కేటీఆర్ పరువు నష్టం దావా : క్రిమినల్ కేసుపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువు నష్టం దావాపై నాంపల్లి కోర్టు ఆదేశాల అనంతరం, తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.;
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువు నష్టం దావాపై నాంపల్లి కోర్టు ఆదేశాల అనంతరం, తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కోర్టు ఆదేశాలపై ఆమె స్పందిస్తూ, "అయితే.. ఏమైతది!" అని ప్రశ్నించడం సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంపై మీడియా చేస్తున్న హడావిడిపై కూడా ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోర్టు తీర్పు తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సురేఖ చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. అయితే, తప్పు ఎవరు చేశారనేది పూర్తిగా తేలాలని, పరోక్షంగా కేటీఆర్‌ను మరోసారి కార్నర్ చేశారు. "ఉన్నదే మాట్లాడానని నేను అంటాను. లేదు, నాపై అభాండాలు వేశారని అవతలి వాళ్లు అంటారు. ఏదైనా ఉంటే చట్టం చూసుకుంటుంది. చట్టం తన పని తాను చేస్తుంది. ఏమైతది?" అని ఆమె అన్నారు.
పోరాటాలు నాకు కొత్తేమీ కాదు
తన రాజకీయ జీవితంలో ఎన్నో కష్టాలు, పోరాటాలు చూశానని, తనకు ఇలాంటివి కొత్త కాదని సురేఖ ధైర్యంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ వరకు తన రాజకీయ ప్రయాణం పోరాటాలతోనే సాగిందని ఆమె గుర్తు చేసుకున్నారు. కేవలం కాగ్నిజెన్స్ తీసుకునేందుకు కోర్టు చెప్పడాన్ని పెద్ద విషయంగా చూపిస్తూ, తనపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
ఒక వర్గం మీడియా తనను కార్నర్ చేయడానికి ప్రయత్నిస్తోందని, వారి ఉత్సాహం చూసి ఆశ్చర్యం వేస్తుందని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. బిగ్ బ్రేకింగులు, షార్ప్ న్యూస్ అంటూ హడావిడి చేసి, చివరికి అవి చప్పని వార్తలుగా మిగిలిపోతాయని ఆమె ఎద్దేవా చేశారు.
ఫోన్ ట్యాపింగ్ ఉదంతంపై కూడా విచారణ జరపాలి
కేటీఆర్ కేసులో తన వాదనను వినిపించే ముందు, అసలు ఈ వివాదానికి కారణమైన ఫోన్ ట్యాపింగ్ ఉదంతంపై కూడా విచారణ జరపాలని సురేఖ పరోక్షంగా డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్టు ఆమె తెలిపారు.
కొండా సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పరువు నష్టం దావా వ్యవహారంపై ఆమె స్పందన, ఎదురుదాడి చేయాలనే ఆమె ధోరణి ఆసక్తికరంగా మారింది. ఈ కేసు తదుపరి ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.