బీఆర్ఎస్ అభ్య‌ర్థి సునీత‌పై కేసులు.. పార్టీ ఖుషీ!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరులో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ పార్టీ త‌ర‌ఫున పోటీలో ఉన్న మాగంటి సునీత‌పై రెండు కేసులు న‌మోద‌య్యాయి.;

Update: 2025-10-31 09:57 GMT

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరులో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ పార్టీ త‌ర‌ఫున పోటీలో ఉన్న మాగంటి సునీత‌పై రెండు కేసులు న‌మోద‌య్యాయి. ఒక‌టి బోర‌బండ పోలీసు స్టేష‌న్‌లోను, మ‌రొక‌టి జూబ్లీహిల్స్ ప‌రిధిలోనూ న‌మోదైన‌ట్టు పోలీసులు చెప్పారు. అయితే.. ఈ వ్య‌వ‌హారంపై ఆవేద‌న వ్య‌క్తం చేయాల్సిన బీఆర్ ఎస్‌.. రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేయాల్సిన ఆ పార్టీ నాయ‌కులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. చిత్రంగా అనిపించినా.. ఇది నిజ‌మే!.

ఏంటా కేసులు..

జూబ్లీహిల్స్ పీఎస్‌లో కొన్నాళ్ల కింద‌ట‌.. మాగంటి సునీత‌పై కేసు పెట్టారు. ఆమె మాగంటి స‌తీమ‌ణి కాద‌ని.. తానే మొద‌టి భార్య‌నంటూ.. గోపీనాథ్ తొలి భార్య కుమారుడు ఫిర్యాదు చేశారు. దీనిపై రాజ‌కీయ దుమారం రేగింది. అయితే.. దీనిని బీఆర్ ఎస్ నాయ‌కులు అంతే బ‌లంగా తిప్పికొట్టారు. ప్ర‌స్తుతం ఈ కేసు విచార‌ణ ప‌రిధిలో ఉంది.

ఇక‌, తాజాగా మాగంటి సునీత‌.. ఓట‌ర్ల‌కు సీరియ‌ల్ నెంబ‌రు, పార్టీ గుర్తుతో ఉన్న స్లిప్పులు పంచుతున్నారంటూ.. కాంగ్రెస్ పార్టీకి చెందిన క‌మ్యూనికేష‌న్ విభాగం చైర్మ‌న్ మోహ‌న్ రెడ్డి రిట‌ర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిని ఆయ‌న పోలీసుల‌కు ఫార్వ‌ర్డ్ చేసిన‌ట్టు తెలిపారు. సునీత చేసిన ప‌ని.. ఎన్నిక‌ల కోడ్‌ను ఉల్లంఘించ‌డ‌మేన‌ని అంటున్నారు. అయితే.. ఈ రెండు కేసుల‌పై బీఆర్ ఎస్ ఖుషీ అవుతోంది.

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎవ‌రిపై నైతే.. ప్ర‌త్య‌ర్థులు టార్గెట్ చేస్తారో.. వారు గెలుస్తున్నార‌ని.. బీఆర్ ఎస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. గ‌తంలో కేసీఆర్‌పైనా కేసులు న‌మోదు చేయించార‌ని.. ఆయన గెలిచార‌ని.. హ‌రీష్‌రావుపైనా ఎన్నిక‌ల‌కుముందు కేసులు పెట్టార‌ని.. ఆయ‌న కూడా విజ‌యం ద‌క్కించుకున్నార‌ని.. ఇప్పుడు సునీత విజ‌యం కూడా ఖాయ‌మ‌ని.. వారు చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News