పార్టీ పెట్టుడంటే పాన్ డబ్బా పెట్టినట్టు కాదు.. కేసీఆర్ వ్యాఖ్యలకు కవిత కౌంటర్

గతంలో ఒక సందర్భంలో కేసీఆర్ మాట్లాడుతూ రాజకీయ పార్టీని స్థాపించి నడపడం అనేది సామాన్యమైన విషయం కాదని కుండబద్దలు కొట్టారు.;

Update: 2026-05-03 04:59 GMT

తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా సరికొత్త చర్చకు తెరలేచింది. అయితే ఈ ప్రకటన వెలువడిన క్షణం నుండే ఆమె తండ్రి కేసీఆర్ గతంలో రాజకీయ పార్టీల ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక 'హాట్ టాపిక్'గా మారింది.

కేసీఆర్ పాత వ్యాఖ్యలు.. ప్రస్తుత సవాళ్లు

గతంలో ఒక సందర్భంలో కేసీఆర్ మాట్లాడుతూ రాజకీయ పార్టీని స్థాపించి నడపడం అనేది సామాన్యమైన విషయం కాదని కుండబద్దలు కొట్టారు. “పార్టీ పెట్టడం అంటే పాన్ డబ్బా పెట్టినంత ఈజీ కాదు. వ్యక్తులు స్వార్థం కోసం పార్టీలు పెడితే అవి నిలవవు. ప్రజల్లో నుంచి, ప్రజా సమస్యల నుంచి పుట్టిన పార్టీలే బలంగా నిలబడతాయి” అని ఆయన వ్యాఖ్యానించారు.

నాడు ఆయన ఉదాహరణలు ఇస్తూ నందమూరి తారక రామారావు వంటి ప్రజాదరణ కలిగిన నాయకుడు పార్టీ పెట్టినప్పుడు ప్రజల్లో ఉన్న విశ్వసనీయత వల్ల అది సాధ్యమైందని, కానీ చిరంజీవి వంటి స్టార్ ఇమేజ్ ఉన్న వ్యక్తులు కూడా పార్టీ నడపలేక విఫలమయ్యారని గుర్తు చేశారు. ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెడుతున్న తరుణంలో సొంత తండ్రి చేసిన ఈ వ్యాఖ్యలే ఆమెకు అస్త్రాలుగా మారుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

కవిత దీటైన సమాధానం.. “మహిళల పట్ల వివక్ష ఎందుకు?”

మీడియా ప్రతినిధులు కేసీఆర్ పాత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కవితను ప్రశ్నించగా, ఆమె అత్యంత చాకచక్యంగా..భావోద్వేగంతో సమాధానమిచ్చారు. రాజకీయాల్లో లింగ వివక్షను ఆమె ప్రధానంగా ఎత్తిచూపారు. “నేను కూతురు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నారు. అదే నా స్థానంలో ఒక కొడుకు ఉంటే ఇదే ప్రశ్న అడిగేవారా? మహిళలు పార్టీ పెట్టి నడపలేరనే అపోహ ఎందుకు?” అని ఆమె సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె భారత రాజకీయాల్లో ముద్రవేసిన మహిళా నేతలను గుర్తుచేశారు. బెంగాల్‌లో మమతా బెనర్జీ ఒంటిచేత్తో కోటను నిర్మించిన వైనం.. జయలలిత తమిళనాడు రాజకీయాలను శాసించిన ధీరత్వం. ఇందిరా గాంధీ దేశాన్నే నడిపించిన ఉక్కు మహిళా నాయకత్వం.. వీరిని ఉదాహరణగా చూపుతూ మహిళలు కూడా శక్తివంతమైన పాలనను అందించగలరని కవిత స్పష్టం చేశారు.

పార్టీ అజెండా.. విద్య, వైద్యంపై ఫోకస్

తన పార్టీ కేవలం అధికారం కోసమే కాదని, ప్రజల కనీస అవసరాలను తీర్చడమే లక్ష్యమని కవిత ప్రకటించారు. ప్రతి బిడ్డకు నాణ్యమైన చదువును ఉచితంగా అందించడం. పేదవాడికి కార్పొరేట్ స్థాయి వైద్యం భారం కాకుండా చూడటం... ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని, వారి ఆదరణతోనే పార్టీని బలోపేతం చేస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

కవిత తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసేలా కనిపిస్తోంది. ఒకవైపు బీఆర్ఎస్ ఉనికి, మరోవైపు కవిత కొత్త అడుగు.. ఈ రెండూ ఆ కుటుంబంలోని రాజకీయ భేదాభిప్రాయాలను సూచిస్తున్నాయా లేక ఇది ఒక వ్యూహాత్మక అడుగా అనే కోణంలో విశ్లేషణలు సాగుతున్నాయి. తండ్రి చెప్పిన "విశ్వసనీయత" అనే పరీక్షలో కవిత నెగ్గుతారా? ప్రజలు ఆమెను ఒక స్వతంత్ర నాయకురాలిగా గుర్తిస్తారా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. తెలంగాణ గడ్డపై మరో రాజకీయ యుద్ధం మొదలైందన్నది మాత్రం స్పష్టమవుతోంది.

Tags:    

Similar News