మాల్దీవుల తిరుగుబాటును భారత్ అణిచివేసిందా?

1988లో మాల్దీవుల్లో జరిగిన తిరుగుబాటును అణచివేయడంలో భారత్‌ అందించిన సహకారాన్ని యామీన్‌ ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు.;

Update: 2025-11-04 06:09 GMT

మాల్దీవ్స్ మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్‌ అబ్దుల్‌ గయూమ్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి. భారత్‌తో సంబంధాల్లో తరచూ వివాదాలకు కారణమైన యామీన్‌, ఈసారి భారతదేశం పట్ల ప్రశంసల జల్లు కురిపించడం గమనార్హం. గతంలో 'ఇండియా అవుట్‌' ఉద్యమానికి నాయకత్వం వహించిన యామీన్‌ నుంచి ఇలాంటి సానుకూల వ్యాఖ్యలు రావడం స్థానికంగా, అంతర్జాతీయంగా చాలా మందిని ఆశ్చర్యపరిచింది.

*1988 తిరుగుబాటు: భారత్‌ అండను మరువలేం!

1988లో మాల్దీవుల్లో జరిగిన తిరుగుబాటును అణచివేయడంలో భారత్‌ అందించిన సహకారాన్ని యామీన్‌ ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. యామీన్‌ మాట్లాడుతూ “1988లో మాల్దీవుల్లో జరిగిన తిరుగుబాటును అణచివేయడంలో భారత్‌ అందించిన సహాయం ఎప్పటికీ మరిచిపోలేం. ఆ సమయంలో విదేశీ కిరాయి సైనికులు సాయుధ దాడులు జరిపారు. మన దేశంలో సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో భారత్‌ చూపిన స్పందన, సహకారం మాల్దీవుల చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది” అని అన్నారు.

* 'ఆపరేషన్ కాక్టస్': తొమ్మిది గంటల్లో తిరుగుబాటు భగ్నం

1988లో అప్పటి మాల్దీవుల అధ్యక్షుడు మౌమూన్‌ అబ్దుల్‌ గయూమ్‌, తిరుగుబాటు దళాల దాడితో తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారు. ప్రాణభయంతో ఉన్న ఆయన వెంటనే భారత్‌ సహాయం కోరారు. అప్పటి ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ వెంటనే స్పందించి, ఇండియన్‌ పారా కమాండోలును ('ఆపరేషన్ కాక్టస్' కింద) గగనతల, సముద్ర మార్గాల ద్వారా మాల్దీవులకు పంపించారు. కేవలం తొమ్మిది గంటల వ్యవధిలోనే భారత బలగాలు తిరుగుబాటును అణచివేశాయి, అధ్యక్షుడిని కాపాడాయి. అంతేకాక పారిపోతున్న తిరుగుబాటు దళాలను భారత నౌకాదళం సముద్రంలోనే అడ్డుకుని అరెస్ట్‌ చేసింది.

* నవంబర్‌ 3: భారత్‌కు కృతజ్ఞత సూచకంగా "విక్టరీ డే"

ఈ చారిత్రక సంఘటనను గుర్తుచేసుకుంటూ, మాల్దీవులు ప్రతి సంవత్సరం నవంబర్‌ 3న “విక్టరీ డే”గా జరుపుకుంటోంది. ఈ సందర్భంగానే యామీన్‌ ఈ ప్రశంసలు చేశారు. “విక్టరీ డే మన సైనికుల ధైర్యసాహసాలను గుర్తుచేసే రోజు మాత్రమే కాదు; అవసరమైన సమయంలో భారత్‌ అందించిన అండకు కృతజ్ఞత తెలిపే సందర్భం కూడా” అని ఆయన పేర్కొన్నారు.

* భారత్‌ వ్యతిరేకి నుంచి ప్రశంసలు: రాజకీయ పునరాగమనం కోసమేనా?

యామీన్‌, 2013 నుండి 2018 వరకు మాల్దీవుల అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పాలనలో చైనాతో మైత్రి పెంచడానికి భారత్‌ నుంచి దూరంగా వెళ్లే విధానాన్ని అనుసరించారు. అంతేకాదు “ఇండియా అవుట్‌” ఉద్యమానికి కూడా నాయకత్వం వహించారు, భారత సైనిక సిబ్బందిని వెనక్కి పంపాలని డిమాండ్‌ చేశారు.

అధికారం కోల్పోయిన తర్వాత అవినీతి ఆరోపణలతో జైలు శిక్ష అనుభవించి, 2024 ఏప్రిల్‌లో హైకోర్టు ఆదేశాలతో ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్న యామీన్‌, దేశ రాజకీయాలపై మళ్లీ ప్రభావం చూపే ప్రయత్నాల్లో ఉన్నారు. తాజా ఆయన వ్యాఖ్యలు, భారత్‌–మాల్దీవుల మధ్య సంబంధాలపై కొత్త చర్చకు దారితీశాయి, అలాగే ఆయన రాజకీయ పునరాగమనంలో భాగంగా భారత్‌ పట్ల సానుకూల వైఖరిని ప్రదర్శిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News