మోడీకి దేవుళ్లు వారేనట.. వారి చేతుల్లోనే ఆయన రిమోట్
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోటి వెంట వచ్చే మాటలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.;
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోటి వెంట వచ్చే మాటలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మేజిక్ చేసేలా.. సామాన్యులనే కాదు.. అసామాన్యుల్ని సైతం మంత్రముగ్దుల్ని చేసేలా మాట్లాడటంలో ఆయనకున్న నేర్పు ఎంతో అందరికి తెలిసిందే. తాజాగా ఆయన ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. అసోంలో చేపట్టిన పలు డెవలప్ మెంట్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన సందర్భంగా ప్రజల్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. బహిరంగ సభలో ఆయన తన గురించి.. తన గొప్పతనం గురించి చెప్పుకోవటమే కాదు.. తాను ప్రజలకు ఎంతలా బాధ్యత వహిస్తున్న విషయాన్ని చెప్పటమే కాదు.. ప్రధాన రాజకీయ పక్షమైన కాంగ్రెస్ కు సూటిగా తగిలేలా వ్యాఖ్యలు చేయటం మోడీకే చెల్లుతుందని చెప్పాలి.
తాను మాట్లాడితే మోడీ తమను టార్గెట్ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుందన్న ప్రధాని నరేంద్ర మోడీ.. తనను ఎంత తిట్టినా తానుపట్టించుకోనని చెప్పారు. తాను శివభక్తుడ్ని అని.. తనపై సంధించే విమర్శల విషాన్ని తాను హరిస్తానని చెప్పిన ప్రధాని మోడీ.. ‘‘దేశ ప్రజలపై దాడి చేస్తే మాత్రం ఊరుకోను. వారిని ఏమైనా అంటే మౌనంగా ఉండను. ప్రజలే నా దేవుళ్లు. నా బాధను వాళ్ల ముందు వ్యక్తం చేయకపోతే.. ఎవరి ముందు చేస్తాను? అందుకే వాళ్లే నా యజమానులు. నా దేవతలు.. నా రిమోట్ కంట్రోల్. నాకు వేరే రిమోట్ కంట్రోల్ అవసరం లేదు’ అని స్పష్టం చేశారు.
బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ నోటి నుంచి వచ్చిన ‘రిమోట్’ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెర తీశాయి. కారణంగా.. గతంలో ఆయన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను కాంగ్రెస్ అధినేత్రి.. యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ రిమోట్ చేశారని విమర్శించటం తెలిసిందే. అప్పట్లో మోడీ మాటలు పెను సంచలనంగా మారాయి. కట్ చేస్తే..ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే.. గాంధీ ఫ్యామిలీ రిమోట్ కంట్రోల్ లో ఉన్నట్లుగా విమర్శించారు ప్రధాని నరేంద్ర మోడీ.
అంతేకాదు.. అస్సామీల్లో భావోద్వేగాల్ని టచ్ చేసిన మోడీ.. గతంలో జరిగిన ఉదంతాన్ని ప్రస్తావించటం ద్వారా రాజకీయంగా ఎంత చురుగ్గా మోడీ వ్యవహరిస్తారో ఇట్టే అర్థమవుతుంది. 2019లో మోడీ సర్కారు ప్రముఖ అస్సామీ సంగీత కళాకారుడు భూపెన్ హజారికాను భారతరత్న పురస్కారంతో సత్కరించింది. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ.. మోడీ హయాంలో గాయకులకు.. డ్యాన్సర్లకు అవార్డులు ఇస్తున్నట్లుగా పేర్కొనటంతో పెను దుమారం రేగింది. ఈ వ్యాఖ్యలపై అస్సామీలు తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు. దీంతో.. తాను నోరు జారిన వైనాన్ని గుర్తించిన ఖర్గే క్షమాపణలు చెప్పారు. అప్పట్లో ఖర్గే తనపై చేసిన విమర్శల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తనతో చెప్పిన వైనాన్ని ప్రజలకు తెలియజేశారు.
దాదాపు ఆరేళ్ల క్రితం ఖర్గే చేసిన వ్యాఖ్యల్ని తాజాగా ప్రస్తావించిన ప్రధాని నరేంద్ర మోడీ.. భారతదేశ ముద్దుబిడ్డ.. అస్సాంకు గర్వకారణమైన భూపేన్ హజారికాను భారతరత్నతో సత్కరిస్తే కాంగ్రెస్ అధ్యక్షుడు అనుచిత వ్యాఖ్య చేశారన్నారు. ఈ సందర్భంగా తన తల్లిని ఉద్దేశించి కొందరు దూషించినట్లుగా విడుదలైన వీడియో మీదా మాట్లాడారు. కాంగ్రెస్ తన తల్లి హీరాబెన్ ను రాజకీయాల్లోకి లాగటం సరికాదన్న ప్రధాని మోడీ.. ఈ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ఇప్పటికే మోడీ తల్లిని టార్గెట్ చేసిన బిహార్ కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం.. ఏఐ పోస్టును విడుదల చేయటం.. దీనిపై తీవ్ర దుమారం రేగటం తెలిసిందే. కాంగ్రెస్ తన వ్యక్తిగత ఇమేజ్ ను దెబ్బ తీస్తున్నట్లుగా పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. మొత్తంగా తనకు ప్రజలే దేవుళ్లగా పేర్కొంటూ.. వారి మనసుల్ని గెలుచుకోవటం ఒక ఎత్తు అయితే. అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థులపైనా విరుచుకుపడుతూ తనకున్న మాటల టాలెంట్ ను మరోసారి ప్రదర్శించారని చెప్పకతప్పదు.