డీఎంకేతో పొత్తు ఎందుకంటే... కమల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎం.ఎన్.ఎం) అధినేత కమల్ హాసన్ త్వరలో రాజ్యసభలో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే.;
నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎం.ఎన్.ఎం) అధినేత కమల్ హాసన్ త్వరలో రాజ్యసభలో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా... డీఎంకే మద్దతుతో ఆయన పెద్దల సభకు వెళ్లనున్నారు. ఈ మేరకు అధికార డీఎంకే ఈ విషయంపై ఇప్పటికే అధికారిక ప్రకటన చేసింది. కమల్ ను రాజ్యసభకు పంపాలని స్టాలిన్ నిర్ణయించారు.
ఇలా.. డీఎంకేకు లభించే నలుగురు రాజ్యసభ అభ్యర్థుల్లో ఒకదానిలో కమల్ పేరు కన్ఫాం అయ్యింది. ఈ నేపథ్యంలో తాజాగా తేనాంపేటలోని అన్నా అరివాలయంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిశారు కమల్ హాసన్. ఈ సందర్భంగా సీఎంకు పుష్పగుచ్ఛం అందించిన ఆయన.. డీఎంకేతో పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... డీఎంకే నుంచి రాజ్యసభకు వెళ్లనున్న కమల్ హాసన్.. సీఎం స్టాలిన్ ను కలిశారు. ఈ సమయంలో ఆయన వెంట డిప్యూటీ సీఎం ఉదయనిధి, మంత్రులు వేలు, దురైమురుగన్, శేఖర్ బాబుతో పాటు డీఎంకే వ్యవస్థాపక కార్యదర్శి ఆర్.ఎస్.భారతి తదితరులు ఉన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... రాజ్యసభ ఎన్నికల సన్నాహాలపై సీఎంతో చర్చించినట్లు తెలిపారు. దేశానికి అవసరం కావడం వల్లే డీఎంకేతో పొత్తు పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా... తొలిసారి పార్లమెంట్ లో తన గళం వినిపించనుందని.. ఇకపై తన గళం తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలకోసమే ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని అన్నారు.
కాగా... రాజ్యసభలో ఖాళీగా ఉన్న ఎనిమిది స్థానాలకు వచ్చే నెల 19న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆరు తమిళనాడు నుంచే భర్తీ కానున్నాయి. వీటిలో నాలుగింటిని డీఎంకే, రెండింటిని అన్నాడీఎంకే దక్కించుకోనున్నాయి. ఈ నేపథ్యంలోనే డీఎంకే కు లభించే నలుగురు రాజ్యసభ అభ్యర్థుల్లో ఒకటి ఒప్పందం మేరకు ఎం.ఎన్.ఎం.కు కేటాయించారు.