జీవితాన్ని మార్చిన ఇన్ స్టా కామెంట్... ఈడూ జోడూ బాగాలేదని భర్త మర్డర్..
ఇటీవల కాలంలో భార్యల చేతుల్లో హత్యకు గురవుతున్న భర్తల సంఖ్య పెరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే.;
ఇటీవల కాలంలో భార్యల చేతుల్లో హత్యకు గురవుతున్న భర్తల సంఖ్య పెరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఇలాంటి ఎన్నో షాకింగ్ ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో తన ఫాలోవర్స్ పెట్టిన కామెంట్ కు హర్ట్ అయిన ఓ మహిళ.. ప్రియుడితో జతకట్టడమే కాదు, అతడితో కలిసి భర్తను హత్య చేసింది!
అవును... "నీ భర్త అంకుల్ లా ఉన్నాడు".. "భాబీజీ.. మీ జంట సరిపోలడం లేదు".. "మేడమ్.. మీకు, మీ భర్తకు ఏ మాత్రం మ్యాచ్ కాలేదు" వంటి కామెంట్లు.. ఆ జంట జీవితాన్ని ఒక్కసారిగా మార్చేశాయి! ఈ క్రమంలో తన ఇన్ స్టా ఫాలోవర్లు పెట్టిన కామెంట్లు ఓ భర్త ప్రాణం పోవడానికి పరోక్షంగా కారణమయ్యాయని అంటున్నారు. ఈ ఘటన యూపీలోని మీరట్ లో జరిగింది.
వివరాళ్లోకి వెళ్తే... యూపీలోని మీరట్ లో అంజలి అనే మహిళ తన భర్తతో కలిసి ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ చేస్తూ ఉండేది. ఆమె తన రీల్స్ లో తనకు తన భర్త అంటే చాలా ఇష్టమని, అతడే తన సర్వస్వం అని చెబుతూ ఉండేది. అయితే.. అలా తన భర్తపై ప్రేమ కురిపించిన ఆన్ లైన్ వేదిక చివరికి ఆమెకు అతనిపై ఊహించని స్థాయిలో ఆగ్రహాన్ని పెంచింది!
అంజలి మనసు మార్చిన కామెంట్స్!:
ఇన్ స్టాలో అంజలి ఫాలోవర్స్.. ఆమెకు, ఆమె భర్తకు జోడీ సరిపోలేదని.. ఈడూ జోడూ సెట్ కాలేదని కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు! మరికొంతమంది "ఆ అంకుల్ ఎవరు" అంటూ వెకిలి కామెంట్లు పెట్టారు! ఇలా పదే పదే కనిపించిన కామెంట్లు ఆమెను తీవ్రంగా కలవరపెట్టాయట. ఫైనల్ గా తన భర్త రాహుల్ కు ఆమెకు మధ్య ఊహించని స్థాయిలో గీతను గీశాయి!
అజయ్ తో ఎఫైర్.. హత్యకు ప్లాన్!:
ఈ పరిణామాల నేపథ్యంలో అంజలి తన గ్రామానికే చెందిన అజయ్ అనే యువకుడితో సంబంధాన్ని పెట్టుకుంది.. పెంచుకుంది! ఈ సమయంలో వీరిద్దరూ కలిసి రాహుల్ ని అంతమొందించాలనే కుట్ర పన్నారు. ఈ క్రమంలో రాహుల్ ను అజయ్ కాల్చి చంపాడు. దీంతో రాహుల్ అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన నవంబర్ 1న జరగ్గా.. నవంబర్ 6న పోలీసులు కేసును ఛేధించారు.
పోలీసులు తెలిపిన వివరాలు!:
నవంబర్ 1వ తేదీ సాయంత్రం సమయంలో ఎవరినో కలవాలని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు రాహుల్. అయితే... రాత్రి ఎంత సమయమైనా అతడు తిరిగి రాలేదు. ఫోన్ కు సమాధానం లేదు. ఎంత వెతికినా అతని జాడ కనిపించలేదు. దీంతో పోలీసు స్టేషన్ లో మిస్సింగ్ ఫిర్యాదు నమోదైంది. కట్ చేస్తే.. ఆ తర్వాత గ్రామస్తులు రాహుల్ మృతదేహాన్ని సమీపంలోని అటవీ ప్రాంతంలో గుర్తించారు.
పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి వచ్చారు. ఆ సమయంలో రాహుల్ ఛాతిలో 3 బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, కాల్ రికార్డులను పరిశీలించారు. తద్వారా ఈ ఘాతుకానికి కారణం అంజలి, అజయ్ లని గుర్తించారు.. విచారణలో ఇద్దరూ నేరాన్ని అంగీకరించారు.