సీమ పెద్దాయన సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా ?
రాయలసీమలో పెద్దాయనగా ఒకనాడు మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డిని చెప్పుకున్నారు. ఆయన తనయుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా అదే విధంగా పేరు సంపాదించుకున్నారు.;
రాయలసీమలో పెద్దాయనగా ఒకనాడు మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డిని చెప్పుకున్నారు. ఆయన తనయుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా అదే విధంగా పేరు సంపాదించుకున్నారు. మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో కోట్ల వారి వారసుడిగా తన ముద్రను బలంగా కర్నూలు జిల్లాలో వేసుకున్నారు. ఆయన ఎంపీగా పలు మార్లు గెలిచారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు. కర్నూలు జిల్లాలో తన రాజకీయ పట్టుని కూడా బిగించి మరీ తన హవా చాటుకున్నారు. ఇక విభజన అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో కోట్ల వారు కాంగ్రెస్ నుంచి టీడీపీ లోకి వచ్చి చేరారు.
పార్లమెంట్ అనుకుంటే :
కోట్ల ఎపుడూ పార్లమెంట్ వైపే చూస్తూ వచ్చారు ఆయన మొదటి నుంచి కర్నూలు లోక్ సభ సీట్లోనే పోటీ చేసి గెలుపు ఓటములను స్వీకరిస్తూ వస్తున్నారు. 2014 లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు 2019 లో టీడీపీలోకి వచ్చాక కూడా ఆయనకు టీడీపీ ఎంపీ టికెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లోనూ ఆయన ఓటమి పాలు అయ్యారు. అయితే 2024 ఎన్నికల్లో తిరిగి పోటీ చేసి గెలిచి చూపించాలని ఆయన చాలానే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్నారు ఈసారి గెలిస్తే కూటమి పార్టీల పాలన కావడంతో మరోసారి కేంద్ర మంత్రి కావచ్చు అని కూడా భావించారు అని చెప్పుకున్నారు. కానీ ఈసారి ఎంపీ టికెట్ కాకుండా ఆయనకు ఎమ్మెల్యే టికెట్ దక్కింది. దాంతో ఆయన అన్యమనస్కంగానే డోన్ నుంచి పోటీ చేసి గెలిచారు.
మంత్రి ఇస్తారనుకుంటే :
పోనీ రాష్ట్రంలో గెలిచినా సీనియర్ గా మంత్రి పదవి దక్కుతుందని ఆయన అనుకున్నారని కానీ ఆ పదవులు వేరే వారికి కొత్త వారికి దక్కాయని ఆయన అనుచరులు అసంతృప్తి చెందారు దాంతో నాటి నుంచే కోట్ల తన రాజకీయాన్ని పూర్తిగా సొంత నియోజకవర్గానికే పరిమితం చేసుకున్నారు అని అంటున్నారు. అంతే కాదు ఆయన అధినాయకత్వంతో కూడా పెద్దగా టచ్ లోకి వెళ్ళడం లేదని అంటున్నారు. ఆ మధ్య అమరావతిలో జరిగిన పార్టీ కార్యక్రమాల్లో సైతం ఆయన సతీమణి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాత వెళ్లారు తప్పించి ఆయన మాత్రం వెళ్ళలేదని గుర్తు చేస్తున్నారు.
ఇక చాలు అంటూ :
తన రాజకీయ జీవితానికు ఫుల్ స్టాప్ పెట్టేయడానికి పెద్దాయన నిర్ణయించారు అని అంటున్నారు. ఏడు పదుల వయసులో ఉన్న ఆయన తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని అనుచరులకు చెప్పేస్తున్నారు అని అంటున్నారు. తన రాజకీయం ఇక చాలు అని కూడా అంటున్నారుట. వర్తమాన రాజకీయాల్లో తాము ఇమడలేమని కూడా ఆయన చెబుతున్నారని అంటున్నారు. పార్టీ ఒకవేళ గట్టిగా కోరితే తన సతీమణిని ఎమ్మెల్యేగా పోటీకి పెట్టాలని ఆలోచిస్తున్నారుట. మొత్తానికి పెద్దాయన పూర్తిగా నిర్వేదం చెందారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను చూస్తూ వచ్చిన ఆయనకు టీడీపీలో కొంత ఇబ్బందికరంగా ఉందని దానికి తోడు జూనియర్లకు అధికారాలు అవకాశాలు దక్కుతున్న వేళ తన అవసరం పెద్దగా భవిష్యత్తులో సైతం ఉండబోదని ముందే ఊహించిన కోట్ల పెద్దాయన స్వచ్ఛందంగానే తప్పుకుంటే బెటర్ అని డెసిషన్ కి వచ్చారు అని అంటున్నారు. మరి ఆయన నిర్ణయం మీద పార్టీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ఏ విధంగా జిల్లా రాజకీయాల మీద ప్రభావం చూపిస్తుంది అన్నది చూడాల్సి ఉంది.