మోడీ లేటెస్ట్ విదేశీ టూర్...ఖర్గే కామెంట్స్ వైరల్

ప్రధాని మోడీ జూలై నెలలో 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ ఏకంగా వారానికి పైగా విదేశాలలో పర్యటించారు.;

Update: 2025-07-20 23:30 GMT

ప్రధాని మోడీ జూలై నెలలో 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ ఏకంగా వారానికి పైగా విదేశాలలో పర్యటించారు. అలా ఆయన అయిదు దేశాలలో టూర్లు చేసి అక్కడ వారితో భారత్ దౌత్య సంబంధాలను మెరుగుపరచారు. ఇక మరో విదేశీ టూర్ కి ఇదే నెలలో మోడీ షెడ్యూల్ రెడీ అయింది. ఈసారి రెండు దేశాలలో నాలుగు రోజుల పాటు ప్రధాని పర్యటన ఉండబోతోంది.

ఈ నెల 23 నుంచి 26 దాకా మోడీ యునైటెడ్ కింగ్ డం, మాల్దీవులలో పర్యటన చేపట్టనున్నారు. దాంతో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మోడీ విదేశీ టూర్ల మీద విమర్శలు సంధించారు. మోడీ దేశానికి ప్రధానిగా ఉంటూ ఏకంగా 42 దేశాలలో పర్యటనలు చేశారు అన్నారు. మోడీ విదేశీ పర్యటనలు బాగానే ఉన్నా దేశంలో మాత్రం ఆయన కొన్ని ప్రాంతాలకు ఇప్పటికీ వెళ్ళలేకపోతున్నారు అని హాట్ కామెంట్స్ చేశారు.

దేశంలో మణిపూర్ రాష్ట్రం ఉందని అక్కడ జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతోందని ఆయన గుర్తు చేశారు. ఏడాదికి పైగా మణిపూర్ మంటలలో ఉంటే ప్రధానికి అక్కడికి వెళ్ళడానికి తీరిక లేకపోతోందని ఖర్గే విమర్శించారు. మణిపూర్ లో ప్రజాస్వామ్యం ఇబ్బందులో ఉందని ఆయన అన్నారు. ఇక రాజ్యాంగాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్న ప్రయత్నాలను దేశ ప్రజలు ఎంతమాత్రం ఆమోదించరని ఖర్గే అన్నారు.

భారత రాజ్యాంగం అందించిన హక్కులను అంతా అనుభవిస్తున్నారని అన్నారు. ఇదే రాజ్యాంగం మోడీని ముఖ్యమంత్రిగా ప్రధానిగా చేసింది అని ఆయన గుర్తు చేశారు. అన్ని వర్గాలకు సమ న్యాయం చేసేలా రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగం విషయంలో ఎలాంటి మార్పులు తేవాలని బీజేపీ ఆర్ఎస్ఎస్ చూసినా గట్టి ప్రతిఘటన ఎదురు అవుతుందని ఆయన స్పష్టం చేసారు.

ఇదిలా ఉంటే ఈ నెల 21 నుంచి ప్రారంభం అయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ప్రధాని హాజరు కావాలని అనేక కీలక చర్చలలో ఆయన పాల్గొని సభ్యులు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు.

ఈసారి మోడీ సభలో అనేక అంశాల మీద మాట్లాడి స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్మా కోరుతున్నారు. పహల్గాం ఉగ్ర దాడి మీద భారత విదేశాంగ విధానం మీద మోడీ మాట్లాడాలని ఆయన అంటున్నారు. అలాగే మణిపూర్ అంశం మీద ప్రధానమంత్రి మాట్లాడాలని ఇప్పటిదాకా మణిపూర్ ఎందుకు వెళ్ళలేదు అన్న దాని మీద కూడా తెలియ చేయాలని అంటున్నారు. మొత్తానికి చూస్తే కాంగ్రెస్ ఎంపీలు మోడీని పార్లమెంట్ లో అనేక అంశాల మీద మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు. సరిగ్గా పార్లమెంట్ సమయంలోనే మోడీ విదేశీ పర్యటన ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News