నకిలీ నెయ్యి రాకెట్ లో ఇద్దరు అరెస్ట్... ఎవరీ శివ, రమ్య? కీలక మలుపు
ఈ తనిఖీల్లో కల్తీ నెయ్యిని తయారు చేస్తున్న యూనిట్ ను తమిళనాడులోని తిరుప్పూరులో పోలీసులు గుర్తించారు.;
దేశంలో నెయ్యి కల్తీ కేసులు ఎక్కువ అవుతున్నాయి. పరమ పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో రసాయనాలతో తయారు చేసిన నెయ్యి వాడారని సుప్రీం సీబీఐ గుర్తించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే 12 మందిని అరెస్టు చేసింది. తిరుమల లడ్డూ నెయ్యి కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించగా, ఇప్పుడు కర్ణాటకలోనూ ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చేసింది. కర్ణాటక ప్రభుత్వ రంగంలో నడుస్తున్న నందిని నెయ్యి పేరుతో కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ముఠాను తాజాగా అరెస్టు చేశారు. ఈ మఠాలో ఇద్దరు భార్యభర్తలు కీలకమని చెబుతున్నారు. ఈ వ్యవహారంలో మొత్తం ఆరుగురిని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు.
కర్ణాటకలో నందిని నెయ్యికి చాలా మంచి పేరు ఉంది. దీన్ని ఆసరా చేసుకున్న తమిళనాడుకు చెందిన దంపతులు శివకుమార్, రమ్య తమిళనాడులోని తిరుప్పూరు కేంద్రంగా నకిలీ నెయ్యి తయారు చేసే యూనిట్‌ను నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కర్ణాటకలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌లలో ఒకటైన 'నందిని' పేరుతో వీరు పెద్ద ఎత్తున కల్తీ నెయ్యిని తయారు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. ప్రధానంగా తమిళనాడు ప్రాంతంలో నందిని నెయ్యి అమ్మకాల్లో భారీ తేడాలు రావడంతో అనుమానం వచ్చిన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) అధికారులు విజిలెన్స్ కు ఫిర్యాదు చేశారు. దీంతో నెయ్యి అమ్మకాలు తగ్గిన ప్రాంతాల్లో KMF విజిలెన్స్ అధికారులు, బెంగళూరు పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో కల్తీ నెయ్యిని తయారు చేస్తున్న యూనిట్ ను తమిళనాడులోని తిరుప్పూరులో పోలీసులు గుర్తించారు. ఇక్కడ అసలు నెయ్యికి బదులుగా, నిందితులు కొబ్బరి నూనె, పామాయిల్ ఉపయోగించి నెయ్యిని కల్తీ చేస్తున్నట్లు వెల్లడైందని అంటున్నారు. అంతేకాకుండా కొన్ని రకాల రసాయనాలు వాడటం ద్వారా నందిని బ్రాండు నకిలీ నెయ్యి తయారు చేస్తున్నారు. రంగు, రుచి, వాసన అంతా చూడడానికి అసలు ఆవు నెయ్యిలాగే ఉండేలా చేశారు. ఇలా తయారు చేసిన కల్తీ నెయ్యిని నకిలీ 'నందిని' బ్రాండ్ సాచెట్లు, ప్లాస్టిక్ బాటిళ్లలో ప్యాక్ చేసి, అసలైన ఉత్పత్తిగా మార్కెట్‌లోకి పంపించారు. అసలు, నకిలీ మధ్య ఏ మాత్రం తేడా లేకుండా తయారు చేయడంతో వినియోగదారులు మోసానికి గురయ్యారు.
అయితే మార్కెట్లో అమ్మకాలు తగ్గడంతో KMF రంగంలోకి దిగింది. పోలీసులు, విజిలెన్స్ అధికారుల స్టింగు ఆపరేషన్ లో ఈ అంతర రాష్ట్ర ముఠా గుట్టు రట్టు అయింది. ఇక నిందితుల తెలివితేటలకు బెంగళూరులో KMF అధికారిక లైసెన్సీలు మోసపోవడం గమనార్హం. వీరు కూడా కల్తీ నెయ్యిని హోల్‌సేల్ దుకాణాలు, రిటైల్ అవుట్‌లెట్‌లు, చివరకు నందిని పార్లర్‌లకు కూడా పూర్తి మార్కెట్ ధరకు సరఫరా చేశారని పోలీసుల విచారణలో గుర్తించారు.
ఇక ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన బెంగళూరు పోలీసులు తొలుత నెయ్యి డిస్టిబ్యూటర్ మహేంద్ర, అతడి కుమారుడు దీపక్ తోపాటు సహాయకులు మునిరాజు, అభిరాసును అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారంతో రాకెట్‌కు సూత్రధారులుగా భావిస్తున్న తమిళనాడుకు చెందిన శివకుమార్, రమ్యను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరు భార్యభర్తలు కావడం విశేషం. నిందితుల నుంచి సుమారు 8,136 లీటర్ల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు, దీని విలువ సుమారు రూ. 1.27 కోట్లుగా అంచనా. కల్తీ నెయ్యి తయారీకి ఉపయోగించిన యంత్రాలు, పామాయిల్, కొబ్బరి నూనె, మొబైల్ ఫోన్లు, నాలుగు బొలెరో గూడ్స్ వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.