మోడీ-షా స్కెచ్ అంటే మామూలు కాదు.. టార్గెట్ కుప్ప కూలాల్సిందే..!

నరేంద్ర మోడీ-అమిత్ షా ద్వయం రాజకీయ చదరంగంలో వేస్తున్న అడుగులు చూస్తుంటే వారు సామాన్యులు కారని అర్థమవుతోంది.;

Update: 2026-04-16 04:42 GMT

నరేంద్ర మోడీ-అమిత్ షా ద్వయం రాజకీయ చదరంగంలో వేస్తున్న అడుగులు చూస్తుంటే వారు సామాన్యులు కారని అర్థమవుతోంది. ఒక సంక్లిష్టమైన సమస్యను పరిష్కరించడానికి మరో సున్నితమైన అంశాన్ని ముడిపెట్టడం ద్వారా వారు ‘డబుల్ ఇంపాక్ట్’ సృష్టించడంలో సక్సెస్ అవుతూ వస్తున్నారు. మహిళా రిజర్వేషన్ అనే భావోద్వేగ అంశాన్ని, డీలిమిటేషన్ అనే రాజకీయ అవసరాన్ని ఒకే గాటన కట్టడం వెనుక ఉన్న వ్యూహం చూస్తే రాజకీయ చతురత కనిపిస్తుంది.

మోడీ-షా మాస్టర్ ప్లాన్

భారత రాజకీయాల్లో నరేంద్ర మోడీ, అమిత్ షా జోడీని ‘మాడర్న్ చాణక్యం’ అని ఎందుకు అంటారో ప్రస్తుత పరిణామాలు మరోసారి రుజువు చేస్తున్నాయి. దశాబ్దాల తరబడి నానుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లును, అత్యంత వివాదాస్పదమైన నియోజకవర్గాల పునర్విభజన అంశంతో ముడిపెట్టడం ద్వారా వారు ఒక రాజకీయ సాహసానికే తెరలేపారు. సోనియా గాంధీ వంటి దిగ్గజ నేతలు సైతం అడుగు ముందుకు వేయలేకపోయిన చోట, మోడీ సర్కారు తనదైన శైలిలో మార్గాన్ని సుగమం చేసుకుంటోంది. దీని వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఈ రెండు బిల్లుల కలయిక దేశ రాజకీయాలను ఎలా మార్చబోతోంది? అన్నది చూద్దాం..

‘సెంటిమెంట్’ అస్త్రం

మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనేది దేశ వ్యాప్తంగా ఉన్న బలమైన డిమాండ్. దీనిని వ్యతిరేకించే ధైర్యం ఏ రాజకీయ పార్టీకీ లేదు. ఒకవేళ ఎవరైనా అడ్డుకుంటే వారు ‘మహిళా వ్యతిరేకులు’గా ముద్రపడే ప్రమాదం ఉంది. మోడీ-షా ద్వయం సరిగ్గా ఇదే పాయింట్‌ను పట్టుకున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఒక రక్షణ కవచంలా వాడుకుంటూ, దాని వెనుక నియోజకవర్గాల పునర్విభజన అనే పెద్ద మార్పును ప్రవేశపెట్టారు. మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రావాలంటే ముందుగా డీలిమిటేషన్ జరగాలనే నిబంధనను చేర్చడం ద్వారా, ఆ రెండో ప్రక్రియకు కూడా ఎదురులేకుండా చేసుకున్నారు.

850 సీట్ల వ్యూహం.. ఎవరికీ దక్కని క్లారిటీ!

