తెరపైకి కోట వినుత.. శ్రీకాళహస్తిలో ఏం జరుగుతోంది?

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వ్యవహారశైలిపై నియోజకవర్గంలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.;

Update: 2025-10-13 10:59 GMT

కూటమిలో శ్రీకాళహస్తి రాజకీయాలు సంచలనం రేపుతున్నాయి. ఈ నియోజకవర్గానికి చెందిన జనసేస మాజీ ఇన్చార్జి కోట వినుత తాజాగా విడుదల చేసిన వీడియో సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వినుత చైన్నె కోర్టులో బెయిలుపై విడుదలయ్యారు. అయితే బెయిలు షరతుల వల్ల అక్కడే ఉంటున్న వినుత తాజాగా వైరల్ అయిన హతుడు డ్రైవర్ రాయుడు వీడియోతో తనకు అన్యాయం జరిగిందని కన్నీరుపెడుతూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు.

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వ్యవహారశైలిపై నియోజకవర్గంలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జనసేన మాజీ ఇన్చార్జి వినుత దంపతులు జైలుకు వెళ్లడానికి సుధీర్ రెడ్డి కారణమని వారి అభిమానులు ఆరోపిస్తున్నారు. డ్రైవర్ రాయుడిని అనైతిక కార్యక్రమాలకు వాడుకున్న సుధీర్ రెడ్డి పరోక్షంగా అతడి హత్యకు కారణమయ్యారని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాయుడు వీడియో వైరల్ అవడంతో వినుత బయటకు వచ్చారు. జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను కలవాలని కోరుకుంటున్నానని, ఆయన ఒకసారి తనకు సమయం ఇవ్వాలని ఆ వీడియోలో కోరారు. అంతేకాకుండా తన ఆవేదనపై కన్నీటిపర్యంతమయ్యారు.

ప్రజలకు కొన్ని విషయాలు తెలియజేయడానికి మనసు నిండా పుట్టెడు బాధతో ముందుకొచ్చానని వాపోయారు వినుత. చెయ్యని తప్పునకు జైలుకు వెళ్లామని, తనకు బాధగా ఉందని కన్నీటిపర్యంతమయ్యారు. కారు డ్రైవరును తామే చంపామని మీడియాలో ప్రచారం చేయడం కలిచివేసిందని తెలిపారు. అతని చావులో తమ ప్రమేయం లేదని కోర్టు భావించడం వల్లే 19 రోజుల్లో బెయిలు వచ్చిందని తెలిపారు.

విదేశాల్లో లక్షల రూపాయల జీతం వదులుకుని ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చామని, ప్రజల ప్రాణాలు తీయడానికి కాదని ఆమె తెలిపారు. హత్య కేసులో కోర్టు నుంచి క్లీన్ చిట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కోర్టులో విచారణ సాగుతున్నందన ఇంతకంటే ఎక్కువ మాట్లాడదలచుకోలేదని వివరించారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అయింట్మెంట్ కోసం చూస్తున్నామని పూర్తిస్థాయి బెయిలు లభించిన వెంటనే ఆయనను కలుస్తామని తెలిపారు. శ్రీకాళహస్తి రాజకీయాల నుంచి తమను దూరం చేయాలని, క్యారెక్టర్ దెబ్బ తీసే ప్రయత్నాలు జరిగాయని సాక్ష్యాధారాలతో సహా తనపై జరిగిన కుట్ర బయటపెడతానని అన్నారు. మీడియా సమక్షంలో అన్నింటిని ప్రజలకు తెలియజేస్తానని కోట వినుత స్పష్టం చేశారు.

Tags:    

Similar News