లోన్ యాప్ పై సైబర్ అటాక్... 653 ఖాతాలు, రూ.49 కోట్లు!
ఈ కేసులో బెంగళూరుకు చెందిన సీసీబీ.. ఇస్మాయిల్ తో పాటు మహారాష్ట్రకు చెందిన మరో వ్యక్తిని అరెస్టు చేసింది.;
ఇటీవలి కాలంలో జరిగిన అతిపెద్ద సైబర్ దోపిడీలలో ఒకటి తాజాగా తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... మనీవ్యూ యాప్ నుండి హ్యాకర్లు రూ.49 కోట్లను కేవలం మూడు గంటల్లోనే దోచుకున్నారు. దాని అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ ఫేస్ (ఏపీఐ) వ్యవస్థను హ్యాక్ చేయడం ద్వారా హ్యాకర్లు ఆ యాప్ నుండి రూ.49 కోట్లు దోచుకున్నారు. ఇది హాట్ టాపిక్ గా మారింది.
అవును... ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజు రోజుకీ పెచ్చుమీరుతున్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో రుణాలిచ్చే యాప్ నకే సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపీ పెట్టారు. యాప్ ఏపీఐ సిస్టమ్ లోకి చొరబడిన హ్యాకర్లు.. మూడు గంటల వ్యవధిలోనే రూ.49 కోట్లు కొట్టేశారు. దీనికి సంబంధించిన కథనాలు ఈ విధంగా ఉన్నాయి.
బెంగళూరులోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసీబీ) ప్రకారం.. విజ్డమ్ ఫైనాన్స్ కంపెనీ నిర్వహిస్తున్న మనీవ్యూ యాప్ ను దుబాయ్, చైనా, హాంకాంగ్, ఫిలిప్పీన్స్ నుండి పనిచేస్తున్న అంతర్జాతీయ ముఠా లక్ష్యంగా చేసుకుంది. ఈ సమయంలో... హ్యాకర్లు యాప్ యొక్క ఏపీఐ కీని ఉపయోగించి రూ.49 కోట్లను 3 గంటల్లో దాదాపు 653 నకిలీ అకౌంట్స్ లోకి డబ్బును మళ్లించారు!
బెళగావి నుండి ఇస్మాయిల్ ద్వారా కొనుగోలు చేసిన వర్చువల్ ప్రైవేట్ సర్వర్ (వీపీఎస్) లను ఉపయోగించి సైబర్ దాడిని సమన్వయం చేసిన దుబాయ్ లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన వ్యక్తి ఈ ఆపరేషన్ కు ప్రధాన సూత్రధారి అని అంటున్నారు. రూ. 2,000కి అద్దెకు తీసుకున్న ప్రతి సర్వర్ ను తరువాత ఫ్రాన్స్ కు చెందిన ఐపీ అడ్రస్ కు అనుసంధానించి ఈ దాడికి పాల్పడ్డారు!
ఈ కేసులో బెంగళూరుకు చెందిన సీసీబీ.. ఇస్మాయిల్ తో పాటు మహారాష్ట్రకు చెందిన మరో వ్యక్తిని అరెస్టు చేసింది. ఈ రెండో నిందితుడు పేరు మీద ఉన్న నకిలీ ఖాతాకు కూడా డబ్బు బదిలీ అయింది. ఇదే క్రమంలో... ఇతర బ్యాంక్ ఖాతాల్లోని రూ.10 కోట్లను అధికారులు ఫ్రీజ్ చేశారు. ఇదే సమయంలో.. ల్యాప్ టాప్ లు, పెన్ డ్రైవ్ లను సీజ్ చేశారు.
ఇదే క్రమంలో... దుబాయ్ లో ముగ్గురు అనుమానితులను, హాంకాంగ్ లో ఇద్దరు అనుమానితులను పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. వారి జాడ కోసం అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే అరెస్టయిన ఇద్దరు నిందితులు ఇప్పుడు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.