పాక్ గగనతలంపై ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్... పిక్ వైరల్!

అవును... భారత్ తో పాటు అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ విమానాలను దారి మళ్లించడంతో పాక్ వైమానిక ప్రాంతం నిశ్శబ్ధంగా మారిపోయింది.;

Update: 2025-05-07 10:11 GMT

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో పాక్ ఒక్కసారిగా విలవిల్లాడిపోయిన సంగతి తెలిసిందే! అంతకంటే ముందు భారత వైమానిక సంస్థ మాత్రమే కాకుండా అంతర్జాతీయ విమానయాన సంస్థలు కూడా తమ విమానాలను దారి మళ్లించడంతో పాకిస్థాన్ వైమానిక గగనతలం మూగబోయింది!


అవును... భారత్ తో పాటు అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ విమానాలను దారి మళ్లించడంతో పాక్ వైమానిక ప్రాంతం నిశ్శబ్ధంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో విలువైన విదేశీ మారకద్రవ్యాన్ని ఇస్లామాబాద్ కోల్పోతోందని.. పాక్ వైమానిక సంస్థ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోందని చెబుతున్నారు.

వాస్తవానికి ఎయిర్ ఇండియా, ఇండిగోతో సహా భారత విమానయాన సంస్థలు పాక్ గగనతలాన్ని నివారించడం వల్ల.. పొడవైన మార్గాలు, అధిక నిర్వహణ ఖర్చులు వచ్చాయి. అయితే... విమానయాన ఆదాయం పరంగా ఇది ఇస్లామాబాద్ కు అతి భారీ నష్టాన్ని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆకాశ యుద్ధంలో భారత్ ఎగురుతుంటే.. పాక్ మునిగిపోయిందని చెబుతున్నారు.

ప్రస్తుతం అగ్ర విమానయాన సంస్థలు ఎయిర్ ఫ్రాన్స్, ఎయిరేట్స్, బీఏ, లుఫ్తాన్సా వంటి విమానాలు పాక్ గగనతలాన్ని పూర్తిగా విస్మరించాయి. ఇదే సమయంలో పాకిస్థాన్ కు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఖతార్ ఎయిర్ వేస్ ప్రకటించింది. దీనివల్ల వందల మిలియన్ల విలువైన ఓవర్ ఫ్లైట్ ఫీజుల కారణంగా పాక్ ఫారెక్స్ కు భారీ దెబ్బ తగిలిందని చెబుతున్నారు.

ప్రపంచంలో మూడవ అతిపెద్ద, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్ లో భాగంగా... భారత్ నుంచి పాక్ కు ఓవర్ ఫ్లైట్ ఫీజులు కీలక ఆదాయ వనరుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాక్ గగనతలం నుంచి వెళ్లే అన్ని విమానాలు ఇప్పుడు బంగాళాఖాతం మీదుగా, వయా భారత్ వెళ్తున్నాయి!

గగనతలం పరిస్థితి అలా ఉంటే... ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్థాన్ లో ఎమర్జెన్సీ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... అన్ని ఎయిర్ పోర్టులతో పాటు పోర్టులను మూసేసినట్లు చెబుతున్నారు. అదేవిధంగా... స్కూళ్లు, ఆఫీసులకు కూడా సెలవులు ప్రకటించినట్లు సమాచారం. ఇదే సమయంలో మెడికల్ ఎమర్జెన్సీ కూడా ప్రకటించడం గమనార్హం!

Tags:    

Similar News