లలిత్ మోదీ గారూ... ఐపీఎల్ లోగుట్టు భలే విప్పారు సార్!
క్రికెట్ అంటే కేవలం ఫోర్లు.. సిక్సర్లు.. వికెట్లు మాత్రమే అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే.. ఎందుకంటే ఐపీఎల్ అనేది కేవలం ఒక ఆట కాదు... అదో పక్కా ప్లానింగ్‌తో నడిచే ‘మెగా సీరియల్’ అని తేల్చేశారు దాని సృష్టికర్త లలిత్ మోదీ.
క్రికెట్ అంటే కేవలం ఫోర్లు.. సిక్సర్లు.. వికెట్లు మాత్రమే అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే.. ఎందుకంటే ఐపీఎల్ అనేది కేవలం ఒక ఆట కాదు... అదో పక్కా ప్లానింగ్‌తో నడిచే ‘మెగా సీరియల్’ అని తేల్చేశారు దాని సృష్టికర్త లలిత్ మోదీ. మైదానంలో ఆటగాళ్లు చెమటోడుస్తుంటే మైదానం బయట రేటింగుల కోసం వివాదాలను ఎలా ‘వండేవారో’ ఆయన రీసెంట్‌గా విప్పి చెప్పిన నిజాలు చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.
రేటింగ్స్ పడిపోతున్నాయా? అయితే అర్జెంట్‌గా ఒక వివాదాన్ని పడేయండి!
లలిత్ మోదీ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ చెప్పిన ముచ్చట్లు వింటుంటే... ఐపీఎల్ స్క్రిప్ట్ రైటర్లు సినిమా రైటర్ల కంటే చాలా బిజీగా ఉండేవారనిపిస్తోంది. "ఐపీఎల్ సక్సెస్‌కు కేవలం క్రికెట్ మాత్రమే కారణం కాదు బాస్.. రేటింగ్స్ ఎప్పుడైనా తగ్గుతున్నాయని మా టీమ్‌కు అనిపిస్తే చాలు... వెంటనే బ్యాక్‌స్టేజ్‌లో ఒక వివాదానికి ప్రాణం పోసేవాళ్లం. ఐపీఎల్ బిల్డింగ్‌కు 'కాంట్రవర్సీ' అనేది నంబర్ వన్ పిల్లర్ లాంటిది" అని మోదీ గారు చాలా కూల్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చేశారు.
అంటే మనమేమో అక్కడ మ్యాచ్ చూస్తూ టెన్షన్ పడిపోతుంటే వీళ్లు మాత్రం వెనుక కూర్చుని "ఈ వారం రేటింగ్స్ తక్కువొచ్చాయి... ఎవరినైనా ఒకరిని గెలుకుదాం" అని స్కెచ్‌లు వేసేవారన్నమాట!
ఆ చీర్‌లీడర్ లవ్ స్టోరీ.. అంతా ‘ప్లాన్ ప్రకారం’ జరిగిందే!
ఈ వివాదాల లీకేజీల వెనుక ఉన్న ఒక క్రేజీ ఎగ్జాంపుల్‌ను కూడా మోదీ బయటపెట్టారు. అప్పట్లో ఒక సౌతాఫ్రికా కెప్టెన్, ఒక చీర్‌లీడర్‌తో ప్రేమలో పడ్డాడట. సాధారణంగా ఇలాంటివి గుట్టుగా ఉంచుతారు కానీ, మన ఐపీఎల్ మేనేజ్‌మెంట్ ఊరుకుంటుందా? రేటింగ్స్ పెంచేందుకు.. ఆ లవ్ మ్యాటర్‌ను మీడియాకు లీక్ చేశారట.. టీవీ రేటింగ్స్ ఊహించని రేంజ్‌లో దూసుకెళ్లాయి.. ట్విస్ట్ ఏంటంటే... ఆ తర్వాత ఆ క్రికెటర్ నిజంగానే ఆ చీర్‌లీడర్‌ను పెళ్లి చేసుకున్నాడు. అంటే ఐపీఎల్ కేవలం వినోదాన్ని మాత్రమే కాదు.. పెళ్లిళ్లను కూడా కుదురుస్తుందన్నమాట.. "ఇది క్రికెటా? లేక బిగ్ బాస్ షోనా?" అంటూ నెటిజన్లు ఈ వ్యాఖ్యలు బయటకు రాగానే సోషల్ మీడియాలో మీమ్స్ పండగ మొదలైంది. "మా నమ్మకాన్ని ఇలా క్యాష్ చేసుకుంటారా? ఇదొక స్పోర్ట్స్ టోర్నమెంటా లేక స్క్రిప్టెడ్ బిగ్ బాస్ షోనా?" అంటూ క్రికెట్ ప్రేమికులు తలలు పట్టుకుంటున్నారు.
మొత్తానికి ఐపీఎల్‌లో నో-బాల్స్, వైడ్ బాస్ మాత్రమే కాదు... వివాదాలు కూడా ముందే డిజైన్ చేసినవే అని తెలిసి ఫ్యాన్స్ షాక్‌లో ఉన్నారు. మరి ఈ ‘సంచలన’ లీకులపై ప్రస్తుత ఐపీఎల్ యాజమాన్యం ఏమైనా కౌంటర్ ఇస్తుందో లేదో చూడాలి. ఏదేమైనా లలిత్ మోదీ గారూ... భలే గుట్టు విప్పారు సార్!