అదరగొట్టే స్పందన.. లెన్స కార్ట్ ఐపీఓకు.. ఎంత భారీగా అంటే?
ఇందులో భాగంగా రూ.7278 కోట్ల నిధులు సమీకరించాలన్న లక్ష్యంతో పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)కు వచ్చింది. అంచనాలకు తగ్గట్లే.. లెన్స్ కార్ట్ ఐపీవోకు మార్కెట్ లో భారీ స్పందన నెలకొంది.;
కళ్లద్దాల వ్యాపారం భలే విచిత్రంగా ఉంటుంది. నిజానికి లెన్స కార్ట్ (లెన్స్ కార్ట్ సొల్యూషన్స్ లిమిటెడ్)కు ముందు మార్కెట్ లో కళ్లద్దాల వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా ఉండేది. కళ్లద్దాలు కొనుగోలు చేసే వారికి ధరాఘాతం పక్కాగా తగిలేది. అలాంటి వేళలో మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన లెన్స్ కార్ట్.. తక్కువధరలకే నాణ్యమైన కళ్లద్దాల్ని అందించటం షురూచేసింది. దీంతో అనతి కాలంలో తనకంటూ ఒక పేరును సొంతం చేసుకుంది. గడిచిన కొన్నేళ్లుగా తన వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న ఈ సంస్థ తాజాగా భారీ వ్యాపార విస్తరణ ప్లాన్ తో ముందుకు వచ్చింది.
ఇందులో భాగంగా రూ.7278 కోట్ల నిధులు సమీకరించాలన్న లక్ష్యంతో పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)కు వచ్చింది. అంచనాలకు తగ్గట్లే.. లెన్స్ కార్ట్ ఐపీవోకు మార్కెట్ లో భారీ స్పందన నెలకొంది. మంగళవారంతో ముగిసిన పబ్లిక్ ఇష్యూ ఏకంగా 28.26 రెట్ల సబ్ స్క్రిప్షన్ అందుకోవటం మార్కెట్ లో ఈ ఐపీవో హాట్ టాపిక్ గా మారింది. రూ.7278 కోట్ల నిధుల సమీకరణ కోసం 9.97 కోట్ల షేర్లను అమ్మేందుకు ముందుకు రాగా.. 281 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలు కావటం గమనార్హం.
ఐపీవోలో భాగంగా ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.382 - 402గా కంపెనీ నిర్ణయించింది. ఇందులో పెట్టుబడి పెట్టే వారు 37 షేర్లకు బిడ్ చేయొచ్చు. అంటే.. రూ.14,874 పెట్టుబడి అవసరమవుతుంది. అవసరమైతే పలు బిడ్ లు వేసుకునే వెసులుబాటు ఉంది. ప్రస్తుత లెన్స్ కార్ట్ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం (అంటే.. ఇన్వెస్టర్లు ఇష్యూ ధర కంటే ఎంత చెల్లించటానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని తెలియజేసేది) రూ.85 వద్ద ఉండగా.. ఐపీఓ గరిష్ఠ ధర రూ.402. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం చూస్తే.. లెన్స్ కార్ట్ షేర్ అంచనా లిస్టింగ్ ధర రూ.487 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో.. భారీ ఎత్తున ఓవర్ సబ్ స్క్రైబ్ అయ్యింది. అధిక వాల్యూయేషన్ మీద మార్కెట్ వర్గాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ.. పెట్టుబడిదారులు మాత్రం భారీగా మదుపు చేసేందుకు మొగ్గు చూపటం తెలిసిందే.మరి.. అంచనాలకు తగ్గట్లు షేరు రాణిస్తుందా? అన్నది మాత్రమే కాలమే సరైన సమాధానం చెప్పేందుకు వీలుంది.