ఐదేళ్లూ నేనే సీఎం: క‌ర్ణాట‌క‌లో కొత్త కుంప‌టి!

అయితే.. ఇంత‌గా సీఎం పోస్టు కోసం కీల‌క నేత డీకే ప‌ట్టుబ‌డుతున్నా.. పార్టీ అధిష్టానం మాత్రం.. ఆయ‌న‌వైపు మొగ్గు చూపు తున్న సంకేతాలు క‌నిపించ‌డం లేదు.;

Update: 2025-10-02 04:17 GMT

క‌ర్ణాట‌క‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో కొన్నాళ్లుగా ముఖ్య‌మంత్రి పీఠంపై కుమ్ములాట‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంలో ఇప్పుడు మ‌రో కీల‌క మ‌లుపు చోటు చేసుకుంది. గ‌త 2023లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌యం ద‌క్కించుకుంది. ఊహించిన దానికంటే కూడా భారీ సంఖ్య‌లో సీట్ల‌ను సొంతం చేసుకుని.. బీజేపీని మ‌ట్టి క‌రిపించింది. అయితే.. ఆ వెంట‌నే సుదీర్ఘంగా సాగిన ముఖ్య‌మంత్రి పీఠం ర‌చ్చ అనేక మ‌లుపులు తిరిగింది. కాలికి బ‌లపం క‌ట్టుకుని ప్ర‌జల మ‌ధ్య తిరిగిన త‌న‌కే .. సీఎం సీటు కావాల‌ని.. ప్ర‌స్తుత డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ మెలిక పెట్టారు.

కానీ, సామాజిక వ‌ర్గ స‌మీక‌ర‌ణ‌లు, అనుభ‌వం.. వంటివాటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. సిద్ద‌రామ‌య్య నే ముఖ్య‌మంత్రిగా ప్ర‌క‌టించింది. అయితే.. ఈ క్ర‌మంలో `ఓ ఒప్పందం` జ‌రిగింద‌న్న‌ది డీకే శివ‌కుమార్ చెబుతున్న మాట‌. అయితే.. అదేంటో ఆయ‌న చెప్ప‌డం లేదు. ఆయ‌న స‌న్నిహిత‌ అనుచ‌రులు కూడా చెప్ప‌డంలేదు. కానీ, త‌ర‌చుగా మాత్రం సీఎం సీటు వ్య‌వ‌హారంపై హాట్ కామెంట్లుకుమ్మ‌రిస్తున్నారు. త‌నే సీఎం అవుతాన‌ని.. కొన్నాళ్లు చెప్పిన డీకే.. త‌ర్వాత అధిష్టానం నిర్ణ‌యం త‌న‌కు అనుకూలంగా ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఒకానొక సంద‌ర్భంలో ఆయ‌న బీజేపీకి అనుకూలంగా ఆర్ ఎస్ ఎస్ గీతాల‌ను కూడా ఆల‌పించి.. సిద్దూ గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టించారు.

అయితే.. ఇంత‌గా సీఎం పోస్టు కోసం కీల‌క నేత డీకే ప‌ట్టుబ‌డుతున్నా.. పార్టీ అధిష్టానం మాత్రం.. ఆయ‌న‌వైపు మొగ్గు చూపు తున్న సంకేతాలు క‌నిపించ‌డం లేదు. దీనికి కార‌ణంగా.. డీకేపై సీబీఐ, ఈడీ కేసులు పెండింగులో ఉన్నాయి. అలాగ‌ని ఆయ‌న ను వ‌దులుకునే ప‌రిస్థితి కూడా పార్టీకి లేదు. మ‌రోసారి అధికారంలోకి రావాల‌న్నా.. పార్టీని నియంత్రించి.. స‌రైన మార్గంలో న‌డిపించాల‌న్నా.. డీకేను మించిన నాయ‌కుడు మ‌రొక‌రు కాంగ్రెస్‌కు క‌నిపించ‌డం లేదు. సామాజిక వ‌ర్గం ప‌రంగా.. సిద్ద‌రామ య్య బ‌లంగా ఉంటే.. రాజ‌కీయంగా.. పార్టీప‌రంగా, ఆర్థికంగా కూడా.. డీకే శివ‌కుమార్ బ‌లంగా క‌నిపిస్తున్నారు. దీంతో ఈ వివాదాన్ని కాంగ్రెస్ నాన్చుతూనే ఉంది.

తాజాగా ఏం జ‌రిగింది?

తాజాగా సీఎం సిద్ద‌రామ‌య్య మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. దీనికి డీకే కూడా వ‌చ్చారు. అయితే.. మ‌ధ్యలో సీఎం సీటు విష‌యంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు సిద్ద‌రామ‌య్య‌. తానే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటాన‌ని చెప్పారు. అంతేకాదు.. వ‌చ్చే ఏడాది కూడా మైసూరులో ద‌స‌రా ఉత్స‌వాల‌ను తానే ప్రారంభిస్తాన‌న్నారు. అంటే.. వ‌చ్చే ఏడాదికి కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ఏర్ప‌డి మూడేళ్లు అవుతుంది. డీకే వ‌ర్గీయులు చెబుతున్న దాని ప్ర‌కారం.. రెండున్న‌రేళ్లు సిద్ద‌రామ‌య్య‌, రెండున్న‌రేళ్లు డీకేలు సీఎం పీఠాన్ని పంచుకోవాల్సి ఉంటుంది. కానీ, తాజాగా సిద్ద‌రామ‌య్య మాత్రం.. తానే ఐదేళ్ల పాటు ముఖ్య‌మంత్రిగా ఉంటాన‌ని తేల్చి చెబుతున్నారు. దీంతో రాజ‌కీయాలు యూట‌ర్న్ తీసుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News