ఆశ్చర్యాన్ని గొలుపుతున్న నిజాం కాలం నాటి లిఫ్ట్.. ఇది ఎలా పని చేస్తుందంటే..?

ఈ చారిత్రక లిఫ్ట్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని పురానాహవేలీలోని నిజాం మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు.;

Update: 2025-10-12 06:17 GMT

ప్రపంచం కళ్లు తెరవక ముందే భారత్ పరుగెడుతుంది. ఇది జగమెరిగిన సత్యం. మన పురాణ గ్రంథాల్లో ఆధ్యాత్మికతో పాటు టెక్నాలజీ కూడా మెల్ట్ అయ్యింది. కాబట్టే మనం ప్రపంచంతో పోలిస్తే ముందుగా ఉన్నాం. కానీ ప్రాశ్చాత్యుల పాలన మన విలువైన సంపదను దోచుకోవడంతో మనం ఇప్పుడు ప్రపంచంలో వెనుకబడ్డాం. భారత్ లో ఏ మూలను పాలించిన రాజులైనా సంపదలో ప్రంపంచంలో కెల్లా మేటిగా ఉన్నారు. అంత సంపద కూడా నేడు తిరిగిరాకుండా పోయింది.

నిజాం కాలంలో లిఫ్ట్ వాడేవారు. ఇది నేడు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ రోజుల్లో లిఫ్ట్‌ అంటే కేవలం సాంకేతిక సౌకర్యం మాత్రమే. కానీ దాదాపు 150 ఏళ్ల క్రితం లిఫ్ట్‌ ఆలోచన ఎవరూ ఊహించనిది కదా.. హైదరాబాద్‌లోని నిజాం నవాబులు తమ దైనందిన జీవితంలో లిఫ్ట్ ను వినియోగించారంటే ఆశ్చర్యం కలుగకమానదు కదా.. ప్రపంచంలో సాంకేతిక పరిణామం ప్రారంభ దశలో ఉండగా, హైదరాబాద్‌ రాజవంశం ఆధునికతను ముందుగానే ఆచరించడం వారి దూరదృష్టికి నిదర్శనం.

విద్యుత్తు లేకుండా పనిచేసిన లిఫ్ట్‌

ఇది కేవలం సాధారణ లిఫ్ట్‌ కాదు. విద్యుత్ లేకుండానే పనిచేసేది. ఆ కాలం ఇంజినీర్లు దీనిని రూపొందించారు. బలమైన ఇనుప తాళ్లు, గేర్‌ చక్రాల సాయంతో, మానవ శక్తి ఆధారంగా లిఫ్ట్‌ కదిలేది. ఇది అప్పటి ప్రపంచ సాంకేతికతలోనే అరుదైన వినూత్న ఆవిష్కరణ. మొదటగా ‘ఆరో నిజాం మీర్‌ మెహబూబ్‌ అలీఖాన్‌’ ఈ లిఫ్ట్‌ ఉపయోగించారు. ఆయన ఆధునికతకు, యాంత్రిక పరిజ్ఞానంపై ఆసక్తికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఆ తర్వాత చివరి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ కూడా దీన్ని వినియోగించేవారు.

లండన్‌ ఆవిష్కర్తల చేతుల్లో పుట్టిన అద్భుతం

ఈ లిఫ్ట్‌ను లండన్‌కు చెందిన ఆర్‌వే గుడ్‌ కంపెనీ నిజాం రాజభవనాల కోసం తయారు చేసి ఇచ్చింది. సుమారు 8 మందిని ఒకేసారి పైఅంతస్తుకు తీసుకెళ్లగలిగే సామర్థ్యం దీనికి ఉంది. మొత్తం నిర్మాణం చెక్కతో, ఇనుప పట్టీలతో చేశారు. అయితే దీన్ని మోటార్ తో నడిపేవారు కాదు.. మోటార్ ప్లేస్ లో మనుషులు ఉండేవారు. అంటే, లిఫ్ట్‌ను కదిలించడానికి కొందరు సేవకులు చేతితో తాళ్లను బలంగా లాగేవారు.

నేటికీ పురానాహవేలి మ్యూజియంలో..

ఈ చారిత్రక లిఫ్ట్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని పురానాహవేలీలోని నిజాం మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ లిఫ్ట్‌ ఇప్పటికీ పని చేసే స్థితిలోనే ఉంది! చెక్కతో తయారైన ఫ్రేములు, ఇనుప రాడ్లు, లివర్లు అన్నీ అసలు రూపంలోనే ఉన్నాయి. మ్యూజియాన్ని సందర్శించే ఈ లిఫ్ట్‌ ముందు ఆగి కాసేపు తేరగా చూస్తారు.

ఆధునికత, సాంస్కృతిక వైభవం

హైదరాబాద్‌ నిజాంలు కేవలం సంపదలోనే కాదు.. ఆధునికతలోనూ ముందు ఉన్నారు. రైల్వే, పోస్టల్‌ సిస్టం, విద్యుత్, జలమార్గాలు, హాస్పిటల్స్ అన్నింటికీ పునాదులు వేశారు. ఆ జాబితాలో ఈ లిఫ్ట్‌ కూడా గొప్ప చారిత్రక ఘట్టం. ఆ కాలంలో యాంత్రిక పరికరాలను ఉపయోగించడం అంటే సాంకేతిక దృష్టి, ఆలోచనా విస్తృతి రెండింటి మేళవింపు.

ఒక స్మారక చిహ్నం

ఈ లిఫ్ట్‌ కేవలం ఒక మ్యూజియంలోని వస్తువు మాత్రమే కాదు.. భారత సాంకేతిక చరిత్రలో ఒక మైలురాయి. దేశంలో విద్యుత్తు పూర్వ యుగంలో కూడా ఇలాంటి సాంకేతికత సాధ్యమైందన్న నిదర్శనం. నిజాం నవాబుల రాజభవనాల్లో జీవనశైలి ఎంత ఆలోచనాత్మకంగా, సౌకర్యవంతంగా ఉందో ఇది తెలియజేస్తుంది.

నేటి ప్రపంచం సాంకేతిక విప్లవాలతో పరిగెడుతున్నా, 19వ శతాబ్దపు హైదరాబాద్‌ నిజాంలు చూపిన దూరదృష్టి ఆలోచనలను మించిపోవడం కష్టం. విద్యుత్తు లేకుండా పనిచేసే లిఫ్ట్‌ అనే ఆలోచన, ఆ కాలపు పరిమితుల్లోనూ సాధ్యమైన ఆవిష్కరణ. ఆ లిఫ్ట్‌ కేవలం ఒక యాంత్రిక పరికరం కాదు అది హైదరాబాద్‌ చరిత్రలో ఆధునికతకు ప్రతీక, సాంస్కృతిక వారసత్వానికి అద్దం.

Tags:    

Similar News