బీఆర్ఎస్ దాడికి ఖండన : మహా టీవీకి పెద్దఎత్తున సంఘీభావం

అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వం మహా టీవీకి దన్నుగా నిలిచింది. తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్వయంగా మహా న్యూస్ కార్యాలయాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.;

Update: 2025-06-28 13:26 GMT

హైదరాబాద్‌లోని మహా టీవీ హెడ్ ఆఫీసుపై తాజాగా బీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన దాడిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ప్రముఖ రాజకీయ నాయకులు, జర్నలిస్టు సంఘాలు, ప్రజలు అభివర్ణించారు. మహా టీవీకి అండగా నిలుస్తున్నామని పలువురు ప్రకటించారు. మీడియా స్వేచ్ఛను పరిరక్షించడంలో ఛానెల్ పాత్రను కొనియాడారు.

- ప్రముఖుల సంఘీభావం

ఈ దాడి జరిగిన వెంటనే, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. "ప్రజావాణి వినిపించే మీడియాపై దాడి ప్రజాస్వామ్యంపై దాడిగానే పరిగణించాలి. మహా టీవీపై దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇటువంటి దాడులు క్షమార్హం కాదు" అని ఆయన పేర్కొన్నారు.

అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వం మహా టీవీకి దన్నుగా నిలిచింది. తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్వయంగా మహా న్యూస్ కార్యాలయాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మహా టీవీపై దాడిని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. "వ్యక్తిగతంగా, వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయని కార్యకర్తలను ఉసిగొల్పి దాడి చేయించడం సరికాదు. అధికారం కోల్పోయిన తర్వాత ఇలా విచక్షణ కోల్పోయి మీడియాపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం" అని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా మహా న్యూస్ టీవీ ఛానెల్‌పై బీఆర్ఎస్ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండించారు. "నిజాలు చెప్పినందుకు దాడులు సరికాదు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్, డీజీపీలను కోరాం. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధం" అని ఆయన అన్నారు.

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సైతం మహా టీవీపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. "ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది వాస్తవం. కేసీఆర్, జగన్ జాయింట్ ఆపరేషన్ గా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. వాస్తవాలను బయటపెడుతున్న మీడియాపై దాడి చేయడం చాలా చాలా అరాచకం" అని ఆమె వ్యాఖ్యానించారు.

-మహా టీవీ పాత్రకు మరింత గుర్తింపు

ఈ సంఘటనలు మహా టీవీ జర్నలిజంపై ప్రజలు, రాజకీయ నాయకులకు ఉన్న నమ్మకాన్ని, ఛానెల్ నిబద్ధతను స్పష్టం చేస్తున్నాయి. నిజాన్ని నిక్కచ్చిగా ప్రజలకు చేరవేసే మహా టీవీ ప్రయత్నాలను ఈ దాడులు ఏమాత్రం ఆపలేవని, పైగా, ఛానెల్‌కు మరింత మద్దతు లభిస్తుందని ఆ చానెల్ ఎండీ వంశీ, మహా జర్నలిస్టులు మీడియాతో మాట్లాడుతూ అభిప్రాయపడుతున్నారు. మహా టీవీ ధైర్యంగా తన జర్నలిజం ప్రయాణాన్ని కొనసాగిస్తుందని, ప్రజావాణికి అండగా నిలవాలని వారు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News