'మేడిన్ ఇండియా'... ఆపరేషన్ సిందూర్ పై మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఈ రోజు నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంటులో అత్యంత కీలక విషయాలపై చర్చలు జరగనున్నాయి.;
ఈ రోజు నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంటులో అత్యంత కీలక విషయాలపై చర్చలు జరగనున్నాయి. ఈ సమయంలో.. ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు పార్లమెంట్ కు చేరుకున్న ప్రధాని నరేంద్రమోడీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్, భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర గురించి ప్రస్తావించారు.
అవును... వర్షాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు పార్లమెంటుకు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడుతూ 'ఆపరేషన్ సిందూరు' గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... 'ఆపరేషన్ సిందూర్' లో మన దేశ సైనికుల సత్తా చూశామని.. అందులో వందశాతం లక్ష్యాలను, అత్యంత కచ్చితత్వంతో సాధించామని ప్రధాని నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు.
కేవలం 22 నిమిషాల్లోనే ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని.. ఈ ఆపరేషన్ తో 'మేడిన్ ఇండియా' సైనిక సామర్థ్యం, గొప్పతనం ఏంటో ప్రపంచం చూసిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల తాను ఎవరిని కలిసినా 'మేడిన్ ఇండియా' ఆయుధాల గురించే మాట్లాడుతున్నారని.. మన ఆయుధాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోందని తెలిపారు.
ఈ సందర్భంగా... ఆపరేషన్ సిందూర్ పై భారతదేశ ఎంపీలు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పర్యటించి వివరించిన విషయాన్ని గుర్తు చేసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ... పాకిస్థాన్ దుష్ట చర్యలను అంతర్జాతీయ సమాజం ముందు ఎండగట్టారని అన్నారు. ఈ క్రమంలో... ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఆపరేషన్ సిందూర్ విజయాన్ని ఒక వేడుకగా చేసుకోవాలని అన్నారు.
మరోవైపు ఈ పార్లమెంట్ సమావేశాలు దేశానికి చాలా గర్వకారణంగా నిలవబోతున్నాయని చెప్పిన ప్రధాని... అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మన మువ్వనన్నెల జెండా ఎగరడం దేశ ప్రజలందరికీ గర్వకారణమని తెలిపారు. ఇదే క్రమంలో... దేశవ్యాప్తంగా వర్షాలు బాగా కురుస్తున్నాయని, ఇది రైతులకు లాభదాయకమని ఆనందం వ్యక్తం చేశారు.