రంగంలోకి కేటీఆర్.. ఫస్ట్ స్టెప్‌లోనే సంచలన నిర్ణయం!
బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌కు.. `సంపూర్ణ బాధ్యతలు` అప్పగిస్తున్నట్టు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించిన 24 గంటల్లోనే కేటీఆర్ రంగంలోకి దిగిపోయారు.;
బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌కు.. `సంపూర్ణ బాధ్యతలు` అప్పగిస్తున్నట్టు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించిన 24 గంటల్లోనే కేటీఆర్ రంగంలోకి దిగిపోయారు. రాష్ట్ర స్థాయి కమిటీని అలానే ఉంచి.. జిల్లా, మండల స్థాయి కమిటీలను వెంటనే రద్దు చేశారు. ఇదేసమయంలో తన విచక్షణ మేరకు కీలక నేతలను ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో తొలి అడుగుగా.. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)పై కేటీఆర్ దృష్టి పెట్టారు. దీనిలో జరిగే అవకతవకలను గుర్తించే బాధ్యతను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌కు అప్పగించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్‌లో చేపట్టిన సర్ ప్రక్రియలో అధికార పార్టీ కాంగ్రెస్, బీజేపీలు చేతులు కలిపే ప్రమాదం ఉందని.. బీఆర్ ఎస్ అనుకూల ఓట్లను తొలగించే అవకాశం ఉందని కేటీఆర్ అంచనా వేశారు. ఈ క్రమంలో నకిలీ ఓట్లు, దొంగ ఓట్లను గుర్తించడం తోపాటు.. బీఆర్ ఎస్ అనుకూల ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించకుండా చూడాలని తలసానికి కేటీఆర్ సూచించారు. దీనికి సంబంధించి పార్టీ తరఫున కార్యకర్తలను నియమించుకుని పర్యవేక్షించే అవకాశం ఆయనకు కల్పించారు. ఏ ఒక్క బీఆర్ ఎస్ సానుకూల ఓటు కూడా పోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
గత ఏడాది జరిగిన.. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో బీఆర్ ఎస్ అనుకూల ఓట్లను తొలగించారని.. అందుకే తాము నష్టపోయామని చెప్పారు. ఈ నేపథ్యంలో గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని సర్ ప్రక్రియను అత్యంత నిశితంగా పరిశీలించాల ని సూచించారు. అదేవిధంగా రాబోయే ఎన్నికలపైనా కేటీఆర్ ముందస్తుగానే సమీక్షలు నిర్వహించారు. ఏయే నియోజకవర్గాల్లో ఏమేరకు సానుకూలత ఉందన్న విషయాన్ని ఆరా తీశారు. ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువె ళ్లాలని ఆయన సూచించారు. ప్రజల మధ్య ఉండే నాయకులే గుర్తింపు ఉంటుందని తేల్చేశారు.
కవిత రాజకీయాలపై...
తన సోదరి కవిత రాజకీయాలు.. ఆమె పెట్టుకున్న టీఆర్ ఎస్ పార్టీపైనా కేటీఆర్ నర్మగర్భంగా మాట్లాడారు. కొత్త పార్టీ అని పిలుస్తూ.. ``కొత్త పార్టీలపై ఎవరూ స్పందించొద్దు. సమయం, సందర్భం చూసుకుని కేసీఆర్ సర్ స్పందిస్తారు. అప్పటి వరకు ఓపికగా ఉండండి. ఎన్ని పార్టీలు వచ్చినా.. కేసీఆర్ నాయకత్వాన్నే ప్రజలు కోరుకుంటున్నారు. ఈ విషయంలో రెచ్చిగొట్టే వ్యాఖ్యల విషయంలో మీరు అప్రమత్తంగా ఉండండి`` అని నాయకులకు తేల్చి చెప్పారు. త్వరలోనే జిల్లాలు, మండలాల వారీగా కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు.