అభిమానులకు ఈ కండీషన్లు ఏంది ముద్రగడ సాబ్?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపుతో అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమైన ఆయన.. తనను అభిమానించే వారికి పెడుతున్న కండీషన్లు కలవరానికి గురి చేస్తున్నాయి.

Update: 2024-03-12 04:44 GMT

రోజులు మారాయి. అందుకు తగ్గట్లే పరిస్థితులు మారుతున్నాయి. కానీ.. రాజకీయ రంగంలో ఎంతోమంది నేతలు ఉన్నా.. వారికి భిన్నంగా వ్యవహరించే ముద్రగడ పద్మనాభం.. తాజాగా మరోసారి తన తీరును ప్రదర్శించారు. తనను అభిమానించే వారికి తరచూ కండీషన్లు పెట్టే ఆయన.. తాజాగా సుదీర్ఘ విరామం తర్వాత ఏపీ అధికార పక్షంలో చేరనున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపుతో అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమైన ఆయన.. తనను అభిమానించే వారికి పెడుతున్న కండీషన్లు కలవరానికి గురి చేస్తున్నాయి.

తాను అధికార పార్టీలో చేరే కార్యక్రమాన్ని భారీగా చేపట్టాలని ఆయన కోరుకోవటాన్ని తప్పు పట్టలేం. అయితే.. ఆ కోరిక కారణంగా జనాల జేబులు ఖాళీ అయ్యేలా ఉండటమే తాజా చర్చకు కారణంగా చెప్పాలి. తాను పార్టీలో చేరే వేళ.. అంగరంగ వైభవంగా ఏర్పాట్లను చూసుకోవాలని తన ఫాలోయర్స్ కు ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో తాను ఎవరికి ఎలాంటి ఖర్చులు భరించనని.. అన్ని ఎవరికి వారే ఏర్పాట్లు చేసుకోవాలంటూ క్లారిటీగా చెప్పేసిన వైనం చూసినప్పుడు ముద్రగడ తీరు విస్మయానికి గురయ్యేలా ఉంటుందని చెప్పాలి.

Read more!

ఇంతకూ ముద్రగడ కోరికల జాబితాను చూస్తే.. వెయ్యి కార్లు.. ఇతర వాహనాల్లో పది వేల మందికి తక్కువ కాకుండా తనతో పాటు తాడేపల్లికి రావాలన్న ముద్రగడ.. ఈ సందర్భంగా ఎవరి భోజనాలు వారు తమ వెంట బాక్సుల్ని తెచ్చుకోవాలని కోరటం ఈ మొత్తం ఎపిసోడ్ లో అదిరే అంశంగా చెప్పాలి.

ఈ నెల 14న (గురువారం) కిర్లంపూడిలో బయలుదేరి ప్రత్తిపాడు, జగ్గంపేట, రాజమహేంద్రవరం, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు మీదుగా తాడేపల్లికి చేరుకుంటానని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలనే ఉద్దేశంతో ఎలాంటి కోరికలు లేకుండా ప్రజల సహకారంతో పని చేయాలని తాను నిర్ణయించుకున్నట్లుగా వెల్లడించారు. ఏమైనా.. ప్రస్తుత రాజకీయాల్లో మరే నేతకు సాధ్యం కాని రీతిలో అభిమానులకు ఈ తరహా కండీషన్లు పెట్టటం ముద్రగడకే చెల్లిందని చెప్పాలి.

Tags:    

Similar News