పరీక్షల కోసం వచ్చి 9 గంటలు ఆసుపత్రిలో.. ఏమైంది కేసీఆర్ సారూ?
ఈ మధ్య ఆరోగ్య సమస్యల కారణంగా హైదరాబాద్ సోమాజీగూడ యశోదా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. అక్కడే ఉండటం తెలిసిందే.;
ఆయనేం సాదాసీదా వ్యక్తి కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన అధినేత. ఎన్నికల్లో ఓటమి చెందినా.. ఇప్పటికి ఆయన మాటకు తెలంగాణలో ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నికల్లో ఓటమి తర్వాత నుంచి దూరంగా ఉంటున్న ఆయన.. చాలా అరుదుగా మాత్రమే మాట్లాడిన పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే పనిగా సవాలు విసిరినా.. ఆయన మాత్రం స్పందిస్తున్నదే లేదు.
ఈ మధ్య ఆరోగ్య సమస్యల కారణంగా హైదరాబాద్ సోమాజీగూడ యశోదా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. అక్కడే ఉండటం తెలిసిందే. సోడియం నిల్వలు తగ్గినట్లుగా వెల్లడించారు. అంతకు మించిన వివరాల్ని వెల్లడించలేదు. ఫామ్ హౌస్ ఉంటున్న కేసీఆర్.. ఆరోగ్య సమస్యల కారణంగా నందినగర్ లోని తన సొంతింట్లో ఉంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. గురువారం మరోసారి ఆయన ఆసుపత్రికి వెళ్లారు. అది కూడా వైద్య పరీక్షల కోసం.
సాధారణంగా వైద్య పరీక్షలంటే కాస్తంత సమయం తీసుకుంటుంది.అది సాదాసీదా జనాలకు. కానీ.. కేసీఆర్ లాంటి పెద్దమనిషి పరీక్షల కోసం ప్రైవేటు ఆసుపత్రికి వెళుతున్నప్పుడు సంబంధిత వైద్యులు.. టెక్నిషియన్లు అందరూ అందుబాటులో ఉండటమే కాదు.. యుద్ద ప్రాతిపదికన అన్నట్లుగా పరీక్షలు జరుపుతారనటంలో ఎలాంటి సందేహం లేదు.కానీ.. పరీక్షల కోసం ఆసుపత్రి వెళ్లినట్లుగా సమాచారం బయటకు వచ్చిన నేపథ్యంలో.. అందుకు తొమ్మిది గంటల సమయం తీసుకోవటం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
గురువారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో యశోదా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. పరీక్షలన్ని ముగించుకొని సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్లిపోయారు. అంటే.. మొత్తం తొమ్మిది గంటలు. వైద్య పరీక్షల కోసం ఇంత సమయం పడుతుందా? అన్నది ప్రశ్న. వైద్య పరీక్షలు అంటే.. కేసీఆర్ కు ఎలాంటి పరీక్షలు చేయించుకున్నారు? ఆయన తాజా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? లాంటి ప్రశ్నలు తలెత్తుతున్నయి, ఇటీవల కాలంలో ఆయనకు ఆరోగ్య సమస్యలు ఎక్కువైనట్లుగా కొందరు చెబుతున్న మాటల్లో నిజం ఎంత? అన్నది మరో ప్రశ్న. ఇలాంటి సందేహాలకు ఎవరో సమాధానం ఇచ్చే బదులు.. మీడియా ముందుకు వచ్చి.. వివరాలు తెలిపితే అనవసరమైన కన్ఫ్యూజన్ ఉండదు కదా? అన్నది ప్రశ్నగా మారింది. కోట్లాది మంది ఆరాధించే అధినాయకుడి ఆరోగ్యంపై క్లారిటీ ఇవ్వటం అవసరమే కదా.