'యోగాంధ్ర'కు అన్నీ తానైన వేళ లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

విశాఖ నగరంలోని రామకృష్ణ బీచ్‌ నుంచి భీమిలి వరకు లక్షల మంది ఒకే మార్గంలో యోగాసనాలు వేసి రికార్డు సృష్టించారు. గతంలో సూరత్‌ లో 1.47 లక్షల మందితో నిర్వహించిన యోగా రికార్డును తాజాగా ఏపీ అధిగమించింది.;

Update: 2025-06-21 06:05 GMT

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన 'యోగాంధ్ర-2025' కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ సందర్భంగా.. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమం గిన్నిస్‌ రికార్డు సాధించింది. 3.01 లక్షల మంది ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... విశాఖ నగరంలోని రామకృష్ణ బీచ్‌ నుంచి భీమిలి వరకు లక్షల మంది ఒకే మార్గంలో యోగాసనాలు వేసి రికార్డు సృష్టించారు. గతంలో సూరత్‌ లో 1.47 లక్షల మందితో నిర్వహించిన యోగా రికార్డును తాజాగా ఏపీ అధిగమించింది. ఇదే సమయంలో.. గిరిజన విద్యార్థుల సూర్య నమస్కారాలకు మరో గిన్నిస్‌ రికార్డు లభించింది.

ఈ సందర్భంగా స్పందించిన ఏపీ విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్... విశాఖలో యోగాంధ్ర నిర్వహణపై సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రుల కోరికలను ప్రధాని నెరవేరుస్తున్నారని.. ఆయనకు గిన్నిస్‌ రికార్డు కానుక ఇవ్వాలని యోగాంధ్ర నిర్వహించినట్లు తెలిపారు. ఆశించిన దానికంటే ఎక్కువ మంది యోగాంధ్రకు వచ్చారని మంత్రి లోకేష్ అన్నారు.

ప్రజల్లో వచ్చిన చైతన్యం వల్లే యోగాంధ్ర ఈ స్థాయిలో విజయవంతం అయ్యిందని.. ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారని అన్నారు. ఏర్పాట్లన్నీ పకడ్బందీగా చేయడం వల్లే.. ఈ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసిందని.. ప్రధాని వ్యాఖ్యలు నాపై మరింత బాధ్యతలను పెంచాయని.. యోగాంధ్ర కార్యక్రమం ఆంధ్రుల విజయ అని లోకేష్ పేర్కొన్నారు.

ఇదే సమయంలో... పరిపాలనా సౌలభ్యం కోసం రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేశామని చెప్పిన లోకేష్.. అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని వికేంద్రీకరిస్తామని.. దక్షిణ భారత్‌ లో ఉన్నతమైన ఐటీ హబ్‌ గా విశాఖను తీర్చిదిద్దుతామని అన్నారు. విశాఖలో ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

కాగా.. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ... నెలన్నర రోజుల్లో యోగాంధ్రను విజయవంతం చేయడంలో మంత్రి లోకేష్ పాత్ర కీలకమైందని.. కొత్త కార్యక్రమాల రూపకల్పనలో ఆయన చొరవ ప్రశంసనీయమని కొనియాడారు. ఇదే సమయంలో.. 'యోగా కేవలం వ్యాయామం కాదు.. అదొక జీవన విధానం.. ఈ ఏడాది విశాఖలో యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం అద్భుతం' అని 'ఎక్స్‌'లో పేర్కొన్నారు.

Tags:    

Similar News