కూటమి హోం మినిస్టర్ : పవన్ తో పాటు లిస్ట్ చాలానే !?

టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే కీలక మంత్రిత్వ శాఖలు ఎవరికి ఇస్తారు అన్న చర్చ వాడిగా వేడిగా సాగుతోంది.

Update: 2024-05-23 03:44 GMT

టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే కీలక మంత్రిత్వ శాఖలు ఎవరికి ఇస్తారు అన్న చర్చ వాడిగా వేడిగా సాగుతోంది. సోషల్ మీడియాలో అయితే అతి ఉత్సాహ పరులు అంతా మొత్తం పాతిక మంది మంత్రులను ప్రకటించేసి శాఖలను కూడా కేటాయించేశారు. చాలా మంది చిత్రంగా హోం శాఖ మీదనే ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ముఖ్యమంత్రి తరువాత అంతటి పవర్ ఫుల్ శాఖ ఇదే.

పోలీస్ మంత్రిగా చట్టాన్ని కాపాడే కీలకమైన బాధ్యతలతో బరువు పరువు ఎక్కువ ఈ శాఖకే ఉంటాయి. ప్రతిపక్షాలను కట్టడి చేయాలన్నా ఈ శాఖకే కుదురుతుంది. అలాంటి ఈ కీలక శాఖను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఇవ్వాలని అంతా కోరుతున్నారు. కాపు నేత మాజీ మంత్రి చేగొండి హరి రామజోగయ్య అయితే పవన్ కి డిప్యూటీ సీఎం తో పాటు ఈ కీలక శాఖ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అయితే దాని మీద టీడీపీ కూటమి ఏమీ రెస్పాండ్ కాలేదు. అయితే జూన్ 4న ఫలితాలు తరువాత టీడీపీ గెలిస్తే మాత్రం అపుడైనా ఒక డెసిషన్ తీసుకోవాల్సిందే అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ జనసేనే నేతగా బలమైన సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం ఉన్న నాయకుడిగా ఆయన హోదాను కూడా దృష్టిలో పెట్టుకుంటే హోం శాఖ ఆయనకే ఇవ్వాలని అంటున్నారు.

అలా ఇస్తేనే కూటమిలో రెండవ పెద్ద పార్టీగా జనసేనకు, కీలక నేతగా పవన్ కి పూర్తి న్యాయం జరుగుతుంది అని అంటున్నారు. అలా హోం మంత్రి పదవి అంటే పవన్ కే అని చాలా ఎక్కువ మంది రిజర్వ్ చేసేశారు. అయితే ఇపుడు ఈ లిస్ట్ లోకి కొత్తగా ట్రిపుల్ ఆర్ గా పేరు గడించిన రఘురామ క్రిష్ణం రాజు కూడా వచ్చేశారు. ఆయన జగన్ ని ఎదిరించిన వారు. వైసీపీ పాలనను అందరి కంటే ఎక్కువగా విమర్శించి ప్రతిపక్ష రాజకీయానికి అంతా సానుకూలం చేసిన వారు కాబట్టి ఆయనకే హోం మంత్రి ఇవ్వాలని కోరుతున్నారు ఆయన అభిమానులు.

Read more!

ఉండి నుంచి పోటీ చేస్తున్న రఘురామ చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని బలంగా ఆశిస్తున్నారు. ఇపుడు ఆయన శాఖను కూడా అనుచరులు నిర్దారించేశారు. రఘురామ తరువాత ఈ శాఖ మీద మక్కువ చూపిస్తున్న వారు టీడీపీ సొంత పార్టీ నేతలు. వారిలో ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు మొదటి వరసలో ఉన్నారు. ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు. ఉత్తరాంధ్రా టీడీపీకి పెద్ద దిక్కు.

దాంతో ఆయనకు ఈ కీలకమైన పదవి దక్కాలని అంతా కోరుకుంటున్నారు. ఆయనకు ఈసారి డిప్యూటీ సీఎం ఇచ్చి మరీ ఈ పోస్టు ఇవ్వాలని అంటున్నారు. ఇక విజయనగరం జిల్లాలో చీపురుపల్లి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ మీద పోటీ చేసిన సీనియర్ నేత కిమిడి కళా వెంకటరావు ఆశలు కూడా హోం మంత్రి మీదనే ఉన్నాయని అంటున్నారు. ఆయన గతంలో అంటే మూడున్నర దశాబ్దాల క్రితం ఈ శాఖను నిర్వహించారు. కానీ ఇపుడు రాజకీయ చివరి దశలో ఈ కీలక పోస్టులో రాజ్యం చేసి సంతృప్తిగా రాజకీయ రిటైర్మెంట్ తీసుకోవాలని చూస్తున్నారుట.

విశాఖ జిల్లాలో చూసుకుంటే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా ఓపెన్ గానే హోం మంత్రి పదవి మీద తన మక్కువను బయటపెట్టారు. తనకు హోం మంత్రిగా ఇస్తే చాలు లా అండ్ ఆర్డర్ ఎలా లైన్ లో పెట్టాలో చేసి చూపిస్తాను అని అనేక సభలలో ఆయన చెప్పి ఉన్నారు. దాంతో అన్ని శాఖలూ చేసిన ఈ సీనియర్ నేతకు హోం శాఖ మీద మనసు ఉందని అంటున్నారు.

చాన్స్ ఇస్తే తనకూ అదే శాఖ కావాలని మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా చూస్తున్నారు అని అంటున్నారు. అలాగే కోస్తా జిల్లాలలో చూస్తే కొల్లు రవీంద్ర వంటి వారు కూడా ఇదే శాఖ మీద గతంలో కోరిక ఉందని చెప్పినట్లుగా ప్రచారంలో ఉంది. లా అండ్ ఆర్డర్ ని తమకు ఇస్తే ఎలా ఉంటుందో చూపిస్తామని కొల్లు రవీంద్ర వంటి వారు చెబుతూ వచ్చారు.

అలాగే ఈసారి రాయలసీమ జిల్లాలకు హోం శాఖ ఇవ్వాలని టీడీపీలో డిమాండ్ ఉంది అని అంటున్నారు. అక్కడ రాజకీయ ఉద్ధండులు చాలా మంది ఉన్నారు. వారిలో ఒకరికి ఈ శాఖ అప్పగించడం ద్వారా రాజకీయ సమతూల్యతను సాధించినట్లు అవుతుందని అంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే హోం మంత్రి పదవి కోసం చాలా మంది చూస్తున్నారు. మరి టీడీపీ కూటమి కనుక గెలిస్తే ఎవరిని ఆ పదవి వరిస్తుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News