కవిత చెల్లెమ్మకు చెక్ పెట్టాల్సిందేనా ?
ఇలా కళ్ళ ముందు ఏపీలో చెల్లెమ్మ షర్మిల ఎపిసోడ్ ఉండగానే తెలంగాణాలో మరో చెల్లెమ్మ ఆగ్రహించింది.
రెండు తెలుగు రాష్ట్రాలలో చెల్లెమ్మలు కొంగు బిగించి అన్నయ్యలనే సవాల్ చేస్తున్నారు. అప్పట్లో అన్నదమ్ముల సవాల్ అని ఒక సినిమా వచ్చింది. కానీ ఇపుడు చూస్తే కనుక అన్నా చెల్లెళ్ళ సవాల్ అని కొత్తగా తీయాల్సి ఉంటుందేమో. ఏపీలో వైసీపీ అధినేత జగన్ ఓటమికి కూటమి కారణం అయినా ఆయనకు కనీసం విపక్ష స్థానం కూడా దక్కలేకపోవడానికి మాత్రం కారణం చెల్లెమ్మ షర్మిల అన్నది అందరికీ తెలిసిందే. వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ గా ఉన్న రాయలసీమలో సైతం ఆ పార్టీకి ఏడంటే ఏడు సీట్లు దక్కాయీ అంటే షర్మిల కొంగు పట్టి పులివెందులలో జనాన్ని వేడుకున్న విన్నపాలు ఫలించాయని కూడా విశ్లేషిస్తారు.
బీఆర్ఎస్ కి కవిత గుబులు :
ఇలా కళ్ళ ముందు ఏపీలో చెల్లెమ్మ షర్మిల ఎపిసోడ్ ఉండగానే తెలంగాణాలో మరో చెల్లెమ్మ ఆగ్రహించింది. కల్వకుంట్ల వారి ఇంటి ఆడపడుచు కవిత సొంత పార్టీ నుంచి సొంత వారి నుంచి వేరుపడింది. తనకంటూ ప్రత్యేక అస్థిత్వం కోసం ఆమె ఏకంగా ఒక పార్టీనే స్థాపించారు. అంతవరకూ ఓకే అనుకున్నా ఆ పార్టీ పేరు చూసిన దగ్గర నుంచే బీఆర్ఎస్ గుండెలలో గుబులు రేగుతోంది అని అంటున్నారు. తెలంగాణా రక్షణ సేన పేరుత కవిత ఎన్నికల సంఘం ముందు రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే దానిని అలా ఫుల్ ఫాం లో ఆమె పిలవడం లేదు. షాట్ కట్ చేసి టీఆర్ఎస్ అని పిలుస్తున్నారు. టీఆర్ఎస్ అంటే జనాల్లో ఒక బ్రాండ్. అది ఒక ఉద్యమ పార్టీ. తెలంగాణా అంతరాత్మగా నిలిచిన పేరు. దాని వల్లనే ఎన్నో విజయాలను కేసీఆర్ అందుకున్నారు. ఎపుడైతే బీఆర్ఎస్ గా మార్చి 2023 ఎన్నికలకు వెళ్లారో నాటి నుంచే వరస పరాజయాలు దక్కాయి. దాంతో తమ పార్టీ పేరుని టీఆర్ఎస్ గా మళ్లీ మారుద్దామని అనుకుంటూండగానే కవిత టీఆర్ఎస్ పేరుతో ముందుకు వచ్చింది. దీంతో గులాబీ నేతలలో కలవరం రేగుతోంది అని అంటున్నారు.
ఎన్నికల సంఘం ముందుకు :
ఈ క్రమంలో కవిత పెట్టిన కొత్త పార్టీతో తమకు లేని పోని ఇబ్బందులు వస్తాయని ముందే గ్రహించిన బీఆర్ఎస్ ఇపుడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తోంది. కవిత టీఆర్ఎస్ మీద తమకు ఉన్న అభ్యంతరాలను తెలియచేస్తూ తాజాగా లేఖను అందచేయడం విశేషం. తమకు ఆ పార్టీ పేరు మీద అభ్యంతరాలు ఉన్నాయని స్పష్టంగా బీఆర్ఎస్ ఈసీకి చెప్పేసింది. అయితే ఏప్రిల్ లో కవిత పార్టీకి పేరుని ఖరారు చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. కానీ రెండు నెలల తరువాత బీఆర్ఎస్ ఇపుడు స్పందించడం విశేషం అని అంటున్నారు.
టీఆర్ఎస్ గానే వెళ్తే :
కవిత తన పార్టీని టీఆర్ఎస్ గా జనంలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఆ పేరుతో వెళ్తే కచ్చితంగా తనకు సానుకూల ఫలితాలు వస్తాయని ఆమె నమ్ముతున్నారు. పైగా ఆమె కేసీఅర్ కుమార్తె. టీఆర్ఎస్ లో చురుకుగా వ్యవహరించిన నాయకురాలు. ఇవన్నీ ఆమెకు అడ్వాంటేజ్ గా మారుతాయని అంటున్నారు. ఇక టీఆర్ఎస్ అంటే గెలుపు సెంటిమెంట్ ఉండనే ఉంది. ఇదే ఇపుడు కవితకు బీఆర్ఎస్ నేతలకు మధ్య సరికొత్త లడాయికి కారణంగా కనిపిస్తోంది అని అంటున్నారు.
అంతా గందరగోళమేనా :
రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. ఇక ఓటర్ల విషయం తీసుకున్నా కూడా వారు పేరు దగ్గర గుర్తు దగ్గర గందరగోళంలో పడిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఎన్టీఆర్ తెలుగుదేశం పేరుతో పార్టీని ఏర్పాటు చేసి లక్ష్మీ పార్వతి ఎన్నికలకు వెళ్తే 1996లో ఆ పార్టీకి గణనీయంగా ఓట్లు వచ్చాయి. ఫలితంగా టీడీపీకి దక్కాల్సిన ఎంపీ సీట్లు బాగా కుదించుకు పోయాయి. ఇలా గుర్తులు వేరు అయినా పార్టీ పేర్లలో పోలిక వల్లనే ఈ గందరగోళం జరిగింది అన్న విశ్లేషణలు ఉన్నాయి. అందుకే బీఆర్ఎస్ జాగ్రత్త పడుతోంది. బీఆర్ ఎస్ పాతికేళ్ళ వయసు ఉన్న పార్టీ పెద్ద పార్టీ. అందువల్ల ఆ పార్టీ అభ్యంతరాలను ఈసీ సీరియస్ గానే పరిశీలిస్తుంది అని అంటున్నారు. దాంతో కవిత పార్టీ పేరుని ఈసీ మార్చుకోవాలని కోరుతుందా లేక ఏమి చేస్తుంది అన్నదే ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది. ఏది ఏమీనా కవిత చెల్లెమ్మకు ఆదిలోనే చెక్ పెట్టాలని బీఅర్ఎస్ భావిస్తోంది అంటే ఆలోచించాల్సిన విషయమే అని అంటున్నారు.