కేరళలో ‘కోర్’ సంస్థ ప్రీపోల్ సర్వే.. ఫలితాలివే

మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా కేరళ ఓటర్లు ఒక సంప్రదాయాన్ని పాటిస్తారని చెబుతారు. ఒకసారి ఒక పార్టీకి అధికారం కట్టబెడితే.. ఆ తర్వాతి ఎన్నికల్లో విపక్షానికి అధికారాన్ని కట్టబెట్టటం రివాజు.;

Update: 2026-04-02 13:30 GMT

మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా కేరళ ఓటర్లు ఒక సంప్రదాయాన్ని పాటిస్తారని చెబుతారు. ఒకసారి ఒక పార్టీకి అధికారం కట్టబెడితే.. ఆ తర్వాతి ఎన్నికల్లో విపక్షానికి అధికారాన్ని కట్టబెట్టటం రివాజు. అందుకు భిన్నంగా ఐదేళ్ల క్రితం (2021)లో జరిగిన ఎన్నికల్లో పినరయి విజయన్ ప్రభుత్వానికి రెండోసారి అధికారాన్ని కట్టబెడుతూ కేరళ ఓటర్లు వినూత్న తీర్పును ఇచ్చారు. తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కేరళ ఒకటి. రెండుసార్లు వరుసగా అధికారాన్ని చేపట్టిన కమ్యూనిస్టు ప్రభుత్వం.. ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొడుతుందన్న ధీమాను వ్యక్తం చేస్తుంటే.. ఈసారి ఎన్నికల్లో విజయం మాదేనంటూ కాంగ్రెస్ కూటమి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ రెండు కూటములతో పాటు ఎన్డీయే కూడా బరిలో నిలిచి.. ఈసారి ఎన్నికల్లో తమ ఉనికి చాటుతామని.. వచ్చే ఎన్నికల్లో అధికారానికి ఈ ఎన్నికలు నాంది పలుకుతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

ఇలా.. అధికార కమ్యూనిస్టులకు చెందిన ఎల్డీఎఫ్.. కాంగ్రెస్ కు యూడీఎఫ్.. బీజేపీకి చెందిన ఎన్డీయే కూటములు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఎవరికి వారు తమ మేనిఫెస్టోలను విడుదల చేసి ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఇలాంటి వేళ.. ఎన్నికల్లో ఏ కూటమికి అధికారం దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి వేళ.. కోర్ అనే సంస్థ ప్రీపోల్ సర్వేను నిర్వహించింది. కోర్ అంటే..సిటిజన్స్ ఓపినియన్ రీసెర్చ్ అండ్ ఇవాల్యుయేషన్ సంస్థ మార్చి 23 నుంచి 30 మధ్యలో రాష్ట్రంలోని 140 నియోజకవర్గాల్లో 31,706 మంది ఓటర్ల నుంచి అభిప్రాయాల్ని సేకరించింది. కేరళలోని వేర్వేరు ప్రాంతాల్లోని ఓటర్లతో శాంపిల్ సర్వే నిర్వహించారు.

ఈ సర్వేలో అధికార కూటమి ఎల్డీఎఫ్ కు మిశ్రమ స్పందన లభించగా..యూడీఎఫ్ కు ప్రజలు కొంతమేర సానుకూల స్పందన ప్రదర్శించినట్లుగా పేర్కొన్నారు. ఎన్డీయే విషయానికి వస్తే తీవ్ర ప్రతికూలత ఎదుర్కొంటున్నట్లుగా వెల్లడైంది. ఎల్డీఎఫ్ విషయానికి వస్తే సుమారు 43.1 శాతం మంది ప్రభుత్వ పని తీరుకు సానుకూల రేటింగ్ ఇవ్వగా.. అందులో 17.16 శాతం మంది చాలా బాగుందని.. 25.94 శాతం మంది బాగుందని చెప్పగా.. గణనీయమైన సంఖ్యలో వ్యతిరేకత కూడా ఎదుర్కొంటున్నట్లు వెల్లడైంది. ఇలా ప్రభుత్వ వ్యతిరేకతను కుండ బద్ధలు కొట్టిన వారు 25.74 శాతంగా చెబుతన్నారు. మొత్తంగా 31 శాతం మంది సానుకూలంగా స్పందించారు.

అదే సమయంలో యూడీఎఫ్ విషయానికి వస్తే 42.07 శాతం మంది ఓటర్లలో 28.72 శాతం మంది బాగుంది.. చాలా బాగుందని చెప్పగా.. 29.22 శాతంమంది బాగోలేదు.. అస్సలు బాగోలేదన్న విషయాన్ని వెల్లడించినట్లుగా పేర్కొన్నారు. ఎన్డీయూ కూటమి విషయంలో తమఅభిప్రాయం చెప్పిన వారిలో 60 శాతం మంది కంటే ఎక్కువగా ప్రతికూలంగా స్పందించటం గమనార్హం. ప్రాంతాల వారీగా చూస్తే ఉత్తర కేరళలో ఎల్డీఎఫ్ బలంగా ఉంటే.. మధ్య కేరళలో యూడీఎఫ్ బలంగా ఉంది. దక్షిణ కేరళలో మాత్రం భిన్నమైన అభిప్రాయాలు రావటంతో ఏ కూటమికి స్పష్టమైన అధిక్యత కనిపించని పరిస్థితి. ఇదంతా చూస్తే.. ఎన్నికల్లో తీవ్రమైన పోటీ నెలకొందని.. అధికార ఎల్డీఎఫ్.. విపక్ష యూడీఎఫ్ మధ్యనే పోరు నడుస్తున్న విషయం స్పష్టమైనట్లుగా చెప్పాలి.

Tags:    

Similar News