30 దేశాలకు ముచ్చెమటలు... సునామీకి ముందు బీచ్ లో పక్షుల వీడియో వైరల్!
రష్యాలోని కమ్చట్కాలో 8.8 తీవ్రతతో సంభవించిన భూకంపం.. పసిఫిక్ మహాసముద్రంలో సునామీ అలలను సృష్టించిన సంగతి తెలిసిందే.;
రష్యాలోని కమ్చట్కాలో 8.8 తీవ్రతతో సంభవించిన భూకంపం.. పసిఫిక్ మహాసముద్రంలో సునామీ అలలను సృష్టించిన సంగతి తెలిసిందే. ఇవి రష్యా, జపాన్, అమెరికా తో పాటు సుమారు 30 దేశాలకు పెనుముప్పుగా మారాయని అంటున్నారు. దీని తీవ్రత భూకంపం తర్వాత 35 నిమిషాల నుండి 15 గంటల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఈ సమయంలో షాకింగ్ అప్ డేట్స్ తెరపైకి వస్తున్నాయి.
అవును... పసిఫిక్ మహాసముద్రం అంతటా సునామీ తరంగాలు వేర్వేరు వేగంతో ప్రయాణిస్తున్నాయి. వీటి వేగం ఆ ప్రాంతంలో సముద్రపు లోతును బట్టి ఉంటుందని చెబుతున్నారు. ఈ సమయంలో కొన్ని అలలు 35 నిమిషాలకే తీరాన్ని చేరుకోగా.. మరికొన్నింటికి 15 గంటల వరకూ సమయం పట్టొచ్చని అంటున్నారు. ఈ క్రమంలో సునామీ టెన్షన్ రేపటి (జూలై 31) మధ్యాహ్నం వరకు కొనసాగొచ్చని అంటున్నారు.
హోక్కైడో కోస్ట్ లైన్ ను తాకిన సునామీ!:
2011 మార్చి 11న మధ్యాహ్నం 2:45 గంటల ప్రాంతంలో జపాన్ లో సముద్రంలో భూకంపం కారణంగా భారీ సునామీ సంభవించిన సంగతి తెలిసిందే. నాడు దీని ప్రభావంతో ఫుకిషిమా దైచీలోని అణువిద్యుత్తు ప్లాంటులో విస్ఫోటం జరిగింది. ఈ సందర్భంగా జపాన్ కు జరిగిన నష్టాలు అన్నీ ఇన్నీ కాదు. ఈ సమయంలో తాజా సునామీ హోక్కైడో కోస్ట్ లైన్ ను తాకింది.
ఈ సమయంలో భారీ ఎత్తున అలలు తీరంపై విరుచుకుపడుతున్నాయి. దీంతో... స్థానిక పోర్టుతో పాటు ఎయిర్ పోర్టులూ మూతపడ్డాయి. అయితే... ఇప్పటికే జపాన్ తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ అవ్వడంతో.. అక్కడి కార్మికులు, ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో అనే ఆందోళనలు పెరిగాయి!
ఈ నేపథ్యంలో స్పందించిన జపాన్ వాతావరణ సంస్థ.. ఉత్తర జపాన్ లోని ఇషినోమాకి ఓడరేవు వద్ద 50 సెంటీమీటర్ల సునామీ గుర్తించబడిందని తెలిపింది. అయితే ఇప్పటివరకు గణనీయమైన నష్టం జరగలేదని అంటున్నారు.
అమెరికా తీరాలను చుట్టేస్తున్న సునామీ!:
మరోవైపు... అమెరికాలోని అలాస్కా, హవాయి, వాషింగ్టన్, ఓరెగాన్, నార్త్ కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో, సౌత్ కాలిఫోర్నియా తీరాలను సునామీ అలలు తాకాయి. ఈ సమయంలో.. రాష్ట్రం మొత్తం సునామీ హెచ్చరికలు వినిపించాయి. ఇలా ప్రభుత్వ హెచ్చరికలతో ప్రధానంగా ద్వీప రాష్ట్రం హవాయి మొత్తం ఖాళీ చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడున్న పర్యాటకులు, స్థానికులు సురక్షిత ప్రాంతాలకు పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు.
ఇదే సమయంలో రష్యాలో భూకంపం వల్ల సంభవించిన సునామీ ప్రభావం కాలిఫోర్నియానూ తాకింది. ఈ సమయంలో తాజాగా ఒక అడుగు కంటే ఎక్కువ ఎత్తులో అలలు కనిపించాయని మీడియా నివేదించింది. మరోవైపు హవాయిలోని మౌయి ద్వీపం ఉత్తర-మధ్య తీరంలో ఉన్న కహులుయిలో ఐదు అడుగులకు మించి సునామీ అలలు నమోదయ్యాయి.
బీచ్ లో పక్షుల వింత ప్రవర్తన!:
ప్రకృతి విపత్తులను పక్షులు, జంతువులు ముందుగానే గ్రహించగలవని అంటారు. ఈ క్రమంలో.. రష్యాలో భూకంపం ధాటికి సముద్రంలో అలజడిని అమెరికాలో పక్షులు ముందుగానే గుర్తించినట్లున్నాయి. ఈ క్రమంలో... సునామీ హెచ్చరికల నేపథ్యంలో కాలిఫోర్నియా లోని న్యూఫోర్ట్ బీచ్ లో పక్షులు ఒక్కసారిగా ఎగరడం, వింతగా ప్రవర్తించడం ఆసక్తిగా మారింది.
ఈ సందర్భంగా తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న వీడియోకు "కాలిఫోర్నియాలోని న్యూపోర్ట్ బీచ్ లో సునామీ హెచ్చరికకు ముందే గమనించిన పక్షుల వింత ప్రవర్తన" అని రాసుకొచ్చారు! ఈ సందర్భంగా... టెక్నాలజీతో పని లేకుండా ప్రకృతి మనిషిని హెచ్చరించే విధానం అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.