ఎగువ సభలో కమల్ వాయిస్.. డీఎంకే కీలక నిర్ణయం!
ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ త్వరలో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కానున్నారు.;
ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ త్వరలో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కానున్నారు. గత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కమల్ హాసన్.. అధికార డీఎంకేతో పొత్తుపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఒప్పందంలో భాగంగా.. కమల్ ను రాజ్యసభకు పంపనుంది!
అవును... కమల్ హాసన్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కానున్నారు. డీఎంకే మద్దతుతో ఎగువ సభకు వెళ్లనున్నారు. ఈ మేరకు అధికార డీఎంకే ఈ విషయంపై అధికారిక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా తమిళనాడు నుంచి కమల్ హాసన్ ను రాజ్యసభకు పంపాలని స్టాలిన్ నిర్ణయించి.. ఆయన అభ్యర్థిత్వాన్ని కన్ఫాం చేశారు.
కాగా... రాజ్యసభలో ఖాళీగా ఉన్న ఎనిమిది స్థానాలకు వచ్చే నెల 19న ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఆరు తమిళనాడు నుంచే భర్తీ కానున్నాయి. వీటిలో నాలుగింటిని డీఎంకే, రెండింటిని అన్నాడీఎంకే దక్కించుకోనున్నాయి. ఈ నేపథ్యంలోనే డీఎంకే కు లభించే నలుగురు రాజ్యసభ అభ్యర్థుల్లో ఒకదానిలో కమల్ పేరు కన్ఫాం అయ్యింది.
వాస్తవానికి మక్కల్ నీది మయ్యమ్ పార్టీ పెట్టిన తర్వాత కమల్ హాసన్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే రానున్న ఎన్నికల్లో డీఎంకేతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో.. కమల్ హాసన్ ను రాజ్యసభకు పంపాలని డీఎంకే నిర్ణయించింది.
ఇక.. తమిళనాడుకు చెందిన ఆరుగురు ఎంపీల పదవీకాలం జూలై 25తో ముగియనుంది. ఆ ఆరుగురు ఎంపీలు... అన్బుమణి రామదాసు, ఎం షణ్ముగం, ఎన్ చంద్రశేఖరన్, ఎం మహ్మద్ అబ్దుల్లా, పి విల్సన్, వైకో!