జగన్ కి రావాల్సిన కోపం ఆయనకు వచ్చింది ?

అయితే ఇది జరిగిన రెండు మూడు రోజులకు కేవీపీ రామచంద్రరావు రెస్పాండ్ అయ్యారు. అది కూడా ఘాటుగానే. వైఎస్సార్ ని అనవసరంగా నిందిస్తారా అని పవన్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2026-06-07 08:13 GMT

వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ కి కోపం రావాలి. సహజంగా అదే జరగాలి. కానీ ఆయనకు కాకుండా వేరే ఆయనకు కోపం వచ్చింది. అసలు జగన్ కి ఎందుకు కోపం రావాలి ఆయనకు ఎందుకు వచ్చింది ఏమిటి ఇదంతా అంటే అదంతా ఒక రాజకీయ సిత్రం మరి. ఈ నెల 2న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో తన ఇంట్లో ఒక కీలకమైన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన ఇప్పటికి 17 ఏళ్ళ క్రితం మరణించిన వైఎస్సార్ ప్రస్తావన తెచ్చారు. ఆయన మాట మీద ఒక పోలీసు అధికారి తన వద్దకు వచ్చి తాను గానీ తన అన్న గారు చిరంజీవి కానీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందో లేదో ఆరా తీశారు అని చెప్పారు. అంతే కాదు ప్రభుత్వం నుంచి మీకు ఒత్తిళ్ళు ఉంటాయని చెప్పారని కూడా పవన్ చెప్పారు. ఆ తరువాతనే తనకు కొన్ని రాజకీయ ఒత్తిళ్ళు కూడా మొదలయ్యాయని వాటి కారణంగానే తాను రాజకీయాల్లోకి రావడం జరిగిందని చెప్పరు. అంటే వైఎస్సార్ తన మీద కేసులు పెట్టాలని చూశారని అన్నట్లుగా పవన్ చెప్పేశారు అన్న మాట.

వైఎస్సార్ పేరుతో పార్టీ :

మరి ఈ విధంగా దివంగత నేత మీద తన తండ్రి మీద పవన్ చేసిన ఆరోపణలకు స్పందించాల్సింది ఆయన పేరుతో పార్టీ నడుపుతూ ఆయన రాజకీయ వారసత్వాన్ని పుచ్చుకుని ఒకసారి ముఖ్యమంత్రి అయి ఈ రోజుకీ 40 శాతం ఓటు షేర్ తో పార్టీని నడుపుతున్న వైఎస్ జగన్ కదా అని అంతా అంటున్నారు నిజమే వైఎస్సార్ ప్రస్తావన తెచ్చినపుడు జగన్ తప్పకుండా రియాక్ట్ కావాలని ఆయన అభిమానులూ అంటున్నారు. పోనీ జగన్ కాకపోయినా వైసీపీ పార్టీ అయినా రియాక్ట్ కావాలి కదా అన్న వారూ ఉన్నారు. వైసీపీలో అంబటి రాంబాబు లాంటి వైఎస్సార్ వీరాభిమానులు ఎందరో ఉన్నారు. కానీ ఎవరూ పవన్ స్పీచ్ మీద అయితే ఎక్కడా స్పందించలేదు. పైగా తెలంగాణా వాదులు పవన్ ని కౌంటర్ చేస్తే వాటిని వైసీపీ సొంత చానల్ ప్రాజెక్ట్ చేసింది. వాటి మీదనే టీవీ డిబేట్లూ పెట్టారు. మరి ఎందుకు అలా అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు.

కేవీపీ రంగంలోకి :

అయితే ఇది జరిగిన రెండు మూడు రోజులకు కేవీపీ రామచంద్రరావు రెస్పాండ్ అయ్యారు. అది కూడా ఘాటుగానే. వైఎస్సార్ ని అనవసరంగా నిందిస్తారా అని పవన్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ మీద కేసులు పెడతాను అన్న ఆ పోలీసు అధికారి ఎవరో పేరు చెప్పమని కూడా డిమాండ్ చేశారు. ఆయనకు లై డిటెక్టర్ టెస్టు చేయించాలని అన్నారు. ఒకవేళ సదరు పోలీసు అధికారి అలా చెబితే తాను వైఎస్సార్ అభిమానులు పది లక్షలు పోగు చేసి స్వచ్చంద సంస్థలకు విరాళంగా ఇస్తామని కూడా చెప్పారు. వైఎస్సార్ ఆనాడు ఎంతో ప్రజాదరణతో వెలిగిపోతున్నారని ఆయన సీఎం గా ఉన్నపుడు పవన్ రాజకీయాల్లోనే లేరని హీరోగా ఉన్నారని కూడా గుర్తు చేశారు.

నీడగా ఆత్మగా తన కర్తవ్యం :

మరి ఇంతలా కేవీపీ వైఎస్సార్ ని సపోర్ట్ చేస్తూ పవన్ కి ఒక బహిరంగ లేఖ రాసి ఆయన తోడుగా నీడగా ఆత్మగా తన కర్తవ్యం నిర్వహించారు అనుకుంటే మరి ఆయన రాజకీయ వారసులు ఏమైపోయారు అన్న ప్రశ్న జనంలోనూ వైఎస్సార్ అభిమాన జనంలోనూ వస్తోంది. వైఎస్సార్ కుమారుడూ కుమార్తె కూడా రాజకీయాల్లో ఉన్నారని కూడా గుర్తు చేస్తున్నారు మరి పవన్ అన్న మాటలు అయితే తేలిగ్గా తీసేయాల్సినవి కావు. ఒత్తిళ్ళు తెచ్చి కేసులు పెట్టాలనుకున్నారని ఆయన చేసిన తీవ్రమైన ఆరోపణలకు జవాబు ఇచ్చుకునే స్థితిలో వైఎస్సార్ అయితే లేరు, ఆయన దివంగతులు అయ్యారు. మరి ఏమైనా రియాక్ట్ కావాలంటే సొంత కుటుంబీకులే కదా అని అంటున్నారు. ఆ పని కేవీపీ చేశారు అంటే వైఎస్సార్ కి ఆత్మ బంధువు ఎవరో అర్ధమవుతోంది కదా అన్న కామెంట్స్ కూడా వినవస్తున్నాయి.

Tags:    

Similar News