మోడీ రికార్డులు స‌రే.. దేశంలో వీటి మాటేంటి?!

అది.. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాల‌యం. ఆదివారం భారీ ఎత్తున దానిని అలంక‌రించారు. దేశ విదేశీ పుష్పాల‌ను కూడా తీసుకువ‌చ్చి కనుల పండువ‌గా అలంక‌రించి.. స్వాగ‌త తోర‌ణాలు కూడా ఏర్పాటు చేశారు.;

Update: 2026-03-22 22:30 GMT

అది.. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాల‌యం. ఆదివారం భారీ ఎత్తున దానిని అలంక‌రించారు. దేశ విదేశీ పుష్పాల‌ను కూడా తీసుకువ‌చ్చి కనుల పండువ‌గా అలంక‌రించి.. స్వాగ‌త తోర‌ణాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక‌, నింగినంటే.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కటౌట్లు.. బారులు తీరాయి. ఈ దారి పొడ‌వునా పోలీసుల ను మోహ‌రించారు. ఎక్క‌డా సాధార‌ణ ప్ర‌జ‌లు రాకుండా బారికేడ్లు పెట్టారు. కేవ‌లం పాస్ ఉన్న వారిని మాత్ర‌మే లోప‌లికి అనుమ‌తించారు. ఇవ‌న్నీ.. ప్ర‌ధానిని ఆదివారం భారీగా స‌త్క‌రించేందుకు చేసిన ఏర్పాట్లు..!.

ఎందుకు?

దేశంలో సుదీర్ఘ‌కాలం అధికారిక ఉన్న‌త‌ ప‌ద‌విలో ఉన్న ఏకైక నాయ‌కుడిగా మోడీ రికార్డు సృష్టించ‌డ‌మే. 2001లో ఏ ముహూర్తాన ఆయ‌న గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి అయ్యారో తెలియ‌దు కానీ.. అప్ప‌టి నుంచి నేటి వ‌ర‌కు ఆయ‌న ఉన్న‌త ప‌ద‌వుల్లోనే ఉన్నారు. 2014 మే వ‌ర‌కు.. గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా.. ఇక‌, ఆ త‌ర్వాత నేటి వ‌ర‌కు మోడీ భార‌త ప్ర‌ధాన మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇది దేశంలో ఏ ఒక్క‌రికీ అంద‌ని రికార్డు. భ‌విష్య‌త్తులో ఎవ‌రైనా అందుకుంటారా? అంటే..క‌నుచూపు మేర‌లోనూ ఎవ‌రూ క‌నిపించ‌నంత రికార్డు!. మొత్తంగా 8,931 రోజులు(25 సంవ‌త్స‌రాలుగా) ఆయ‌న ప్ర‌భుత్వాధినేతగా ఉన్నారు. అందుకే ఘ‌న స‌త్కారం.. భారీ ఏర్పాట్లు!!.

క‌ట్ చేస్తే..

మోడీ సాధించిన రికార్డు ఎలా ఉన్నా.. బీజేపీ సంబ‌రాలు ఎలా ఉన్నా.. దేశంలో రెండు కీల‌క స‌మ‌స్య‌లు వెంటాడుతూనే ఉన్నాయి. 1) ఆక‌లి కేక‌లు: దేశంలో 8 కోట్ల మంది ప్ర‌జ‌ల‌కు ఒక పూట తిండి దొర‌క‌డ‌మే.. క‌ష్టంగా మారింద‌ని.. ఈ నెల ప్రారంభంలో అంత‌ర్జాతీయ `జ‌ర్న‌ల్` త‌న నివేదిక‌లో ఆధార స‌హితంగా వివ‌రించింది. 8 కోట్ల మంది అంటే.. దాదాపు రెండు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు స‌మానం. ఒక‌వైపు.. విక‌సిత భార‌త్ అంటూనే.. పేద‌ల ఆక‌లిని తీర్చ‌లేక‌పోవ‌డం.. ఏ రికార్డులు సాధించి ఏం ప్రయోజ‌నం అన్న‌ది మోడీ ఆలోచ‌న చేసుకోవాలి.

2) నిరుద్యోగం: నేడు దేశ‌వ్యాప్తంగా నిరుద్యోగం ప్ర‌బ‌లుతోంది. ఇటీవ‌ల ప్ర‌ధాని మోడీ సొంత రాష్ట్రం గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ లో స‌ఫాయి(రోడ్డు ఊడ‌వ‌డం, మురుగు కాల్వ‌లు శుభ్రం చేయ‌డం) ప‌నుల‌కు సంబంధించి 32 మంది కావాలంటూ నోటిఫికేష‌న్ జారీ చేస్తే.. అనేక నిబంధ‌న‌లు పెడితే.. అన్ని నిబంధ‌న‌ల‌కు లోబ‌డి వ‌చ్చిన అప్లికేష‌న్లు 2302 అంటే అతిశ‌యోక్తి కాదు.. ఆశ్చ‌ర్యం కాదు. వీరిలో బీటెక్ చేసిన వారు.. సాధార‌ణ డిగ్రీ ఉన్న‌వారు వంద‌ల మంది ఉన్నారు. వివాదాల నేప‌థ్యంలో చివ‌ర‌కు ఆ నోటిఫికేష‌న్‌ను ర‌ద్దు చేసుకున్నారు.

ఈ ప‌రిస్థితి దేశ‌వ్యాప్తంగా ఉంది. రాజ‌మండ్రి, విజ‌య‌వాడ మునిసిప‌ల్ ప‌నుల‌కు కూడా ఇలానే నోటిఫికేష‌న్ ఇస్తే.. వేల మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. చిత్రం ఏంటంటే.. ఈ ద‌ర‌ఖాస్తుల విక్ర‌యం ద్వారా... రెండు కార్పొరేష‌న్ల‌కు కోటి రూపాయ‌ల చొప్పున ఆదాయం స‌మ‌కూరింద‌ట‌. సో.. నిరుద్యోగం ఎలా ఉంద‌ని చెప్ప‌డానికి ఇవి తార్కాణాలు. మ‌రి మోడీ ఏం చేసిన‌ట్టు? అనేది ఆత్మ విమ‌ర్శ చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ``స‌త్కారాలు.. స‌న్మానాల‌కు ఇది స‌మ‌య‌మ‌ని నేను అనుకోను. ఎందుకంటే.. ఈ దేశంలో ఆక‌లి కేక‌లు వినిపించ‌ని రోజునే నేను వాటిని అర్హుడిని`` అని దివంగ‌త లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి చేసిన వ్యాఖ్య‌లు.. ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావ‌నార్హం.

Tags:    

Similar News