాని ప్రకారం.. డిజిటల్ అప్రూవల్ పత్రం పూర్తిగా చట్టబద్ధమైనదే. అయినప్పటికీ విశ్వవిద్యాలయం తమ పాత పద్ధతులను మార్చడానికి నిరాకరిస్తోంది. ఇదే పరిస్థితిలో ఉన్న ఇతర విద్యార్థులకు కూడా SEVIS (స్టూడెంట్ మరియు ఎక్స్ చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టం) అప్‌డేట్ కావడం లేదు, దీంతో వారికి ఉద్యోగ అవకాశాలు పూర్తిగా దూరం అవుతున్నాయి.

- ఉద్యోగం అంచున, సహాయం సున్నా!

సదరు విద్యార్థికి ఉద్యోగం మరుసటి రోజే ప్రారంభం కావాల్సి ఉండగా, విశ్వవిద్యాలయం నుంచి ఎటువంటి సహాయం లభించలేదు. SEVIS లో ఎంట్రీ లేకపోవడం వల్ల ఉద్యోగంలో చేరే అవకాశం లేకుండా పోయింది. OPT ద్వారా పని చేయాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులకు ఎదురయ్యే అతి పెద్ద సమస్యలలో ఇది ఒకటి. ఉద్యోగాలు పొందడమే కష్టంగా మారిన ఈ తరుణంలో విశ్వవిద్యాలయాలు ఇలాంటి అదనపు నిబంధనలు విధించడం విద్యార్థులకు మరింత కష్టంగా మారింది.

-నెటిజన్ల ఆగ్రహం: మానవత్వంతో కూడిన వ్యవస్థ అవసరం!

ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. "అధికారికంగా అనుమతులు ఉన్నా, కాలేజీలు తాము తయారుచేసుకున్న నిబంధనల వల్ల విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి" అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక విద్యార్థి చట్టబద్ధంగా అనుమతిని పొందినప్పటికీ, విద్యాసంస్థలు వారి స్వంత నిబంధనలను తలకెత్తుకుని ఉద్యోగ అవకాశాలను దెబ్బతీయడం తీవ్రంగా విమర్శించదగిన విషయం. విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఇలాంటి వ్యవహారాలు మానవత్వంతో కూడినవి కావాలి. అంతర్జాతీయ విద్యార్థులకు మార్గదర్శక వ్యవస్థ అత్యవసరం. ఇలాంటి అన్యాయాలు మళ్లీ జరగకుండా నిరోధించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News