విమాన ప్రమాదంలో కాలిపోయిన పసికందు.. తన చర్మంతో బతికించిన తల్లి!
జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే.;
జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విమానంలో ఉన్న 241 మందితో పాటు స్థానికంగా ఉన్నవారు 19 మంది మరణించారు. ఈ సమయంలో... విమానం మెడికల్ కాలేజీ హాస్టల్స్ పై కూలిపోయినప్పుడు.. అక్కడ మనీషా కచ్చాడియా, ఆమె 8 నెలల కుమారుడు ధ్యాన్ష్ ప్రమాదంలో దెబ్బతిన్న భవనాల్లో ఒకదానిలో ఉన్నారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో అతి పిన్న వయస్కుడైన ధ్యాన్ష్.. సుమారు 36 శాతం కాలిన గాయాలతో అహ్మదాబాద్ లోని సివిల్ హాస్పిటల్ లోని పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు అతడి తల్లి మనీషాకు సుమరు 25% శరీరం కాలిపోయింది. ఈ క్రమంలో తల్లి అతడిని కాపాడుతున్న తీరు అందరి హృదయాలను కలిచి వేస్తోంది. బిడ్డ కోసం ఆమె తన చర్మాన్ని ఇచ్చింది.
అవును... అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం వందల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ విమానం కూలిపోయిన బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ పక్కనే ఉన్న ఇంట్లో మనీషా కుటుంబం నివసిస్తోంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో.. కుమారుడు ధ్యాన్ష్ తో పాటు ఆమె కూడా ఇంట్లోనే ఉంది. సరిగ్గా ఆ సమయంలో పెద్ద శబ్ధం వినిపించింది.
ఉన్నపలంగా చుట్టూ దట్టమైన నల్లని పొగ కమ్మేసింది. ఈ సమయంలో తన కుమరుడిని చేతుల్లోకి తీసుకున్న మనీషా... బయటకు పరుగు పెట్టడం ప్రారంభించింది. బిడ్డను గుండెలకు హత్తుకుని మంటల్లోంచి బయటకు వచ్చింది. అది గుర్తించిన రెస్క్యూ సిబ్బంది వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వీరిని పరీక్షించిన వైద్యులు ఆమెకు 25%, బాబుకు 36% కాలిన గాయాలు అయినట్లు తెలిపారు.
ఈ క్రమంలోనే ధ్యాన్ష్ చర్మం మొత్తం కాలిపోగా.. అతడికి ఇతరుల చర్మం పెట్టాల్సిన అవసరం ఏర్పడిందని వైద్యులు చెప్పారు. ఈ చికిత్స చేయకపోతే బిడ్డ ప్రాణానికే ప్రమాదం అని చెప్పారని అంటున్నారు. ఈ సమయంలో... తన చర్మాన్నే బిడ్డకు పెట్టమని మనీషా వైద్యులను కోరింది. దీంతో... వైద్యులు ఆమె చర్మాన్ని తీసుకుని బాబుకు అతికించారు! ఈ క్రమంలో వీరిద్దరూ తాజాగా ఆస్పత్రి నుంచి బయటకు వచ్చారు!