నేపాల్ మాజీ ప్రధాని భార్యను సజీవంగా తగలపెట్టిన నిరసనకారులు

నేపాల్‌లో సోషల్ మీడియా నిషేధంతో మొదలైన యువత ఆధ్వర్యంలో ప్రారంభమైన నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారాయి.;

Update: 2025-09-09 15:18 GMT

నేపాల్‌లో సోషల్ మీడియా నిషేధంతో మొదలైన యువత ఆధ్వర్యంలో ప్రారంభమైన నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, రాజకీయ నేతల ఇళ్లు, కార్యాలయాలు నిరసనకారుల లక్ష్యంగా మారాయి. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అమల్లో ఉన్నా, ఆంక్షలను లెక్క చేయకుండా ఆందోళనకారులు విపరీతంగా ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు.

కాఠ్‌మాండూలో మాజీ ప్రధాని ఝాలానాథ్‌ ఖనాల్‌ నివాసానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఆయన భార్య తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది. అంతకుముందు మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఇంటిపై కూడా నిరసనకారులు దాడి చేశారు. దేశంలో పెరిగిన రాజకీయ సంక్షోభం, ఆయన రాజీనామాతో ఆగ్రహం మరింత భగ్గుమంది.

‘నెపోకిడ్‌ మూమెంట్‌’ పేరుతో సాగుతున్న ఈ ఆందోళనల్లో నిరసనకారులు పార్లమెంట్‌ భవనంలోకి చొరబడి దానికి కూడా నిప్పంటించారు. అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, మాజీ ప్రధాని పుష్ప కమల్‌ దహల్, మంత్రి పృథ్వీ సుబ్బ గురుంగ్, మాజీ హోం మంత్రి రమేశ్‌ లేఖక్ ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్‌ పౌడెల్ ను వీధుల్లో తరిమారు. అలాగే మాజీ ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవుబా, ఆయన సతీమణి, ప్రస్తుత విదేశాంగ మంత్రి అర్జు రాణా దేవుబాపై దాడి చేసి గాయపరిచారు.

సోషల్‌ మీడియాలో నిషేధాన్ని వ్యతిరేకిస్తూ మొదలైన నిరసనలు ఇప్పుడు పూర్తిగా హింసాకాండగా మారాయి. ఇప్పటికే 20 మందికి పైగా యువకులు పోలీసు కాల్పుల్లో మరణించగా, వందలాది మంది గాయపడ్డారు.

* భారత్‌ జాగ్రత్త సూచన

నేపాల్‌లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత విదేశాంగశాఖ ట్రావెల్‌ అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతానికి నేపాల్‌ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సూచించింది. ఇప్పటికే ఉన్న భారతీయులు ఇళ్లకే పరిమితం కావాలని, వీధుల్లోకి వెళ్లొద్దని హెచ్చరించింది. అలాగే కాఠ్‌మాండూలోని భారత రాయబార కార్యాలయం నుంచి వెలువడుతున్న భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

Tags:    

Similar News