మోడీ బ్యాక్ డోర్ బిల్ ను భలేగా దెబ్బేసిన విపక్షాలు

నిజానికి ఈ తీరే.. 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై పీటముడి పడేలా చేసిందని చెప్పాలి. విషయాన్ని సూటిగా.. స్పష్టంగా చెబితే సరిపోయేది.;

Update: 2026-04-18 05:30 GMT

‘సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు అలాగా’అనే డైలాగ్ గుర్తుందా? సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో పెద్దోడు వెంకటేశ్.. చిన్నోడు మహేశ్ బాబులను ఉద్దేశించి వాళ్ల బామ్మ పాత్రలో పోషించిన రోహిణి హట్టంగడి చెప్పే ఈ డైలాగ్ కు తగ్గట్లే శుక్రవారం లోక్ సభను చూసినప్పుడు మనసులో ఒక్కసారి ఫ్లాష్ కావటం ఖాయం. 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశ పెట్టిన మోడీ సర్కారు.. బిల్లును పాస్ చేయించుకోవటం మీద కంటే కూడా.. తాము అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలన్న మొండితనాన్ని ప్రదర్శిస్తే.. మీకే అంత ఉంటే.. మాకెంత ఉండాలన్నట్లుగా విపక్షాలు వ్యవహరించాయి. మొత్తంగా చూసినప్పుడు సామాన్యుడి కోణంలో.. ‘సరిపోయారు ఇద్దరు’ అనుకోకుండా ఉండలేని పరిస్థితి.

ఎందుకిలా? అంటే..అక్కడికే వస్తున్నాం. ఒక కీలకమైన బిల్లును ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశ పెట్టటానికి ముందు.. అందుకు తగ్గట్లు రంగాన్ని సిద్ధం చేయాలి. తాము ప్రవేవ పెట్టే బిల్లు ఉద్దేశాన్ని అందరికి కాకుండా..కీలక విపక్షాలకు వివరించాలి. సదరు బిల్లుతో జరిగే లాభం ఏంటి? నివారించే నష్టం ఏమిటి? అన్న విషయాల్ని చెప్పాలి. అనవసరమైన ఇష్యూస్ కు చెక్ పెట్టేలా ఉన్నప్పుడు.. ఆ విషయాన్ని వారితో చెప్పి.. మీ సలహాలు.. సూచనలు చెప్పండని కోరితే మరింత బాగుంటుంది. కానీ.. 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశ పెట్టిన టైం.. విధానాన్ని చూస్తే.. మాకు బలం ఉంది.. అవసరమైన బలాన్ని అరువు తెచ్చుకుంటామన్న రీతిలో వ్యవహరించిందే తప్పించి..విపక్షాలు మొత్తాన్ని కాకున్నా.. బిల్లు పాస్ అయ్యేందుకు అవసరమైన వారిని కలుపుకుపోయే తీరును ప్రదర్శించలేదు.

అన్నింటికి మించి.. మూడు బిల్లులను ఒకేసారి తెర మీదకు తీసుకొచ్చి.. అసలు అంశాన్ని పక్కన పెట్టి.. కొసరు అంశాన్ని.. ఇప్పటికే పాస్ అయిన మహిళా బిల్లుకు సంబంధించిన కొంత మార్పులు చేసి.. మళ్లీ తెర మీదకు తీసుకొచ్చిన వైనం చూస్తే.. మేం అనుకున్నది చేస్తాం.. మీతో మాకు సంబంధం లేదన్నట్లుగా మోడీ అండ్ కో విపక్షాలకు తమదైన సందేశాన్ని ఇచ్చారని చెప్పాలి.

నిజానికి ఈ తీరే.. 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై పీటముడి పడేలా చేసిందని చెప్పాలి. విషయాన్ని సూటిగా.. స్పష్టంగా చెబితే సరిపోయేది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వెనుక ఉద్దేశాలు కీలక విపక్షాలకు వెల్లడించకుండా.. తమకున్న బలాన్ని చూపిస్తూ.. బ్యాక్ డోర్ తరహాలో వ్యవహరించిన తీరు పలు విపక్ష పార్టీలకు మండేలా చేశాయి. అందుకే.. మొండి మోడీకి తమదైన షాక్ ఇచ్చేందుకు ఆత్రుతగా ఉన్న సదరు పార్టీలు ఆ పనిని విజయవంతంగా పూర్తి చేశాయని చెప్పాలి.

ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే డీలిమిటేషన్ విషయంలో.. మోడీ సర్కారు ప్రతిపాదించిన 50 శాతం సీట్ల పెంపు.. అందరికి ఆమోదయోగ్యమైన మార్గంగా చెప్పాలి. కానీ.. ఆ విషయాన్ని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మొదలు.. మిగిలిన పార్టీలకు ఆ విషయాన్ని అర్థమయ్యేలా చెప్పటం.. అనవసర గందరగోళాన్ని క్రియేట్ చేయటం.. వివరాల్ని పూర్తిగా షేర్ చేసుకోకపోవటం.. విపక్ష రాజకీయ పార్టీలు సైతం కొన్ని కీలక అంశాల్లో కలిసి నడుద్దామన్న రీతిలో కేంద్రం వ్యవహరించలేదు.

ఈ తీరే..శుక్రవారం సభలో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయేలా చేసిందని చెప్పాలి. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాల్ని చూస్తే.. విపక్షానికి తగిన మర్యాద ఇవ్వటం..కీలకమైన నిర్ణయాల్లో వారిని సైతం పాత్రధారులు చేసే విషయంలో వైఫల్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పాలి. ఇదంతా చూస్తే.. మొండి మోడీకి వీగిపోయే బహుమతిని విపక్షాలు 131వ రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో ఇచ్చాయని చెప్పక తప్పదు. ఇప్పటికైనా మొండి మోడీ తన తీరును కాస్తంత మార్చుకుంటే బెటర్. లేదంటే.. ఇలాంటి ఎదురుదెబ్బలు మరిన్ని ఎదురుచూస్తుంటాయన్న విషయాన్ని ఆయన గుర్తిస్తే మంచిది.

Tags:    

Similar News