నేపాల్‌లో మళ్లీ కర్ఫ్యూ.. ఈసారీ రక్తసిక్తం!
భారత్ మిత్ర దేశం.. పొరుగున ఉన్న నేపాల్‌లో ఈ ఏడాది సెప్టెంబరులో `జెన్-జడ్` నిరసనలు వెల్లువెత్తాయి.;
భారత్ మిత్ర దేశం.. పొరుగున ఉన్న నేపాల్‌లో ఈ ఏడాది సెప్టెంబరులో `జెన్-జడ్` నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో ప్రధాని కేపీ ఓలీ రాజీనామా చేయడం.. ఆ వెంటనే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తికి పాలనా పగ్గాలు అందించడం తెలిసిందే. అయితే.. అప్పట్లో జరిగిన విధ్వంసం ఇంకా మరుపురాకముందే .. తాజాగా గత రెండు రోజులుగా పలు నగరాల్లో మళ్లీ అల్లర్లు ప్రారంభమయ్యాయి. అప్పట్లో నిరుద్యోగం.. అవినీతి.. ధరలు వంటి విషయంలో యువత పెద్ద ఎత్తున ఉద్యమించారు. ముఖ్యంగా సోషల్ మీడియాపై నిషేధం విధించడంతో అల్లర్లు ప్రారంభమయ్యాయి.
తాజాగా `జన్ -జెడ్` యువత కమిటీగా ఏర్పడ్డారు. ప్రస్తుతం ఏర్పాటైన మధ్యంతర ప్రభుత్వాన్ని కూడా వారు ప్రశ్నించేందుకు రెడీ అవుతున్నారు. మధ్యంతర ప్రభుత్వం వచ్చి 50 రోజులు దాటినా.. నాటి ఘటనలకు సంబంధించి కేసులు ఎత్తేస్తామన్న హామీని ఇప్పటికీ నిలబెట్టుకోలేదని యువత చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జన్-జడ్‌పై అప్రకటిత నిషేధం విధించినట్టు ప్రచారం జరుగుతోంది. అంటే.. యువత గుమిగూడడం, సమావేశాలు పెట్టడంపై నిషేధం ఉందని అంటున్నారు.
ఈ క్రమంలోనే అధికారంలో ఉన్న వారికి మద్దతు ఇస్తున్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-యునిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్ కార్యకర్తలు `జెన్ - జడ్` యువకులపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో దేశంలోని కీలక నగరాల్లో `జెన్ - జడ్` యువత ఆందోళనకు దిగింది. దీంతో సిమారా ప్రాంతంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి.. లాఠీచార్జీ చేశారు. అయినా.. పరిస్థితి సర్దుమణగలేదు.
దీంతో గురువారం ఉదయం నుంచి పలు కీలక నగరాల్లో కర్ఫ్యూ విధించారు. అయితే గత అనుభవాలు దృష్టిలో పెట్టుకున్న ప్రస్తుత ప్రభుత్వం జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. గత నిరసనల్లో 78 మంది మృతి చెందారు. అప్పటి ప్రధాని కేపీ ఒలీ రాజీనామా చేయడంతోపాటు కొన్నాళ్లపాటు దుబాయ్‌కు కూడా పారిపోయారు. కాగా.. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్టు ప్రధాని సుశీల కర్కి(సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి) చెప్పారు.