ఫేక్ రేప్ కేసు... యువ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి!
పలు తప్పుడు కేసులు కొంతమంది జీవితాలను, కుటుంబాలను ఏ స్థాయిలో నాశనం చేస్తాయనేదానికి ఎన్నో ఉదాహరణలు ఉన్న సంగతి తెలిసిందే.;
పలు తప్పుడు కేసులు కొంతమంది జీవితాలను, కుటుంబాలను ఏ స్థాయిలో నాశనం చేస్తాయనేదానికి ఎన్నో ఉదాహరణలు ఉన్న సంగతి తెలిసిందే. ఉదాహరణకు పలువురు మహిళలు పెట్టే గృహ హింస (సెక్షన్ 498/ఏ) చాలా వరకూ ఫేక్ ఉంటున్నాయని.. చట్టాన్ని దుర్వినియోగ పరుస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో తాజాగా త్వరలో పెళ్లి చేసుకోబోయే వ్యక్తిపై తప్పుడు రేప్ కేసు పెట్టడంతో అతడు మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది.
అవును... పలువురు పెట్టే పలు తప్పుడు కేసులు చాలా మంది జీవితాలను నాశనం చేసేస్తున్నాయి. తమ రక్షణ కోసం ఏర్పాటు చేయబడిన చట్టాలను పలువురు వ్యూహాత్మకంగా దుర్వినియోగ పరుస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మ్యాట్రిమొనీ సైట్ లో పరిచయమై, సుమారు నాలుగు నెలలుగా ప్రేమలో ఉండి, వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న ఓ జంట విషయంలో... సదరు మహిళ చేసిన ఓ పని, అతడు జైలు పాలవ్వడానికి, అనంతరం ఆత్మహత్యకు కారణమైంది.
వివరాళ్లోకి వెళ్తే... బిలాస్ పూర్ కు చెందిన 29 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గౌరవ్ సవానీ.. ఒక మ్యాట్రిమోనీ సైట్ లో ఒక మహిళను కలిశారు. ఆమెతో సుమారు నాలుగు నెలలు ఫోన్ లో మాట్లాడుకున్నారు. ఆ మాటలు కాస్త ప్రేమ, ప్రణయం కబుర్ల వరకూ వెళ్లాయి! ఈ సమయంలో వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఓ హోటల్ లో కలిసినప్పుడు పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి!
ఇందులో భాగంగా... అతనిపై అత్యాచారం కేసు పెడతానని ఆమె బెదిరించింది! ఆ పరిచయాన్ని, మీటింగ్ ని ఒక పీడకలగా మార్చింది. దీంతో అతడు వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. ఈ గ్యాప్ లో ఆమె తనను తాను గాయపరచుకుంది. అతనిపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. ఈ నేపథ్యంలో.. ఈ విషయం గురించి ముందుగా ఫిర్యాదు చేసినప్పటికీ గౌరవ్ సవానీ అరెస్టు అయ్యాడు.
అతడికి పోలీసులు కోర్టులో హాజరు పరచగా.. 15 రోజుల రిమాండ్ విధించబడింది! ఈ క్రమంలో బెయిల్ పై జైలు నుంచి విడుదలైన తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన గౌరవ్.. తీవ్ర మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడని బంధువులు, స్నేహితులు చెబుతున్నారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అతడు ఎవరితోనూ సరిగా మాట్లాడలేదని అంటున్నారు. ఈ క్రమంలో ఓ షాకింగ్ ఘటన తెరపైకి వచ్చింది.
ఇందులో భాగంగా... గౌరవ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉసలాపూర్ లోని రైలు పట్టాలపై అతడి మృతదేహం కనిపించింది. అతడి వద్ద ఓ సూసైడ్ నోట్ కూడా కనిపించింది. అందులో... ప్రేమలో మోసపోయానని గౌరవ్ ఆ నోట్ లో రాశారు. దీనిపై స్పందించిన పోలీసులు అతడి ఆత్మహత్యపై వివరణాత్మక దర్యాప్తు జరుపుతామని తెలిపారు. మరోవైపు గౌరవ్ ఆత్మహత్యతో అతని తల్లి ఐసీయూలో చేర్చబడింది!