నిరసనల్లో సడేమియా.. నేపాల్ జైళ్ల నుంచి ఖైదీలు జంప్
నేపాల్ రాజధాని కాఠ్మాండూలో నెలకొన్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. సోషల్ మీడియాపై ప్రభుత్వం విధించిన నిషేధంతో ఆగ్రహించిన జనరేషన్ జెడ్ యువత, దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దిగారు.;
నేపాల్ రాజధాని కాఠ్మాండూలో నెలకొన్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. సోషల్ మీడియాపై ప్రభుత్వం విధించిన నిషేధంతో ఆగ్రహించిన జనరేషన్ జెడ్ యువత, దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దిగారు. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో దేశం అల్లకల్లోలంగా తయారైంది. ఇది కేవలం రాజకీయ సంక్షోభం కాకుండా, భద్రతా సంక్షోభంగా రూపాంతరం చెందింది.
భయంకర పరిణామాలు.. విధ్వంసం
ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకారులు తీవ్రమైన విధ్వంసక చర్యలకు పాల్పడ్డారు. పార్లమెంట్ భవనానికి నిప్పు పెట్టడం, ఉప ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రిపై దాడి వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలీసులు, నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకు కాఠ్మాండూలో 17 మంది ప్రాణాలు కోల్పోగా.. దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 19కి చేరింది. ఈ అల్లర్లు, దేశంలో శాంతిభద్రతలను పూర్తిగా నాశనం చేశాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
* ఖైదీలకు ఊహించని వరం
దేశంలో నెలకొన్న ఈ అలజడిని జైళ్లలోని ఖైదీలు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. బిర్‌గుంజ్ జైలుపై నిరసనకారులు దాడి చేసి గేట్లను పగులగొట్టడంతో, ఖైదీలు పెద్ద ఎత్తున బయటకు పారిపోయారు. అదేవిధంగా, మహోతరి, పోఖారా జైళ్లతో సహా పలు జైళ్లలోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. మహోతరి జైలు నుంచి 576 మంది ఖైదీలు, పోఖారా జైలు నుంచి 900 మంది ఖైదీలు తప్పించుకున్నారని సమాచారం. మొత్తం మీద నేపాల్‌లోని అనేక జైళ్ల నుంచి వేలాది మంది ఖైదీలు పారిపోయారని స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి. అయితే ఈ సంఖ్యపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
భవిష్యత్తు అగమ్యగోచరం
ఒకవైపు దేశవ్యాప్తంగా ప్రజల తీవ్ర నిరసనలు, మరోవైపు జైళ్ల నుంచి వేలాది మంది ఖైదీలు బయటకు రావడంతో నేపాల్ ప్రభుత్వం ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. రాజకీయ ఆందోళనలు ఇప్పుడు భద్రతకు పెనుసవాలుగా మారాయి. సోషల్ మీడియా నిషేధంతో ప్రారంభమైన ఈ ఆందోళనలు, దేశ రాజకీయ వాతావరణాన్ని తలకిందులు చేయడమే కాకుండా, జైళ్ల గోడలను కూడా కూల్చేశాయి, భవిష్యత్తులో శాంతి భద్రతల పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది.