అతి చిన్న వయస్సులో ఉద్యమంలోకి.. ఆశ్చర్యం కల్పిస్తున్న సునీత కథ..
మావోయిస్టు ఉద్యమం అనేది అనేక దశాబ్దాలుగా భారత అంతర్గత భద్రతా వ్యవస్థను సవాలు చేస్తోంది.;
మావోయిస్టు ఉద్యమం అనేది అనేక దశాబ్దాలుగా భారత అంతర్గత భద్రతా వ్యవస్థను సవాలు చేస్తోంది. అడవుల్లో రక్తం, నినాదాలతో నిండిన ఆ కథలో కొన్నిసార్లు ఆశ్చర్యపరిచే మలుపులు కనిపిస్తాయి. వాటిల్లో తాజా ఉదాహరణ కేవలం 23 ఏళ్ల వయసులోనే మధ్యప్రదేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు సభ్యురాలు సునీత జీవితం. చీకటి సిద్ధాంతం నుంచి వెలుగులోకి అడుగుపెట్టిన సంకేతం.
20 ఏళ్లకే అడవుల్లోకి..
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సునీతకు బాల్యం నుంచి పేదరికం ఆమె కుటుంబాన్ని విడవలేదు. అన్ని కష్టాల మధ్య ప్రజలకు ఏదైనా మంచి చేద్దామనే ఉద్దేశ్యంతో 20 ఏళ్ల వయసులోనే మావోయిస్టు పార్టీలో చేరింది. సమాజంలో మార్పు కోసం పోరాడాలి అనే ఆవేశం ఆమెను ఆ దారిలోకి నడిపించింది. సునీత సెంట్రల్ కమిటీలో పనిచేసింది. ప్రముఖ మావోయిస్టు నాయకుడు రామ్‌దర్ బాడీగార్డుగా కూడా వ్యవహరించింది. పలు దాడుల్లో కీలక పాత్ర పోషించిందని పోలీసులు చెబుతున్నారు. ఆమెపై ప్రభుత్వం రూ.14 లక్షల రివార్డు ప్రకటించడం. ఆమెకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో ఇట్టే చెప్తోంది. చిన్న వయసులోనే ఆమె ఎరుపుదారి మధ్యలో నిలబడి, హింసే పరిష్కారం అని నమ్మిన జీవితాన్ని గడిపింది.
ఆపరేషన్ కగార్ మార్పును తెచ్చిన ప్రయత్నం
కేంద్రం ప్రారంభించిన ఆపరేషన్ కగార్ కేవలం మావోయిస్టులను అణగదొక్కే ప్రయత్నం కాదు. అది వారిని తిరిగి జన జీవన స్రవంతిలోకి తీసుకురావాలనే సామాజిక ప్రయత్నం. ఈ ఆపరేషన్ కగార్ ద్వారా భయాన్ని కాదు, ఆలోచనను రేకెత్తించింది కేంద్ర ప్రభుత్వం. సునీత కూడా అదే ఆలోచనలో మార్పు చూసి ముందుకొచ్చింది.
తుపాకీని వీడి జనజీవితంలోకి..
ఎన్నో సంవత్సరాలుగా అడవుల్లో తిరిగిన సునీత చివరకు తుపాకీని పక్కన పెట్టి రాజ్యాంగాన్ని ఎంచుకుంది. ఆమె లొంగుబాటు కేవలం ఓటమి కాదు అది ఆలోచనలో వచ్చిన తిరుగుబాటు. ఒకప్పుడు తుపాకీని పట్టుకున్న ఆ చేతులు ఇప్పుడు సమాజానికి అర్థవంతమైన జీవితం నిర్మించాలనే ఆశతో ముందుకెళ్తున్నాయి. ఆమెకు పునరావాసం కల్పించి, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మావోయిస్టు ఉద్యమంలో ఇలాంటి యువతులు చాలా మంది ఉన్నారు. పేదరికం, అజ్ఞానం, మోసపూరిత ప్రచారం వారిని అడవుల్లోకి నడిపించాయి. కానీ సునీత లొంగుబాటు వారికి ఒక సందేశం.
సునీత లొంగుబాటు కేవలం ఒక వార్త కాదు.. అది ఒక విలువైన సందేశం. సమాజం వారిని ఆహ్వానిస్తుంది. అడవుల్లో పుట్టిన ఆవేశం కూడా ఒకరోజు అవగాహనగా మారవచ్చు. సునీత తన జీవితంలో మొదటిసారి లొంగిపోయింది. కానీ అదే లొంగుబాటు ఆమెకు నిజమైన స్వేచ్ఛను ఇచ్చింది. తుపాకీ చేతుల్లో ఉన్నప్పుడు ఆమె భయపడుతూ కాలం గడిపింది. కానీ నేడు ఆ భయం ఆమెకు లేదు.