ప్రస్తుతం లోక్‌సభలో 543 స్థానాలు ఉన్నాయి. మహిళలకు 33 శాతం కేటాయించాలంటే ఉన్న సీట్లలోనే పురుషుల వాటాను తగ్గించాలి. ఇది ఏ రాజకీయ నాయకుడికీ ఇష్టం ఉండదు. అందుకే మోడీ సర్కారు ఒక తెలివైన వ్యూహాన్ని తీసుకువచ్చింది. డీలిమిటేషన్ ను అడ్డుపెట్టి నియోజకవర్గాల గరిష్ట సంఖ్యను 550 నుంచి ఏకంగా 850కి పెంచేయడం. ఇలా చేయడం వల్ల పురుష ఎంపీల సంఖ్య తగ్గదు, అదే సమయంలో మహిళలకు 181 సీట్లు అదనంగా కేటాయించే అవకాశం దక్కుతుంది. అంటే, ఎవరి సీటుకూ భంగం కలగకుండానే రిజర్వేషన్లు అమలు చేశామన్న క్రెడిట్ కొట్టేయవచ్చు. అయితే, ఈ సీట్ల పెంపు ఎలా జరుగుతుందనే దానిపై బిల్లు ప్రతిలో క్లారిటీ ఇవ్వకుండా ‘సస్పెన్స్’ మెయింటైన్ చేయడం మోడీ-షా మార్క్ పాలిటిక్స్.

దక్షిణాది రాష్ట్రాలకు అమిత్ షా హామీ!

డీలిమిటేషన్ అనగానే దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఆందోళన మొదలైంది. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే ఉత్తరాది ఆధిపత్యం పెరుగుతుందని వీరి భయం. అయితే, ఇక్కడే అమిత్ షా ఒక అనధికారిక ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. జనాభాతో సంబంధం లేకుండా ప్రస్తుతం ఉన్న స్థానాలపై 50 శాతం సీట్లను పెంచడం. ఉదాహరణకు, తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు ఉంటే, అవి 25-26 కు చేరుతాయి. యూపీలో 80 ఉంటే 120 అవుతాయి. ఇలా చేయడం వల్ల నిష్పత్తి మారకుండా ఉంటుంది, రచ్చ తగ్గుతుంది. కానీ, దీనిపై అధికారిక ప్రకటన రాకపోవడం వల్ల ప్రతిపక్షాలు ఫోకస్ ఎటు పెట్టాలో తెలియక అయోమయంలో ఉన్నాయి.

ఎన్డీయేకు ఏకపక్ష మెజార్టీ.. సులువైన మార్గం!

ప్రస్తుతం లోక్‌సభలో ఎన్డీయే కూటమికి తిరుగులేని బలం ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ‘ఇండియా కూటమి’ మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితిని మోడీ సర్కారు కల్పించింది. డీలిమిటేషన్ అంశంపై అభ్యంతరాలు ఉన్నప్పటికీ, మహిళా బిల్లును అడ్డుకోలేక ప్రతిపక్షాలు మౌనంగా ఉండక తప్పడం లేదు. ఫలితంగా రెండు కీలకమైన మార్పులు ఏకకాలంలో చట్టాలుగా మారబోతున్నాయి. ఇది మోడీ సర్కారుకు దశాబ్దాల పర్యంతం గుర్తుండిపోయే ఘనతను తెచ్చిపెడుతుంది.

ఈ రెండు బిల్లులను ఒకేసారి తీసుకురావడం ద్వారా మోడీ-షా ద్వయం తమ రాజకీయ చాణక్యాన్ని నిరూపించుకున్నారు. ఒకవైపు మహిళా ఓటర్ల మద్దతును మూటగట్టుకోవడం, మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన ద్వారా పార్టీకి భవిష్యత్తులో లబ్ధి చేకూర్చడం అనే రెండు పనులను ఒకే దెబ్బతో పూర్తి చేస్తున్నారు. డీలిమిటేషన్ వల్ల తలెత్తే రాజకీయ చిక్కుముడులను మహిళా రిజర్వేషన్ అనే సెంటిమెంట్‌తో విప్పేయడం నిజంగా మామూలు విషయం కాదు. అందుకే రాజకీయ విశ్లేషకులు కూడా ‘మోడీ-షా.. మాములోళ్లు కాదండోయ్’ అని ముక్తకంఠంతో చెబుతున్నారు.

Tags:    

Similar News