జడలు విప్పించి.. నగలు తొలగించి.. నీట్ పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థినుల పరిస్థితి..

Update: 2026-05-04 07:54 GMT

లక్ష్యం పెద్దదైనప్పుడు ఆ దారిలో అడ్డంకులు కూడా ఉంటాయి. సాధారణంగా ఒక శుభకార్యానికో లేదంటగే ఒక పండుగకో వెళ్లేటప్పుడు ముచ్చటగా రెడీ అయ్యే విద్యార్థినులు, ఆ రోజు మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఎంతో క్రమశిక్షణతో, పద్ధతిగా ముస్తాబై వచ్చిన వారు.. కొద్దిసేపటికే గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. అది ఒక పరీక్షా కేంద్రం వెలుపల జరిగిన దృశ్యం అని తెలిసిన వారికి కూడా, అక్కడ జరుగుతున్న తనిఖీలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. వరుసలో నిలబడిన ఆ విద్యార్థినుల ముఖాల్లో పరీక్ష తాలూకు ఒత్తిడి కంటే, అక్కడ అమలవుతున్న నిబంధనల పట్ల కలిగిన గందరగోళమే ఎక్కువగా కనిపించింది.

బారీ తనిఖీలతో..

వైద్య విద్యలో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) తాజాగా ముగిసింది. ఈ పరీక్ష నిర్వహణలో అనుసరించే కఠిన నిబంధనలు చర్చనీయాంశంగా మారాయి. ఆదివారం ఉదయం నుంచే అక్కడ విద్యార్థుల రద్దీ ఉంది. కేంద్రాల్లోకి అడుగుపెట్టే ముందే అధికారులు నిర్వహించిన తనిఖీలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను విస్మయానికి గురిచేశాయి. ఏ చిన్న పొరపాటుకు తావులేకుండా, కాపీయింగ్ వంటి అక్రమాలకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో తనిఖీ బృందాలు అప్రమత్తంగా వ్యవహరించాయి.

నగలు, వాచీలకు అనుమతి నిల్..

పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థినులను గేటు వద్దే నిలిపి, వారు ధరించిన ఆభరణాలను తొలగించాలని ఆదేశించారు. బంగారు గొలుసులు, చెవి పోగులు, ముక్కు పుడకల నుంచి చేతి గడియారాల వరకు వేటినీ అనుమతించలేదు. చాలా మంది విద్యార్థినులు ఆభరణాలు తీయడానికి ఇబ్బంది పడడంతో, వారి తల్లిదండ్రులు అక్కడే ఉండి జాగ్రత్తగా భద్రపరుచుకోవాల్సి వచ్చింది. పెన్ను, అడ్మిట్ కార్డు మినహా మరే ఇతర వస్తువును తీసుకెళ్లడానికి వీల్లేదని చెప్పారు. ఈ క్రమంలో తనిఖీ అధికారులు వాడిన మెటల్ డిటెక్టర్లు ప్రతి చిన్న వస్తువును క్షుణ్ణంగా తనిఖీ చేశాయి.

విరబోసుకున్న విద్యార్థినులు

తనిఖీల్లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే విద్యార్థినులు వేసుకున్న జడలను కూడా విప్పించి తనిఖీ చేయడం. జడల్లో ఏవైనా ఎలక్ట్రానిక్ పరికరాలు లేదంటే చీటీలు దాచి ఉంచారేమోనన్న అనుమానంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎంతో అందంగా జడ వేసుకొని వచ్చిన విద్యార్థినులు, కేంద్రంలోకి వెళ్లేటప్పుడు జట్టు విరబోసుకొని అస్తవ్యస్తంగా కనిపించారు. కేంద్రాల వద్ద వరుసలో నిలబడిన విద్యార్థినులు జడలు విప్పి కనిపించడం స్థానికంగా ఉన్న వారిని విస్మయానికి గురిచేసింది. ఇలా చేయడంపై కొందరు అసహనం వ్యక్తం చేసినా, పారదర్శకత కోసమేనని అధికారులు స్పష్టం చేశారు.

తమ పిల్లలు కష్టపడి చదివారని, పరీక్షకు వెళ్లే తరుణంలో ఇటువంటి తనిఖీల వల్ల వారు మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎండలో నిలబెట్టి, నగలు తీయించడం, జడలు విప్పించడం విద్యార్థుల ఏకాగ్రతను దెబ్బతీస్తాయని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ నిబంధనలు తప్పవని సహకరించారు. తమ పిల్లల భవిష్యత్తు ముఖ్యమని భావించి, కేంద్రాల వద్ద గంటల తరబడి వేచి ఉండి, పిల్లలు క్షేమంగా పరీక్ష పూర్తి చేయాలని ఆకాంక్షించారు.

నిబంధనల వెనుక ఉద్దేశం

నీట్ వంటి ప్రతిష్టాత్మక పరీక్షల్లో గతంలో చోటుచేసుకున్న అక్రమాలను దృష్టిలో ఉంచుకొని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ రకమైన కఠినమైన డ్రెస్ కోడ్‌ అమలు చేస్తోంది. హైటెక్ కాపీయింగ్‌కు అడ్డుకట్ట వేయాలంటే తనిఖీలు తప్పనిసరని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. అలంకరణ కంటే అర్హతే ముఖ్యమని భావించే ఈ పరీక్షలో.. నిబంధనలను పాటించడం ప్రతి విద్యార్థి బాధ్యతగా మారింది. 

Tags:    

Similar News