బెంగాల్ ద‌క్కింది.. ఇక‌, తెలంగాణ వంతు: మోడీ

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో బీజేపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌డం ఖాయ‌మ‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఉద్ఘాటించారు. సికింద్ర‌బాద్ పెరేడ్ గ్రౌండ్‌లో జ‌రిగిన బీజేపీ.. జ‌నాగ్ర‌హ స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగించారు.;

Update: 2026-05-11 04:13 GMT

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో బీజేపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌డం ఖాయ‌మ‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఉద్ఘాటించారు. సికింద్ర‌బాద్ పెరేడ్ గ్రౌండ్‌లో జ‌రిగిన బీజేపీ.. జ‌నాగ్ర‌హ స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగించారు. దీనికి ముందు భారీ రోడ్ షో నిర్వ‌హించారు. సుమారు మూడు కిలోమీట‌ర్ల మేర సాగిన రోడ్ షోలో భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌లు పాల్గొన్నారు. మోడీ-మోడీ నినాదాల‌తో హోరెత్తించారు. కారు కు ఓ ప‌క్క‌గా నిల‌బ‌డిన ప్ర‌ధాని మోడీ ప్ర‌జ‌ల‌కు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సంద‌ర్భంగా మ‌హిళ‌లు సంప్ర‌దాయ త‌ల‌పాగాలు ధ‌రించి క‌నిపించ‌డం విశేషం. ప్ర‌ధాని రాక‌పై హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ.. భారీ ఎత్తున ఆయ‌న‌పై పూలు వెద‌జ‌ల్లారు.

అనంత‌రం నిర్వ‌హించిన స‌భ‌లో ప్ర‌ధాని మాట్లాడుతూ.. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ బెంగాల్‌లో బీజేపీ తొలి సారి విజ‌యం ద‌క్కించుకుంద‌న్నారు. అక్క‌డ తాము పోరాటం చేసింది.. రాజ‌కీయ శ‌క్తితో కాద‌ని.. అరాచ‌క‌, విధ్వంస‌క‌, రాజ్యాంగేత‌ర శ‌క్తితో పోరాడామ‌ని ప‌రోక్షంగా మ‌మ‌తా బెన‌ర్జీపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. అదేస్ఫూర్తి తెలంగాణ‌లోనూ క‌నిపిస్తోంద‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లోనూ బీజేపీ విజ‌యం ఖాయ‌మ‌ని అన్నారు. తెలంగాణ ప్ర‌జ‌లు బీజేపీని కోరుకుంటున్నార‌ని.. ఖ‌చ్చితం గా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ బీజేపీ విజ‌యం ద‌క్కించుకోవ‌డం త‌థ్య‌మ‌ని తేల్చి చెప్పారు.

‘‘నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా.. మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అంటూ ప్ర‌ధాన మంత్రి త‌న ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. రాష్ట్రంలో బీజేపీ ప‌ట్ల ఆద‌ర‌ణ మ‌రింత పెరిగింద‌ని తెలిపారు. బెంగాల్‌లో ఎలా అయితే.. ప్ర‌జ‌లు బీజేపీకి ప‌ట్టం క‌ట్టారో.. తెలంగాణ‌లోనూ అదే త‌ర‌హా వాతావ‌ర‌ణం త‌మ‌కు క‌నిపిస్తోంద‌న్నారు. ``బెంగాల్ గెలిచాం.. త‌దుప‌రి ల‌క్ష్యం తెలంగాణే.. ఆ మేర‌కు ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకుంటాం.`` అని ప్ర‌ధాని వ్యాఖ్యానించారు. ఇక్క‌డి బీజేపీ కార్య‌క‌ర్త‌ల ఉత్సాహం చూస్తుంటే.. త‌న‌ను మంత్ర ముగ్ధుడిని చేసింద‌ని ప్ర‌ధాని ఉద్ఘాటించారు. బీజేపీ ప్ర‌భుత్వ ఏర్పాటుకు ప్ర‌తి కార్య‌క‌ర్త కృషి చేయాల‌ని ప్ర‌ధాని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News