ఈ మ్యాట్రిమోనియల్ యాప్ లో రిజిస్టర్ అవ్వాలంటే మగవాళ్ళు మినిమం 50 లక్షలు సంపాదించాలి!
అవును... భారతీయ వివాహ సంబంధాల రంగంలో కొత్తగా నాట్.డెటింగ్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యాప్ ప్రవేశించింది.;
భారతదేశ వివాహ సంబంధాల రంగంలో మ్యాట్రిమోనియల్ యాప్ లు చాలా కాలంగా భాగంగా ఉన్నాయి. ఇందులో భాగంగా బాగా పాపులర్ అయిన కొన్ని ప్లాట్ ఫామ్ లు చాలా మందికి వారి ఆదర్శ భాగస్వాములను కనుగొనడంలో సహాయపడ్డాయి. ఆ సంగతి అలా ఉంటే... ఇప్పుడు తాజాగా ఆ జాబితాలో మరో పేరు వచ్చి చేరగా.. ఆ యాప్ లో రిజిస్టర్ అయ్యే పురుషులకు ఓ భారీ కండిషన్ ఉంది!
అవును... భారతీయ వివాహ సంబంధాల రంగంలో కొత్తగా నాట్.డెటింగ్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యాప్ ప్రవేశించింది. ఈ యాప్ మిగిలిన వాటికి చాలా భిన్నంగా ఉందనే చెప్పాలి. ఈ అప్లికేషన్ గురించి చర్చించే వీడియోను ఒక న్యాయవాది ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన తర్వాత ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె పోస్ట్ ఆన్ లైన్ లో విస్తృత చర్చకు దారితీసింది.
ఈ సందర్భంగా ఆమె తన వీడియోలో మాట్లాడుతూ... భారతదేశంలో నాట్.డేటింగ్ అనే సరికొత్త ఏఐ మ్యాట్రిమోనియల్ యాప్ ఉందని.. అయితే, ఇది అందరు భారతీయుల కోసం కాదని.. ఇది టాప్ 1 శాతం పురుషుల కోసం మాత్రమే అని.. ఇక్కడే మీరు భారతదేశంలోని టాప్ 1 శాతం పురుషులను కనుగొంటారని ఆమె అన్నారు.
ఇదే సమయంలో... ఈ యాప్ లో రిజిస్టర్ అవ్వడానికి, సంబంధాలను కనుగొనడానికి పురుషులు సంవత్సరానికి కనీసం రూ.50 లక్షలు సంపాదించాలని.. అయితే, మహిళలకు మాత్రం ఎటువంటి షరతులు లేవని ఆమె అన్నారు. అదేవిధంగా... ఈ యాప్ ను ఇద్దరు పురుషులు సృష్టించారని సదరు న్యాయవాది వివరణ ఇచ్చారు!
ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారిన ఈ వీడియోపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా.. కొంతమంది వీక్షకులు ఈ యాప్ అభిప్రాయంతో ఏకీభవించగా, మరికొందరు ఆ ఆలోచన అంత గొప్పది కాదని చెబుతూ అందుకు గల కారణాలు, వారి వారి అనుభవాలు పంచుకుంటున్నారు.
ఈ సందర్భంగా... సామాజిక, ఆర్థిక, మేధో సమానత్వం ఉన్న వ్యక్తిని వివాహం చేసుకోవడం ఎల్లప్పుడూ తెలివైన పనే అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించగా.. విద్య, డబ్బు.. మర్యాద, బహిరంగ మనస్తత్వానికి సంబంధించిన హామీ ఇవ్వవని.. దీన్ని తాను ఇటీవలే నేర్చుకున్నానని మరో వినియోగదారుడు స్పందించారు.
ఇదే సమయంలో... పురుషుల మాదిరిగానే ఈ యాప్ లో సైన్ అప్ చేయడానికి మహిళలకు కూడా జీతం ప్రమాణం ఉండాలని మరొకరు రాశారు.