నివేదిక వర్సెస్ లేఖ: రేవంత్-హరీష్‌ల మాటల యుద్ధం
''ఉమాభారతి ఓ లేఖ రాశారు. దీనిలో స్పష్టంగా ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టులను కట్టుకోవాలని.. వాటిని పూర్తి చేయాలని సూచించారు.;
తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి, బీఆర్ ఎస్ నాయకుడు హరీష్ రావుల మధ్య వాడి వేడిగా మాటల యుద్ధం సాగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపి జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికలో ని అంశాలను సీఎం రేవంత్ రెడ్డి చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆయన ఘోష్ నివేదికలోని 98పేజీలో ఉన్న వివరాలను చదువుతూ.. ``నాటి నీటి పారుదల శాఖ మంత్రి(హరీష్‌రావు) వ్యవస్థలను తప్పుదారి పట్టించారు.`` అని నివేదికలో స్పష్టంగా ఉంది. తీసి చదువుకోరాదా!`` అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. కేంద్రంలో అప్పటి జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి కేసీఆర్ సర్కారుకు రాసిన లేఖ విషయాన్ని కూడా సీఎం ప్రస్తావించారు.
''ఉమాభారతి ఓ లేఖ రాశారు. దీనిలో స్పష్టంగా ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టులను కట్టుకోవాలని.. వాటిని పూర్తి చేయాలని సూచించారు. అంతేకాదు.. కావాల్సినంత నీరు సమృద్ధిగా ఉందని కూడా చెప్పారు. కానీ, కేసీఆర్, హరీష్‌రావులు దీనిని పక్కన పెట్టా రు. కావాలంటే.. చూడండి.. ఈ లేఖ'' అంటూ.. నాడు ఉమాభారతి రాసిన లేఖలోని అంశాలను సీఎం రేవంత్ రెడ్డి చదవి వినిపిం చారు. అంతేకాదు.. నిజాం కన్నా ధనవంతుడు కావాలన్న దుగ్ధతోనే కేసీఆర్.. తెలంగాణ సమాజాన్ని దోచుకునేందుకు నీరు సమృద్ధిగా ఉందని చెప్పినా.. నాటి ఉమాభారతి లేఖను పక్కన పెట్టి దీనికి పూనుకొన్నారు.. అనిసీఎం నిప్పులు చెరిగారు.
అయితే.. ఈ సందర్భంగా హరీష్‌రావు జోక్యం చేసుకుని..ఉమాభారతి ఇచ్చిన లేఖలో కేవలం తొలి పేజీ మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి చదవివినిపించారని.. కానీ, మూడో పేజీలో ఏముందో కూడా ఆయన చదివి వినిపించాలని పట్టుబట్టారు. కానీ, ప్రసాదరావు మాత్రం మైక్ కట్ చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. పీసీ ఘోష్ రిపోర్టులో అన్నీ నిజాలే ఉన్నాయని.. ఈ విషయం తెలుసుకాబట్టే.. హరీష్‌రావు పదే పదే చర్చను పక్కదారి పట్టించేలా చేస్తున్నారని విమర్శించారు. ఎలాంటి విచారణ కోరుకుంటే.. అలాంటి విచారణకే ప్రభుత్వం ఆదేశిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే.. అసలు నివేదికకే పవిత్రత(శాంటిటీ) లేకపోతే.. ఇక, విచారణ ఎక్కడిది? అని హరీష్‌రావు మళ్లీ ప్రశ్నించారు.