మారీచులు-సుబాహులు: తెలంగాణలో పొలిటికల్ ఫైర్
మునిసిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో అధికార పార్టీ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి;
తెలంగాణ రాజకీయాలు మరోసారి సలసలమరుగుతున్నాయి. మునిసిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో అధికార పార్టీ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం నుంచి వ్యక్తిగత విమర్శల వరకు నాయకులు నోరు చేసుకుంటున్నారు. తాజాగా సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు విషయంపై నిరసన చేపట్టిన బీఆర్ ఎస్.. ఈ క్రమంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. ముఖ్యంగా పార్టీ కీలక నాయకుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డిని `తుగ్లక్ సీఎం` అంటూ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు చేసి గంటలు కూడా గడవకముందే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అంతే స్పీడుగా స్పందించారు. మారీచులు-సుబాహులు.. అంటూ.. బీఆర్ ఎస్ నాయకులపై విమర్శలు గుప్పించారు. తాజాగా మహబూబ్‌నగర్‌లో పర్యటించిన ముఖ్య మంత్రి 1200 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి చెందకుండా అడ్డుకునే మారీచులు-సుబాహులు ఎంత మంది వచ్చినా.. తాను ఆగేది లేదన్నారు. పాలమూరు అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. గత బీఆర్ ఎస్ హయాంలో జిల్లాకు జరిగిన అన్యాయం అంతాఇంతా కాదన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చ పెడితే తప్పించుకున్నారని బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం కమీషనేశ్వరంగా మారిందని.. మూడేళ్లలోనే కుప్పకూలిందని దుయ్యబట్టారు. అందుకే.. బీఆర్ ఎస్ హయాంలో పాలమూరుకే కాకుండా మహబూబ్‌నగర్‌కు కూడా అన్యాయం జరిగిందన్నారు. తాను చేపట్టిన అభివృద్ధి యజ్ఞాన్ని అడ్డుకునేందుకు ఎంత మంది మారుచులు, సుబాహులు వచ్చినా.. తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. దొంగ కన్నీరు కార్చేవారిని తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా.. మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా మరింత వేడి పెరిగే అవకాశం కనిపిస్తోంది.