రష్యాలో వరుసగా భూకంపాలు.. ప్రపంచానికి హెచ్చరికలు

రష్యాలోని తూర్పు తీరప్రాంతం మరోసారి ప్రకృతి ఆగ్రహం ఎదుర్కొంది. కామ్చాట్కా ద్వీపకల్పంలో శనివారం తెల్లవారుజామున 7.7 తీవ్రతతో భూమి వణికింది.;

Update: 2025-09-13 09:20 GMT

రష్యాలోని తూర్పు తీరప్రాంతం మరోసారి ప్రకృతి ఆగ్రహం ఎదుర్కొంది. కామ్చాట్కా ద్వీపకల్పంలో శనివారం తెల్లవారుజామున 7.7 తీవ్రతతో భూమి వణికింది. భవనాలు కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురై రోడ్లపైకి పరుగులు తీశారు. సామాజిక మాధ్యమాల్లో భవనాల ఊగిసలాట దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అదృష్టవశాత్తూ ఇప్పటివరకు ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. కానీ ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురి చేస్తోంది.

* వరుస ప్రకంపనలు.. ఆందోళనకర సంకేతం

గత జులైలోనే ఇదే ప్రాంతం 8.8 తీవ్రతతో వణికింది. కేవలం కొన్ని నెలల వ్యవధిలో మళ్లీ ఇంతటి పెద్ద భూకంపం సంభవించడం, ఈ ప్రాంత భూగర్భ చలనం ఎంత భీకరంగా ఉందో తెలియజేస్తోంది. కామ్చాట్కా ద్వీపకల్పం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో భాగమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టెక్టానిక్ ప్లేట్లు ఒకదానికొకటి ఢీకొనే ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు సహజమే. అయినప్పటికీ, తరచూ పెరుగుతున్న ప్రకంపనలు భవిష్యత్తులో మరింత పెద్ద విపత్తులకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

* సహజ విపత్తు.. శాస్త్రీయ సన్నద్ధతే మార్గం

భూకంపం వచ్చిన వెంటనే ప్రాణాలు రక్షించుకున్నారా అనే ప్రశ్నకే మనం పరిమితం అవుతున్నాం. కానీ అసలు దృష్టి ఉండాల్సింది. తర్వాతి విపత్తులో ఎలా రక్షించుకోవాలి? అనే అంశంపైనే.. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు బలంగా ఉండాలి. భవనాల నిర్మాణంలో భూకంప నిరోధక ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలి. ప్రజల్లో విపత్తు అవగాహన, శిక్షణ అవసరం. విపత్తు నిర్వహణ వ్యవస్థలు అత్యాధునికంగా ఉండాలి.

* రష్యాకు మాత్రమే కాదు.. ప్రపంచానికి పాఠం

కామ్చాట్కా భూకంపం రష్యా సరిహద్దుల్లోనే ఆగిపోదు. ఇది ప్రపంచానికి ఒక హెచ్చరిక. ప్రకృతి ఎంత శక్తివంతమో, మనిషి ఎంత బలహీనమో ఇది మళ్లీ గుర్తు చేసింది. వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలతో సహజ విపత్తుల సంఖ్య పెరుగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి సందర్భంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి నష్టాన్ని తగ్గించుకోవడమే మన చేతిలో ఉన్న ఏకైక మార్గం.

* ప్రకృతి హెచ్చరిక.. వినక తప్పదు

కామ్చాట్కా ప్రకంపనలు ఒక స్పష్టమైన సందేశం ఇస్తున్నాయి. ప్రకృతి ఇచ్చే హెచ్చరికను మనం నిర్లక్ష్యం చేస్తే విపత్తు తప్పదని... దేశాలు, ప్రభుత్వాలు, ప్రజలు అందరూ దీనిని గంభీరంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే రేపటి భూకంపం, తుఫాను లేదా సునామీ ఎక్కడ దాడి చేస్తుందో ఎవరూ ఊహించలేరు.

Tags:    

Similar News