వైసీపీ మద్దతు, కానీ షరతులు వర్తిస్తాయంటూ మెలిక!

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 131వ రాజ్యాంగ సవరణకు వైసీపీ మద్దతు ప్రకటించింది.;

Update: 2026-04-16 10:27 GMT

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 131వ రాజ్యాంగ సవరణకు వైసీపీ మద్దతు ప్రకటించింది. మహిళా రిజర్వేషన్లతోపాటు డీలిమిటేష్ బిల్లులు తమకు ఆమోదయోగ్యమేనని వైసీపీపీ నేత మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఏపీ ప్రయోజనాలకు ఏ మాత్రం నష్టం జరిగినా ఈ విషయంలో మద్దతు చెప్పలేమని తేల్చిచెప్పారు. ప్రస్తుతం దేశం మొత్తం పార్లమెంటు సమావేశాలను ఆసక్తిగా గమనిస్తోంది. రాజ్యాంగ సవరణకు అవసరమైన సంఖ్యాబలం లేకపోయినా కేంద్ర ప్రభుత్వం రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. వీటి ఆమోదానికి కేంద్రం ఎలా ప్రయత్నిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.

ఈ పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల్లో తటస్థ వైఖరి అవలంబిస్తున్న వైసీపీ అధికార కూటమికి మద్దతు ప్రకటించింది. 2014 నుంచి కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి వైసీపీ బాసటగానే నిలుస్తూ వస్తోంది. ఇప్పటివరకు ఏ బిల్లును వైసీపీ వ్యతిరేకించలేదు. ఈ పరిస్థితుల్లో మహిళా బిల్లు విషయంలో వైసీపీ నిర్ణయాన్ని ముందే ఊహించినా, గతంలో ఎన్నడూ లేనివిధంగా షరతులు వర్తిస్తాయని చెప్పడమే విశేషమని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

కేంద్రం ప్రస్తుతం ప్రవేశపెడుతున్న డీలిమిటేషన్ విధానం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ ఆధ్వర్యంలోని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో వైసీపీ ఈ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటుందని భావించారు. కానీ, వైసీపీ ఎప్పటిలానే ఎన్డీఏ కూటమికి భేషరతుగా మద్దతు ప్రకటించింది. అయితే సీట్లు పెంపు విషయంలో ఏపీకి అన్యాయం జరిగితే తాము మద్దతు ఇచ్చేది లేదని ఎంపీ మిథున్ రెడ్డి హెచ్చరించడం హాట్ టాపిక్ గా మారింది.

రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంటులో మూడో వంతు సభ్యుల ఆమోదం అవసరమని చెబుతున్నారు. ఈ క్రమంలో మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి 367 మంది సభ్యుల బలం ఉండాలని అంటున్నారు. ప్రస్తుతం బీజేపీ మిత్రపక్షాలకు 298 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. వైసీపీ వంటి తటస్థ పార్టీలతోపాటు విపక్షంలోని బిల్లుకు అనుకూలంగా ఉన్న పార్టీల మద్దతుతో బిల్లును ఆమోదించుకోవాలని కేంద్ర సర్కారు ప్లాన్ చేస్తోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగానే వైసీపీని బీజేపీ అగ్రనాయకత్వం సంప్రదించిందని అంటున్నారు. మహిళా రిజర్వేషన్లకు తమ పార్టీ తొలి నుంచి అనుకూలమేనని ఆ పార్టీ ఎంపీలు ప్రకటించారు.

Tags:    

Similar News