ఇదేంది లావణ్య? హిట్ అండ్ రన్.. ఆపై దొరికి సారీ చెప్పక పోలీసు కేసు

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లేపల్లి పరిధిలోని మొయిన్ రోడ్డుపై వేగంగా వెళుతున్న కారు టూవీలర్ వ్యక్తిని ఢీ కొట్టి దూసుకెళ్లింది.;

Update: 2026-03-26 07:21 GMT

ఈ దబాయింపు ఏంది లావణ్య? అన్నట్లుగా మారింది. కారణం.. సినీ హీరో రాజ్ తరుణ్ పై తీవ్ర ఆరోపణలు చేయటం ద్వారా కొంతకాలం పాటు వార్తల్లో నిలిచిన లావణ్య గుర్తుంది కదా? ఆమె వ్యవహరించిన తీరు వైరల్ గా మారింది. మద్యం మత్తులో ఆమె చేసిన హడావుడి స్థానికంగా హాట్ టాపిక్ గా మారటమే కాదు.. ఆమె వ్యవహారశైలిని తీవ్రంగా తప్పు పట్టేలా మారింది. సంగారెడ్డి జిల్లాలో మద్యం మత్తులో కారును వేగంగా నడుపుతూ హడావుడి చేసిన ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లేపల్లి పరిధిలోని మొయిన్ రోడ్డుపై వేగంగా వెళుతున్న కారు టూవీలర్ వ్యక్తిని ఢీ కొట్టి దూసుకెళ్లింది. దీంతో.. అక్కడి స్థానికులు స్పందించి కారును ఆపే ప్రయత్నం చేశారు. కానీ.. వాహనం ఆపకపోవటంతో.. వెంబడించి మరీ కారును అడ్డుకున్నారు. దీంతో.. వాహనాన్ని నడుపుతున్నది మహిళ కావటంతో సారీ చెప్పి వెళ్లిపోవాల్సిందిగా గ్రామస్థులు కోరారు.

దీనికి కారు నడుపుతున్న మహిళ నన్నే సారీ చెప్పమంటారా? అంటూ తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ గ్రామస్థులతో వాగ్వావాదానికి దిగింది. ఆమెతో పాటు ఉన్న వ్యక్తి కూడా ఆమెకు వంతపాడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఉదంతంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని కారులో ఉన్న ఇద్దరికి పరీక్ష చేయగా.. ఇద్దరూ మద్యం సేవించినట్లుగా గుర్తించారు. అదే సమయంలో వాదనకు దిగిన యువతిని లావణ్యగా గుర్తించారు. కారులో మద్యం సీసాలు ఉండటంతో పాటు ఇద్దరు మద్యం సేవించినట్లు తేలటంతో వారిపై కేసు నమోదు చేశారు. ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా.. ఏందిది లావణ్య..? మరీ ఇంత దురుసుతనమా? అన్న ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి.



Tags:    

Similar News