నితీష్ వారసుడు బీహార్ సీఎం అవుతారా ?
మరో వైపు చూస్తే తనకు రాజకీయాలు అసలు పడవని ఆధ్యాత్మిక మార్గమే ఇష్టమని గతంలో అనేక సార్లు చెప్పిన నిశాంత్ కుమార్ ఇపుడు పార్టీ వేదికల మీద కనిపిస్తున్నారు.;
బీహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ ఫ్యాక్టర్ ని కొట్టిపారేయడానికి ఏ మాత్రం వీలు లేదు. ఆయన యాభై ఏళ్ళ క్రితం ఎమర్జెన్సీ సమయంలో లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ పిలుపు మేరకు విద్యార్ధిగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చారు. అలా ఆయన మీద లోక్ నాయక్ ప్రభావంతో పాటు రాం మనోహర్ లోహియా వంటి వారి ప్రభావం ఉంది. ఇక 1985లో తొలిసారి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టిన నితీష్ కుమార్ ఎన్నికల రాజకీయానికి నాలుగు దశాబ్దాలు అయింది.
ఆయన రాష్ట్రంలో మంత్రిగా కేంద్రంలో మంత్రిగా ఎన్నో కీలక శాఖలను చూశారు. దాదాపుగా పాతికేళ్ళ పాటు బీహార్ ని పాలించిన సీఎంగా అరుదైన రికార్డుని ఆయన సోంతం చేసుకోబోతున్నారు. ఇదే సమయంలో నితీష్ కుమార్ కి క్లీన్ ఇమేజ్ ఉంది. అవినీతి మచ్చ లేదు. నిజాయతీపరుడు అన్న పేరు ఉంది. బీహార్ ని నయా బీహార్ గా మార్చి అభివృద్ధికి బాటలు వేశారు అన్న కీర్తి కూడా ఉంది. ఒకప్పుడు బీహార్ అంటే లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉండదని ఇంకా ఏవేవో విమర్శలు ఉండేవి. దానిని విమర్శగా కూడా చేసుకుని ఇతర రాష్ట్రాల వారు ప్రత్యర్థులు మీద ఆరోపణలకు ఉపయోగించేవారు.
అటువంటి బీహార్ ఇపుడు చూస్తే కనుక చాలా మారిపోయింది అంటే సుదీర్ఘకాలం పాలించిన నితీష్ కుమార్ కే ఆ గొప్పతనం దక్కుతుంది. ఇక చూడబోతే నితీష్ కుమార్ ఈ మధ్య ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందిపడుతున్నారని వార్తలు ఉన్నాయి. ఆయన వింత పోకడల మీద విపక్షం విమర్శలు చస్తోంది. దాంతో ఆయన సొంత పార్టీ జేడీయూ నేతలు అంతా ఇపుడు కొత్త ఆల్టర్నేషన్ గా పార్టీలో చూస్తున్నారు అని టాక్ ఉంది.
ఆ ప్రత్యామ్నాయమే నితీష్ కుమార్ కొడుకు నిశాంత్ కుమార్ అని వారంతా భావిస్తున్నారు. నితీష్ కుమార్ వయసు ఏడున్నర పదులుగా ఉంది. ఆయనకు ఏకైక కుమారుడు నిశాంత్. ఇక నితీష్ సతీమణి చాలా కాలం క్రితమే మరణించారు. నితీష్ కుమార్ అయితే వారసత్వ రాజకీయాలకు విరుద్ధం. ఆయన లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ పాలనను పూర్తిగా వ్యతిరేకించారు. అలాంటి నితీష్ కుమార్ సైతం ఇపుడు కుమారుడి మీద మొగ్గు చూపుతున్నారు అని వార్తలు వస్తున్నాయి.
మరో వైపు చూస్తే తనకు రాజకీయాలు అసలు పడవని ఆధ్యాత్మిక మార్గమే ఇష్టమని గతంలో అనేక సార్లు చెప్పిన నిశాంత్ కుమార్ ఇపుడు పార్టీ వేదికల మీద కనిపిస్తున్నారు. తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో ఆయన బీహార్ లోని నలందా జిల్లా హర్నాట్ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేస్తారు అని అంటున్నారు.
ఈ సీటు నుంచే ఎందుకు అంటే నితీష్ కుమార్ కూడా తొలిసారి ఇక్కడ నుంచే పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత ఆయన రాజకీయ జీవితం అప్రతిహతంగా ముందుకు సాగింది. ఇక రెండు దశాబ్దాలుగా చూస్తే జేడీయూ నుంచే ఎమ్మెల్యేలు అక్కడ నుంచి గెలుస్తూ వస్తున్నారు ఒక విధంగా చెప్పాలీ అంటే జేడీయూకి ఈ సీటు కంచుకోట. అంతే కాదు సెంటిమెంట్ సీటు అని అంటున్నారు.
దాంతో నిశాంత్ రాజకీయ అరంగేట్రానికి సీటు రెడీ అని చెబుతున్నారు. తొందరలోనే పార్టీ శాసనసభా పక్ష వేదిక మీద ఈ విషయం ప్రస్తావించాలని నాయకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు నిశాంత్ రాజకీయ ఎంట్రీ మీద భారీ ప్రకటనలు చేస్తున్నారు మరో వైపు చూస్తే నితీష్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్డీయే కూటమి వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతుందని జేడీయూ నేతలు చెబుతున్నారు.
ఎన్నికలు ముగిసి ఎండీయే మరోసారి అధికారం చేపడితే సహజంగానే నితీష్ సీఎం అవుతారని ఆ తరువాత కొంతకాలం తరువాత తండ్రి నుంచి నిషాంత్ కి సీఎం సీటు బదిలీ అయ్యేలా చక్రం తిప్పాలని జేడీయూ నేతలు భావిస్తున్నరుట. మరి నితీష్ కుమారుడికి సీఎం యోగం ఉందా అంటే వీచి చూడాల్సిందే.