మహిళలు మసీదుకు రావొచ్చు.. సంచలన విషయం వెలుగులోకి!
ముస్లింలు పవిత్రంగా భావించే.. నిత్యం నమాజ్ చేసుకునే.. మసీదుకు పురుషులు మాత్రమే వెళ్తారన్న విషయం అందరికీ తెలిసిందే.;
ముస్లింలు పవిత్రంగా భావించే.. నిత్యం నమాజ్ చేసుకునే.. మసీదుకు పురుషులు మాత్రమే వెళ్తారన్న విషయం అందరికీ తెలిసిందే. రంజాన్ మాసం అయినా.. ప్రతి రోజూ అయినా.. ముస్లింలలో పురుషులు మాత్రమే మసీదుకు వెళ్తారు. అక్కడ మహిళలకు అవకాశం లేదన్న ప్రచారం కూడా ఉంది. ఈ కారణం గానే ఏమో.. ముస్లిం మహిళలు.. మసీదుల్లో కనిపించరు. అంతేకాదు.. మహిళలు దర్గాల్లో ఎక్కువగా కనిపిస్తారు. దీంతో ఇప్పటి వరకు ఖురాన్‌లోనే ఇలాంటి నిబంధన ఉందని ప్రచారంలో ఉంది.
అయితే.. తాజాగా ఖరాన్‌కు సంబంధించిన కీలక విషయాలను అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు సుప్రీంకోర్టుకు వివరించింది. దీని ప్రకారం.. మహిళా ముస్లింలు.. మసీదుకు రావడంపై ఎలాంటి ఆంక్షలు , నిషేధాలు లేవని వెల్లడించింది. అంతేకాదు.. వారు కూడా వచ్చి ప్రార్థనలు చేసుకునే వెసులు బాటు ఉందని స్పష్టం చేసింది. అయితే.. మహిళలు కొన్ని క్రమశిక్షణలు పాటించాల్సి ఉంటుందని వివరించింది. దీంతో సుప్రీంకోర్టు ధర్మాసనం సైతం ఆశ్చర్య పోయింది.
ఇదే బెంచ్‌లో ఉన్న న్యాయమూర్తి జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా.. స్పందిస్తూ.. ఖురాన్ సహా.. ముస్లిం మతాచారంలో మహిళలకు ఎలాంటి కట్టుబాట్లు విధించకపోయినా.. పిల్లలను సంరక్షించుకునేఉద్దేశంతో మహిళలకు మసీదు ప్రవేశాన్ని పక్కన పెట్టారన్నారు. అంతకు మించి.. వారిపై నిషేధం లేదని ఎవరైనా మసీదుకు రావచ్చని వివరించారు. మసీదులో గర్భగుడి అంటూ ఏమీ ఉండదన్న న్యాయవాది వాదనల తో ఏకీభవించారు.
ఏంటి వివాదం?
దేశంలో మహిళలు ప్రార్థనలు చేసుకునేందుకు.. దేవుడిని పూజించుకునేందుకు ఆంక్షలు పెడుతున్నా రంటూ.. దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేస్తోంది. ముఖ్యంగా శబరిమల అయ్యప్ప ఆలయం సహా.. మసీదు వ్యవహారాలపై కొందరు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ రెండు చోట్లకు మహిళలను అనుమతించడం లేదని పిటిషనర్లు వాదిస్తున్నారు. ఈ క్రమంలో ఆయా పిటిషన్లపై సుప్రీంకోర్టు సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే మసీదుల్లోకి మహిళలు ప్రవేశించే విషయంపై అఖిల భారత ముస్లిం లాబోర్డు కీలక సమాచారం అందించింది.